'అదానీ-హిండెన్‌బర్గ్'పై అట్టుడికిన పార్లమెంట్.. సభల వాయిదా

బడ్జెట్ సమావేశాల్లో మరోసారి ప్రతిపక్షాల నిరసనలతో హోరెత్తాయి

Update: 2023-02-06 16:44 GMT

న్యూఢిల్లీ: బడ్జెట్ సమావేశాల్లో మరోసారి ప్రతిపక్షాల నిరసనలతో హోరెత్తాయి. సంచలనంగా మారిన అదానీ-హిండెన్ బర్గ్ వ్యవహారంపై విపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. గత రెండు సెషన్లలోనూ ఇదే అంశంపై నిరసనలు తెలిపిన ప్రతిపక్షాలు, సోమవారం మరింత తీవ్రం చేశాయి. పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ముందు ఫ్లకార్డు ప్రదర్శిస్తూ నిరసనలకు దిగాయి. అదానీ వ్యవహారంపై నిష్పక్షపాతంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశాయి. జాయింట్ పార్లమెంటరీ కమిటీ లేదా సుప్రీంకోర్టు పర్యవేక్షణలోని కమిటీ దర్యాప్తు చేపట్టాలని కోరాయి. ఎల్ఐసీ, ఎస్బీఐ రక్షించాలని నినాదాలు చేశాయి.

ఉదయం 11 గంటలకు సభ ప్రారంభం కాగా విపక్షాలు చర్చించాలని కోరుతూ తీర్మానించాయి. అయితే సభాధ్యక్షులు తిరస్కరించడంతో నిరసనలకు దిగాయి. దీంతో సభను 2 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన తర్వాత కూడా విపక్షాల నుంచి నిరసనలు వ్యక్తం కావడంతో సభాధ్యక్షులు ఉభయ సభలను వాయిదా వేశారు. మరోవైపు విపక్షాలన్నీ అదానీ వ్యవహారంపై కలిసికట్టుగా రానున్నట్లు కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరీ అన్నారు.

రాష్ట్రపతి ప్రసంగంపై చర్చకు సిద్దమేనని, అయితే ప్రధాని మోడీ ఈ అంశంపై సమాధానం ఇవ్వడమే తమకు మొదటి ప్రాధాన్యత అని కాంగ్రెస్ చీఫ్ మల్లిఖార్జున్ ఖర్గే అన్నారు. ఇరు సభల ప్రతిపక్ష సభ్యులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టడంతో పార్లమెంట్ మంగళవారానికి వాయిదా వేశారు.

Similar News