కేజ్రీవాల్ పొలిటికల్ హిట్‌మ్యాన్.. ఆప్ ఎంపీ స్వాతి మలివాల్ పోస్టు

ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారంతో ముడిపడిన విషయాలు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి.

Update: 2024-05-17 14:05 GMT

దిశ, నేషనల్ బ్యూరో : ఆప్‌ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌పై దాడి వ్యవహారంతో ముడిపడిన విషయాలు ఒక్కటొక్కటిగా బయటికి వస్తున్నాయి. దీనికి సంబంధించి తాజాగా శుక్రవారం పలు కీలకమైన పరిణామాలు చోటుచేసుకున్నాయి. స్వాతి మలివాల్‌పై సీఎం కేజ్రీవాల్ మాజీ పర్సనల్ సెక్రెటరీ (పీఎస్) బిభవ్ కుమార్ దాడికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో కేజ్రీవాల్ భద్రతా సిబ్బందితో స్వాతి వాగ్వాదానికి దిగినట్లు కనిపిస్తోంది. ఈ వీడియోపై ట్విట్టర్ (ఎక్స్) వేదికగా స్పందించిన స్వాతి మలివాల్ సీఎం కేజ్రీవాల్‌‌పై పలు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ‘‘ఈ పొలిటికల్ హిట్‌మ్యాన్ తనను తాను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు మ్యాటర్ లేకుండా పోస్టులు వీడియోలను ప్రచారం చేయిస్తున్నాడు. ఈ కేసు నుంచి తనను తాను కాపాడుకోవాలని చూస్తున్నాడు. ఒకరిని కొడుతున్న వీడియో ఎవరు తీస్తారు? సీఎం ఇంటి మొత్తం సీసీటీవీ ఫుటేజీని తనిఖీ చేస్తే అసలు విషయం బయటకు వస్తుంది. ఎంతకైనా దిగజారిపో.. పైనుంచి దేవుడు అన్నీ చూస్తున్నాడు. ఏదో ఒకరోజు అన్ని విషయాలు ప్రపంచానికి తెలుస్తాయి” అని స్వాతి మలివాల్ తన పోస్టులో చెప్పుకొచ్చారు.

బిభవ్ వైపే కేజ్రీవాల్

స్వాతి మలివాల్‌పై దాడి కేసులో మాజీ పీఎస్ బిభవ్ కుమార్ వైపే సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ ఉన్నారని జాతీయ మహిళా కమిషన్ (ఎన్‌సీడబ్ల్యూ) ఛైర్ పర్సన్ రేఖా శర్మ వెల్లడించారు. స్వాతి మలివాల్‌ వైపు ఉండడం సీఎంకు ఇష్టం లేదని వెల్లడించారు. బాధితురాలు స్వాతి మలివాల్ కంటే నిందితుడు బిభవ్‌నే కేజ్రీవాల్ ఎక్కువగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. ‘‘ఎవరేం ఆలోచించినా.. దేన్నీ పట్టించుకోను అనే ధోరణిలో కేజ్రీవాల్ ఉన్నారు’’ అని రేఖా శర్మ కామెంట్ చేశారు. ఈ దాడి గురించి కేజ్రీవాల్‌కు తెలిసి ఉంటే.. ఆయన్ని కూడా ప్రశ్నించాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఈ కేసులో కేజ్రీవాల్ మాజీ పీఎస్ బిభవ్ కుమార్ జాతీయ మహిళా కమిషన్ ఎదుట శుక్రవారం హాజరుకావాల్సి ఉన్నా హాజరుకాలేదు. దీంతో రెండోసారి అతడికి ఎన్‌సీడబ్ల్యూ సమన్లు జారీ చేసింది.

కేజ్రీవాల్ నివాసానికి ఫోరెన్సిక్ టీం

ఎంపీ స్వాతి మలివాల్‌ ఫిర్యాదు, వాంగ్మూలం ప్రకారం ఢిల్లీ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఇప్పటికే బిభవ్‌పై కేసు నమోదు కాగా, తాజాగా శుక్రవారం మధ్యాహ్నం పోలీసులు, ఫోరెన్సిక్ టీం సీఎం కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. నివాసంలోని సీసీటీవీ ఫుటేజీని ఫోరెన్సిక్ టీం సేకరించినట్లు తెలుస్తోంది.

‘‘బిభవ్ నన్ను ఏడు సార్లు చెంపపై కొట్టారు. కడుపులో, ఛాతీ భాగాల్లో కాలితో తన్నారు’’ అని స్వాతి మలివాల్ ఆరోపించిన నేపథ్యంలో సీసీటీవీ ఫుటేజీ ఈ కేసులో కీలకంగా మారింది. కేజ్రీవాల్ నివాసంలోని లివింగ్ రూమ్‌లో ఈ దాడి జరిగింది. దీంతో అక్కడి సీసీటీవీ ఫుటేజీని పోలీసులు సేకరించి విశ్లేషించనున్నారు.

Similar News