భారత్‌‌పై అమెరికా ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టిన జైశంకర్

విదేశీ వలసదారులను అనుమతించేందుకు భారత్‌తో సహా ఇతర దేశాలు భయపడుతున్నాయని అమెరికా ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలపై శనివారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు.

Update: 2024-05-04 10:03 GMT

దిశ, నేషనల్ బ్యూరో: విదేశీ వలసదారులను అనుమతించేందుకు భారత్‌తో సహా ఇతర దేశాలు భయపడుతున్నాయని అమెరికా ప్రెసిడెంట్ చేసిన వ్యాఖ్యలపై శనివారం భారత విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అధ్యక్షుడు బైడెన్ వాదనలను తిరస్కరిస్తూ భారతదేశ ఆర్థిక వ్యవస్థ కుంటుపడలేదని, ప్రపంచ చరిత్రలో మాది చాలా ప్రత్యేకమైన దేశం, దీని గురించి సమాజానికి తెలుసు, వివిధ సమాజాల నుండి వేర్వేరు వ్యక్తులు భారతదేశానికి వస్తున్నారని అన్నారు.

పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) చట్టాన్ని ఉటంకిస్తూ, ఇది ఆపదలో ఉన్న వారికి భారత్‌లోకి అడుగుపెట్టడానికి అవకాశం కల్పిస్తుంది. పొరుగు దేశాల్లో హింస బారిన పడి పారిపోయి వచ్చిన వలసదారులను పౌరులుగా మార్చడానికి మేము అనుమతించాం, భారత్‌కు రావాల్సిన అవసరం ఉన్నవారికి, లోపలికి ఆహ్వనిస్తున్నాం, ఇండియాకు రండి అని జైశంకర్ అన్నారు.

అంతకుముందు అమెరికా ప్రెసిడెంట్ బైడెన్, భారత్, చైనా, జపాన్, రష్యాలు విదేశీ వలసదారులను అనుమతించేందుకు భయపడుతాయని అందుకే ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలు వేగంగా అభివృద్ధి చెందకుండా ఇబ్బంది పడుతున్నాయని, కానీ దానికి భిన్నంగా అమెరికా వలసదారులను అనుమతిస్తుందని, వారు ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందడానికి కారణమవుతారని వ్యాఖ్యానించారు.

బైడెన్ చేసిన ఈ వ్యాఖ్యలతో తీవ్ర దుమారం చెలరేగింది. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగిన అమెరికా, భారత్, జపాన్‌తో మాకు బలమైన సంబంధాలు ఉన్నాయి. వలసదారులు దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంత కీలకమో, అభివృద్ధికి వారి తోడ్పాటు ఎంత ముఖ్కమో బైడెన్ వివరించారని వైట్‌హౌస్ ప్రతినిధి వివరించారు.

Similar News