జమ్మూకశ్మీర్‌లో ఓటు వేసిన 102 ఏళ్ల వృద్ధుడు

శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో భాగంగా 102 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధుడు హాజీ కరమ్ దిన్ ఓటు వేశాడు

Update: 2024-04-26 07:31 GMT

దిశ, నేషనల్ బ్యూరో: శుక్రవారం జమ్మూకశ్మీర్‌లో లోక్‌సభ ఎన్నికల రెండో విడతలో భాగంగా 102 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధుడు హాజీ కరమ్ దిన్ ఓటు వేశాడు. ఉదయం ఓటింగ్ ప్రకియ మొదులుకాగానే, తన కుటుంబసభ్యుల సహాకారంతో చేతిలో వాకింగ్ స్టిక్‌తో జమ్మూ నియోజకవర్గంలోని రియాసి జిల్లాలోని పోలింగ్ స్టేషన్‌‌కు చేరుకుని ఓటు వేశాడు. ఓటు వేసిన అనంతరం తన సిరా వేసిన వేలిని చూపిస్తూ బూత్ బయట ఫొటోలకు పోజులిచ్చాడు. "ఈ వయస్సులో ఈ పోలింగ్ స్టేషన్‌లో ఓటు వేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ప్రతి ఎన్నికల్లో ఓటు వేశాను. 102 సంవత్సరాల వయస్సులో కూడా ఈ ప్రయాణం నేటికీ కొనసాగుతోంది. అందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని'' మీడియాతో అన్నారు.

రియాసి జిల్లా జమ్మూ పార్లమెంటరీ నియోజకవర్గంలో భాగంగా ఉంది. ఇక్కడ 22 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని నిర్ణయించడానికి 17.81 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్ బుత్‌కు చేరుకుంటున్నారు. కొందరు సంప్రదాయ డోగ్రా దుస్తులు ధరించి ఓటు వేశారు. నియోజకవర్గంలోని 2,416 పోలింగ్ కేంద్రాల్లో ఉదయం 9 గంటల వరకు 10.39 శాతం ఓట్లు పోలయ్యాయి. ఇవి ఆగస్టు 5, 2019న ఆర్టికల్ 370 రద్దు తరువాత జమ్మూకశ్మీర్‌లో జరుగుతున్న మొదటి ప్రధాన ఎన్నికలు కావడం గమనార్హం.

Similar News