‘ఐదో విడత’ బరిలో 695 మంది.. 159 మందిపై క్రిమినల్ కేసులు

దిశ, నేషనల్ బ్యూరో : ఐదో విడత లోక్‌సభ ఎన్నికల ప్రచార ఘట్టం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది.

Update: 2024-05-18 13:34 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఐదో విడత లోక్‌సభ ఎన్నికల ప్రచార ఘట్టం శనివారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. దీంతో ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 49 లోక్‌సభ స్థానాల్లో రాజకీయ పార్టీల హోరాహోరీ ప్రచార సంరంభానికి తెరపడింది. ఇక మే 20న జరిగే పోలింగ్‌లో 695 మంది అభ్యర్థుల భవితవ్యంపై ఓటర్లు తీర్పు ఇవ్వనున్నారు. ఈ విడతలో పోలింగ్ జరగనున్న మొత్తం 49 స్థానాల్లో ఉత్తరప్రదేశ్‌లో 14, మహారాష్ట్రలో 13, బెంగాల్‌లో 7, బిహార్, ఒడిశాలలో చెరో 5, జార్ఖండ్‌లో 3, జమ్మూకశ్మీర్, లడఖ్ లలో చెరో స్థానం ఉన్నాయి. ఈ దశలో పోటీ చేస్తున్న 695 మంది అభ్యర్థుల్లో 159 (23 శాతం) మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) తాజా నివేదిక తెలిపింది.దాదాపు 122 మంది హత్య, హత్యాయత్నం, మహిళలపై నేరాలకు సంబంధించి తీవ్రమైన నేరారోపణలను ఎదుర్కొంటున్నారని పేర్కొంది. వీరిలో 28 మంది అభ్యర్థులపై హత్యాయత్నం, నలుగురు అభ్యర్థులపై హత్య అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. మహిళలపై నేరాలకు పాల్పడిన 29 మంది అభ్యర్థుల్లో ఒక అభ్యర్థిపై అత్యాచారం అభియోగాలు కూడా ఉన్నాయని తెలిపింది. హింసను ప్రేరేపించడం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం వంటి అభియోగాలు పది మంది అభ్యర్థులపై ఉన్నాయని నివేదిక పేర్కొంది.

ఏ పార్టీలో ఎంతమందిపై.. ?

సమాజ్‌వాదీ పార్టీ, శివసేన, మజ్లిస్ పార్టీల అభ్యర్థుల్లో 50 శాతం మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ఎన్నికల అఫిడవిట్లలో ప్రస్తావించారని ఏడీఆర్ తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీకి చెందిన 10 మంది అభ్యర్థుల్లో ఐదుగురిపై, శివసేన (షిండే)కు చెందిన ఆరుగురు అభ్యర్థుల్లో ముగ్గురిపై, మజ్లిస్‌కు చెందిన నలుగురు అభ్యర్థులలో ఇద్దరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని చెప్పింది. బీజేపీకి చెందిన 40 మంది అభ్యర్థుల్లో 19 మందిపై, కాంగ్రెస్‌కు చెందిన 18 మంది అభ్యర్థుల్లో 8 మందిపై, టీఎంసీకి చెందిన 7 మంది అభ్యర్థులలో ముగ్గురిపై 3 మంది (43%), శివసేన (ఉద్ధవ్)కు చెందిన 8 మంది అభ్యర్థుల్లో ముగ్గురిపైనా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఆర్జేడీకి చెందిన నలుగురు అభ్యర్థుల్లో ఒకరిపై, బిజూ జనతా దళ్‌కు చెందిన ఐదుగురు అభ్యర్థుల్లో ఒకరిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి.

బరిలో ప్రముఖులు..

ఐదోవిడత ఎన్నికల బరిలో ఉన్న ప్రముఖుల్లో.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (రాయ్‌బరేలి), రక్షణ మంత్రి రాజ్ నాథ్ (లక్నో), కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (అమేథీ), వివాదాస్పద బీజేపీ నేత బ్రిజ్‌భూషణ్ కుమారుడు కరణ్ (కైసర్ గంజ్) ఉన్నారు.

Tags:    

Similar News