ప్రజలకు IMD చల్లటి కబురు.. మరో 48 గంటల్లో తీరాన్ని తాకనున్న నైరుతి రుతుపవనాలు

ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది.

Update: 2023-06-07 12:37 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలకు భారత వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. మరో 48 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని ప్రకటించింది. ‘రుతుపవనాల రాకకు దక్షిణ అరేబియా సముద్రం, లక్షద్వీప్‌, వాయువ్య, ఈశాన్య బంగాళాఖాతంలో వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రానున్న 48 గంటల్లో ఇవి కేరళ తీరాన్ని తాకే అవకాశముంది’ అని బుధవారం వాతావరణ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. తర్వాత క్రమంగా అన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని తెలిపింది.

కేరళ నుంచి కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మీదుగా దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు విస్తరిస్తాయి. ఇక, మే చివరి వారం నుంచి ఎండల తీవ్రత పెరిగింది. పగటి వేళల్లో అడుగు బయటపెట్టాలంటే ప్రజలు భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో రుతుపవనాల రాకపై ఐఎండీ తీపి కబురు చెప్పింది. అంతకుముందు రుతుపవనాల రాక ఆలస్యమయ్యే అవకాశముందంటూ ప్రైవేటు వాతావరణ శాఖ స్కైమేట్ అంచనా వేసింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్ తుఫాను కారణంగా.. రుతుపవనాల రాక మరో రెండు, మూడు రోజులు పట్టే అవకాశం ఉందని తెలిపింది.

ఈ నేపథ్యంలో స్కైమేట్ ప్రకటనను ఖండిస్తూ ఐఎండీ ప్రకటన విడుదల చేసింది. కాగా, అరేబియా సముద్రంలో ఏర్పడిన బిపోర్‌జాయ్‌ తుపాను వేగంగా బలపడుతోంది. తీవ్ర తుపానుగా మారిన బిపోర్‌జాయ్‌.. బుధవారం గోవాకు 890 కిలోమీటర్ల దూరంలో పశ్చిమాన - నైరుతి ప్రాంతంలో, ముంబయికి 1,000 కిలోమీటర్ల దూరంలో నైరుతిలో, పోర్‌బందర్‌కు 1,070 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన - నైరుతిలో, కరాచీకి 1,370 కిలోమీటర్ల దూరంలో దక్షిణాన కేంద్రీకృతమై ఉంది.

Tags:    

Similar News