ఆప్ ఎంపీ స్వాతిపై కేజ్రీవాల్ పీఏ ఎటాక్ .. అసలేం జరిగింది ?

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమ్‌ఆద్మీపార్టీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది.

Update: 2024-05-13 18:01 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఆమ్‌ఆద్మీపార్టీ ఇప్పుడు మరో వివాదంలో చిక్కుకుంది. ఆప్‌ రాజ్యసభ ఎంపీ, ఢిల్లీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ స్వాతి మలివాల్ సోమవారం ఆ పార్టీపై సంచలన ఆరోపణలు చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తిగత సహాయకుడు (పీఏ) బిభవ్ కుమార్ తనపై దాడి చేశారని ఆమె చెప్పుకొచ్చినట్లు సమాచారం. ఈ ఘటనకు సీఎం నివాసమే వేదిక కావడంతో ఈ వివాదం మరింత ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. జాతీయ మీడియా కథనాల ప్రకారం.. ఢిల్లీ సీఎం నివాసం నుంచి ఉదయం దాదాపు 9.30 గంటల టైంలో పోలీసులకు రెండు ఫోన్ కాల్స్ వచ్చాయి. కేజ్రీవాల్‌ పీఏ బిభవ్ కుమార్‌ తనపై దాడి చేశారంటూ పోలీసులకు స్వాతి చెప్పారని తెలుస్తోంది. ఈ విషయం విని పోలీసులు ఢిల్లీ సివిల్‌ లైన్స్‌లో ఉన్న సీఎం కేజ్రీవాల్ నివాసానికి హుటాహుటిన చేరుకున్నారు. అయితే అక్కడ స్వాతి మలివాల్ కనిపించలేదు. కొద్దిసేపటి తర్వాత పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఆమె.. తర్వాత కంప్లైంట్ ఇస్తానంటూ అక్కడి నుంచి వెళ్లిపోయినట్లు సమాచారం.

స్పందించని ఆప్, ఢిల్లీ సీఎం కార్యాలయం..

వారం పాటు విదేశీ పర్యటనకు వెళ్లిన స్వాతి మలివాల్ ఇటీవలే ఢిల్లీకి తిరిగొచ్చారు. కొన్ని రోజుల క్రితమే బెయిల్‌పై విడుదలైన అరవింద్ కేజ్రీవాల్‌ను కలిసేందుకు సోమవారం ఉదయాన్నే ఆయన ఇంటికి స్వాతి వెళ్లారు. ‘‘ఉదయం 9.40 గంటలకు డయల్ 100కు ఒక మహిళ ఫోన్ చేసింది. అయితే మొదట ఆమె పేరును చెప్పలేదు. ఆ తర్వాత ఉదయం 9.54 గంటలకు మరోసారి ఫోన్‌ కాల్‌ వచ్చినపుడు తన పేరు స్వాతి మలివాల్ అని చెప్పింది. సీఎం కేజ్రీవాల్ పీఏ తనపై దాడి చేసినట్లు ఆమె ఫిర్యాదు చేసింది’’ అని డీసీపీ మనోజ్ మీనా వివరించారు. వెంటనే సీఎం నివాసానికి తమ పోలీస్ టీమ్ వెళ్లిందని, అయితే ప్రొటోకాల్ కారణంగా లోపలికి నేరుగా ఎంటర్ కాలేకపోయిందని ఆయన చెప్పారు. తనపై దాడి జరిగినట్టు స్వాతి మలివాల్ చేసిన ఆరోపణలపై సీఎం రెసిడెన్స్ నుంచి కానీ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి కానీ ఎలాంటి స్పందన రాలేదు. స్వాతి మలివాల్ ఈ ఏడాది జనవరిలోనే ఆప్ తరఫున రాజ్యసభ సభ్యురాలిగా ఎన్నికయ్యారు.

బిభవ్ కుమార్ ఎవరు ?

బిభవ్ కుమార్ ప్రస్తుతం ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ పీఏగా పనిచేస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసుకు సంబంధించి ఈయనను ఈ ఏడాది ఫిబ్రవరిలో ఈడీ ప్రశ్నించింది. బిభవ్ సంబంధీకుల నివాసాలపై రైడ్స్ కూడా చేసింది. లిక్కర్ పాలసీతో ముడిపడిన కీలకమైన పత్రాల తయారీకి సంబంధించిన సమాచారాన్ని ఆయన నుంచి ఈడీ సేకరించింది. ఈడీ విచారించిన కొన్ని రోజుల తర్వాత బిభవ్ కుమార్‌ను ఢిల్లీ సీఎం పర్సనల్ సెక్రెటరీ హోదా నుంచి డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ తప్పించింది. అయితే 2007 నాటి ఓ పెండింగ్ కేసును కారణంగా చూపించి ఈ చర్యలు తీసుకుంది. 2007 సంవత్సరంలో ఓ ప్రభుత్వ పని చేయకుండా సర్కారీ ఉద్యోగులను అడ్డుకున్నారనే అభియోగం బిభవ్‌పై ఉందని డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ వెల్లడించింది. దీన్ని సవాల్ చేస్తూ సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌ (క్యాట్)ను బిభవ్ ఆశ్రయించారు. అయితే అక్కడ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. ఈవిషయంలో తాము ప్రస్తుత దశలో జోక్యం చేసుకోలేమని క్యాట్ స్పష్టం చేసింది.

Tags:    

Similar News