ఆర్థిక వ్యవస్థ ఎదిగినా..భారత్ పేద దేశమే:RBI మాజీ గవర్నర్

భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా..పేద దేశంగానే ఉంటుందని RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు.

Update: 2024-04-16 10:26 GMT

దిశ,వెబ్‌డెస్క్: భారత్ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదిగినా..పేద దేశంగానే ఉంటుందని RBI మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ధనిక దేశంగా మారినంత మాత్రాన అభివృద్ధి చెందిన దేశంగా చెప్పలేమన్నారు. 'నా దృష్టిలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించడం సాధ్యమే కానీ అది సంతోష పడాల్సిన విషయం కాదన్నారు.

ఎందుకంటే..140 కోట్ల జనాభా ఉన్నందున మనది అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుంది. అందులో ప్రజలు ఒక అంశం మాత్రమే. ప్రజలు ఉన్నారు కాబట్టే పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నాం. అయినప్పటికీ పేద దేశమే' అని దువ్వూరి సుబ్బారావు పేర్కొన్నారు. సౌదీ అరేబియా అందుకు సాక్ష్యమన్నారు. అది సంపన్న దేశమే అయినా ఇంకా అభివృద్ధి చెందిన దేశం కాలేకపోయిందని ఉదహరించారు. తలసరి ఆదాయం 2600 డాలర్లుగా ఉందని, ఇందులో భారత్‌ 139వ స్థానంలో ఉందన్నారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ అవతరిస్తుందని ప్రధాని మోడీ పేర్కొనడాన్ని ప్రస్తావించారు. దేశంలో సంక్షేమ ఫలాలు అందరికీ అంది, నిరుపేదలన్నవారు లేని రోజే అభివృద్ధి చెందిన దేశంగా భారత్ నిలుస్తుందని దువ్వూరి తన పుస్తకంలో పేర్కొన్నారు.

Similar News