మేం ఎవ్వరికీ మినహాయింపు ఇవ్వలేదు.. కేజ్రీవాల్‌కు బెయిల్‌పై ‘సుప్రీం’ స్పష్టీకరణ

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరులో మినహాయింపు లభించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది.

Update: 2024-05-16 11:41 GMT

దిశ, నేషనల్ బ్యూరో : లిక్కర్ స్కాం కేసులో నిందితుడిగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మధ్యంతర బెయిల్ మంజూరులో మినహాయింపు లభించిందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు స్పందించింది. ఈ తీర్పుపై విమర్శలను, విశ్లేషణను స్వాగతిస్తున్నామని గురువారం తెలిపింది. ‘‘కేజ్రీవాల్ జైలులో ఎప్పుడు లొంగిపోవాలో మా ఆదేశాల్లో స్పష్టంగా ఉంది. ఇది సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం. చట్టపాలన సమానత్వంతో ఉంటుంది. మేం ఎవ్వరికీ మినహాయింపు ఇవ్వలేదు’’ అని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టంచేసింది. ప్రజలు ఆప్‌ను గెలిపిస్తే జూన్‌ 2న తిరిగి జైలుకు వెళ్లాల్సిన అవసరం ఉండదని కేజ్రీవాల్‌ ఎన్నికల ప్రచార ప్రసంగాల్లో పేర్కొంటున్నారని ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్‌ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు. కేజ్రీవాల్ ఇలాంటి మాటలు మాట్లాడటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. దీనికి స్పందించిన ధర్మాసనం.. ‘‘అదంతా ఆయన (కేజ్రీవాల్) ఊహే. దానిపై మేం మాట్లాడానికి ఏమీ లేదు’’ అని తేల్చి చెప్పింది.

ఇక కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు కావడంపై కేంద్ర కేంద్ర హోం మంత్రి అమిత్‌షా చేసిన వ్యాఖ్యలను ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు ఎదుట ప్రస్తావించారు. ‘‘సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోంది’’ అని అమిత్‌షా చేసిన వ్యాఖ్యను న్యాయస్థానం ముందుంచారు. బుధవారం రోజు ప్రముఖ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అమిత్‌షా మాట్లాడుతూ.. ‘‘ఎన్నికల ప్రచారంలో కేజ్రీవాల్‌ చేసిన వ్యాఖ్యలు సుప్రీంకోర్టు తీర్పును ధిక్కరించేలా ఉన్నాయి. ఏదైనా కేసులో నిందితులుగా ఉన్నవారు ఎన్నికల్లో గెలిస్తే.. కేసులో దోషులుగా తేలినా వారిని కోర్టు జైలుకు పంపదని చెప్పేందుకు కేజ్రీవాల్ ప్రయత్నిస్తున్నారు. బెయిల్‌ను ఢిల్లీ సీఎం ఎలా ఉపయోగించుకుంటున్నారో మధ్యంతర బెయిల్‌ ఇచ్చిన న్యాయమూర్తులు ఆలోచించాలి’’ అని షా కామెంట్ చేశారు.

Tags:    

Similar News