జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణ సస్పెండ్.. మాజీ ప్రధానిని లాగొద్దు

లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది.

Update: 2024-04-30 08:17 GMT

దిశ, నేషనల్ బ్యూరో: లోక్‌సభ ఎన్నికల వేళ కర్ణాటకలో తీవ్ర పరిణామం చోటుచేసుకుంది. మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లుగా హాసన్ నియోజకవర్గం నుంచి సిట్టింగ్ ఎంపీగా ఉన్న మాజీ ప్రధాని దేవగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణపై ఆరోపణలు రాగా తాజాగా ఆయనకు పార్టీ షాక్ ఇచ్చింది. మంగళవారం నాడు జేడీఎస్ నుంచి ప్రజ్వల్‌ను సస్పెండ్ చేశారు. దీంతో పాటు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది.

ఇటీవల ప్రజ్వల్ రేవణ్ణకు సంబంధించిన కొన్ని అసభ్యకర దృశ్యాలకు సంబంధించిన వీడియో క్లిప్‌లు సోషల్ మీడియాలో ప్రత్యక్షమయ్యాయి. దీంతో విపక్షాలు బీజేపీ, జేడీఎస్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో పార్టీ నుంచి ప్రజ్వల్‌ను సస్పెండ్ చేస్తూ కోర్ కమిటీ నిర్ణయం తీసుకుంది. రేవణ్ణపై వచ్చిన అభియోగాలన్నింటినీ విచారించేందుకు కర్ణాటక ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేసింది. విచారణ పూర్తయ్యే వరకు ప్రజ్వల్ సస్పెన్షన్‌ వేటు పడుతుందని కర్ణాటక మాజీ సీఎం, జేడీ(ఎస్‌) నేత హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. ఈ వ్యవహారంలోకి మాజీ ప్రధాని దేవేగౌడ పేరును లాగొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

ప్రజ్వల్ రేవణ్ణ 2019 నుంచి 2022 మధ్య కాలంలో తనపై పలుమార్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆయన ఇంట్లో పనిచేసే మహిళ ఇటీవల ఫిర్యాదు చేసింది. ప్రజ్వల్ తండ్రి హెచ్‌డీ రేవణ్ణ కూడా తన భార్య ఇంట్లో లేని సమయంలో తనపై లైంగిక దాడికి పాల్పడ్డాడని మహిళ ఆరోపించింది. దీంతో లైంగిక వేధింపులు, క్రిమినల్ బెదిరింపుల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News