స్వలింగ జంటల సమస్యలను పరిష్కరించేందుకు కేంద్రం కీలక నిర్ణయం..

Update: 2023-05-03 12:50 GMT

న్యూఢిల్లీ: స్వలింగ జంటల వివాహానికి చట్టబద్ధత కల్పించే అంశంలోకి వెళ్లకుండా.. వారికి సంబంధించిన కొన్ని ఆందోళనలను పరిష్కరించే దిశగా చర్యలను అన్వేషించడానికి కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం బుధవారం సుప్రీంకోర్టుకు తెలిపింది. ఈ విషయాన్ని కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డీ.వై. చంద్ర చూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనానికి నివేదించారు. స్వలింగ వివాహాలకు చట్టపరమైన గుర్తింపును కోరుతూ దాఖలైన పిటిషన్లపై ఏడో రోజు (బుధవారం) సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం వాదనలు విన్నది.

“స్వలింగ జంటలకు సంబంధించిన సమస్యల్లో కొన్నిటి పరిష్కారానికి తీసుకోవలసిన పరిపాలనా పరమైన చర్యలను గుర్తించేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది. ఇందుకోసం ఒకటి కంటే ఎక్కువ మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం అవసరం. అందుకే కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేయదలిచాం. ఈ విషయంలో ఎలాంటి పరిపాలనాపరమైన చర్యలు తీసుకోవాలనే దానిపై పిటిషనర్లు తమ సూచనలను రాజ్యాంగ ధర్మాసనానికి అందించవచ్చు" అని తుషార్ మెహతా ఈసందర్భంగా తెలిపారు.

స్వలింగ జంటల వివాహానికి చట్టపరమైన గుర్తింపు లేకపోయినా.. వారికి ఏవిధంగా సామాజిక ప్రయోజనాలను అందిస్తారనే దానిపై మే 3న బదులివ్వాలని ఏప్రిల్ 27న కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. స్వలింగ జంటలు కలిసి జీవించే హక్కును ప్రాథమిక హక్కుగా ఆమోదిస్తే, దాని సాంఘిక పర్యవసానాలను గుర్తించవలసిన కర్తవ్యం కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంటుందని తెలిపింది. దీనికి స్పందనగానే కేబినెట్ సెక్రటరీ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేస్తామని కేంద్రం తాజాగా ప్రకటించింది.

వాదనలు ఇలా సాగాయి..

ఈ సందర్భంగా సీజేఐ చంద్రచూడ్ మాట్లాడుతూ.. ‘‘పిటిషనర్లు ఈరోజు నుంచి తదుపరి విచారణ జరిగేలోగా తమ సూచనలను సమర్పించవచ్చు" అని వెల్లడించారు. అయితే ఈ సమస్య చాలా క్లిష్టంగా ఉందని, చట్టానికి వివరణ ఇవ్వడం అవసరమని పిటిషనర్ల తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ ధర్మాసనానికి తెలిపారు. దీనికి జస్టిస్ రవీంద్ర భట్ బదులిస్తూ.. "కొన్నిసార్లు ప్రారంభం చిన్నగానే ఉంటుంది" అని వ్యాఖ్య చేశారు.

జస్టిస్ SK కౌల్ మాట్లాడుతూ.. "ఇది అందరి హక్కులకు భంగం కలిగించదు.. ఒకవేళ స్వలింగ జంటలకు వివాహ హక్కులు మంజూరు చేస్తే శాసన, పరిపాలనా పరమైన విభాగాల్లో అనేక మార్పులు చేయాల్సిన అవసరం ఉంటుంది. వివాహం యొక్క లేబుల్ ఒక్కదాన్నే కాదు.. స్వలింగ సంపర్కం వల్ల ఉత్పన్నమయ్యే సమస్యలను పరిష్కరించడానికి కూడా ప్రభుత్వం చొరవ చూపాల్సి వస్తుంది " అని చెప్పారు. "పెళ్లి చేసుకోవాలనుకునే చిన్న పట్టణాల్లోని యువకుల తరఫున నేను మాట్లాడుతున్నాను.. దయచేసి వారిని పరిగణలోకి తీసుకోవాలి" అని పిటిషనర్ల తరఫు న్యాయవాది మేనకా గురుస్వామి సుప్రీం కోర్టు బెంచ్ ను కోరారు. చివరగా సీజేఐ చంద్రచూడ్ స్పందిస్తూ .. "సుప్రీం కోర్టు అనేది రాజ్యాంగ న్యాయస్థానం. యువకులు ఏమనుకుంటున్నారో దాని ప్రకారం మేం వెళితే సమస్య తలెత్తుతుంది. మేము ఈ వాదనను పరిగణలోకి తీసుకుం.. యావత్ దేశానికి ఏది అవసరం అనేదే మాకు ముఖ్యం" అని స్పష్టం చేశారు.

Tags:    

Similar News