ఎమ్మెల్సీ బరిలో ఇండిపెండెంట్లు.. గులాబీ నేతల్లో టెన్షన్.. టెన్షన్..!

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థులు పోటా పోటీగా నామినేషన్లు వేశారు. బీజేపీ పోటీకి దూరంగా ఉండగా, కాంగ్రెస్ రెండు జిల్లాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. అధికార పార్టీ 12 స్థానాలకు గాను పన్నెండింటిలో బరిలో నిలిచింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసి బరిలో నిలుస్తామని స్పష్టం చేస్తుండటంతో అధికారపార్టీకి గట్టీ పోటీ ఏర్పడే అవకాశం ఉంది. నేడు నామినేషన్ల పరిశీలన, […]

Update: 2021-11-23 19:00 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు స్వతంత్ర అభ్యర్థులు పోటా పోటీగా నామినేషన్లు వేశారు. బీజేపీ పోటీకి దూరంగా ఉండగా, కాంగ్రెస్ రెండు జిల్లాల్లో మాత్రమే పోటీ చేస్తుంది. అధికార పార్టీ 12 స్థానాలకు గాను పన్నెండింటిలో బరిలో నిలిచింది. దీంతో స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసి బరిలో నిలుస్తామని స్పష్టం చేస్తుండటంతో అధికారపార్టీకి గట్టీ పోటీ ఏర్పడే అవకాశం ఉంది. నేడు నామినేషన్ల పరిశీలన, ఈ నెల 26న ఉపసంహరణ ఉండటంతో ఎవరూ బరిలో ఉంటారో అనేది స్పష్టం కానుంది.

రాష్ట్రంలోని 9 జిల్లాల్లో 12 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మంగళవారం నామినేషన్లకు చివరి తేదీ కావడంతో ఇండిపెండెంట్ అభ్యర్థులు భారీగా నామినేషన్లు వేశారు. మొత్తం 94 మంది నామినేషన్ వేయగా, అందులో టీఆర్ఎస్‌కు చెందిన వారు 12 మంది కాగా, కాంగ్రెస్‌కు చెందిన వారు ఐదుగురు ఉన్నారు. 77 మంది ఇండిపెండెంట్ అభ్యర్థులు నామినేషన్ వేశారు.

ఆదిలాబాద్ జిల్లాలో 23 మంది… 28 సెట్లు దాఖలు చేశారు. అందులో టీఆర్ఎస్ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఒకరు కాగా, మిగిలిన 21 మంది స్వతంత్ర అభ్యర్థులు. టీఆర్ఎస్ అభ్యర్థి విఠల్ నాలుగు సెట్లు దాఖలు చేశారు. వరంగల్‌ 16 మంది 16 నామినేషన్లు వేశారు. ఇందులో కాంగ్రెస్ చెందిన వారు ఇద్దరు, టీఆర్ఎస్‌కు చెందిన వారు ఒకరు కాగా, 13 మంది ఇండిపెండెంట్లు ఉన్నారు

నల్లగొండ‌లో 11 మంది 13 సెట్ల నామినేషన్లు వేశారు. ఇందులో 10 మంది స్వతంత్ర అభ్యర్థులే. అందులో ఇద్దరు జడ్పీటీసీలు కాగా, 8 మంది ఎంపీటీసీలు ఉన్నారు. మెదక్ నుంచి నలుగురు… 7 సెట్ల నామినేషన్ వేశారు. ఇందులో ఒకరు టీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఒకరు, ఇద్దరు ఇండిపెండెంట్లు ఉన్నారు. నిజామాబాద్‌లో ఇద్దరు… 5 సెట్లు నామినేషన్ వేయగా అందులో కవిత నాలుగు సెట్ల నామినేషన్ వేయడం గమనార్హం. ఇండిపెండెంట్ అభ్యర్థిగా కోటగిరి శ్రీనివాస్ నామినేషన్ వేశారు.

ఇక ఖమ్మంలో ముగ్గురు… 6 సెట్లు నామినేషన్లు వేశారు. టీఆర్ఎస్ నుంచి ఒకరు, కాంగ్రెస్ నుంచి ఒకరు, మరొకరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా సుధారాణి నామినేషన్ వేశారు. కరీంనగర్‌లో 22 మంది… 33 సెట్ల నామినేషన్లు వేశారు. ఇందులో 20 మంది ఇండిపెండెంట్లే. మహబూబ్‌నగర్‌లో 10 మంది…14 సెట్ల నామినేషన్లు వేయగా, 8 మంది స్వతంత్ర అభ్యర్థులు. రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలో ముగ్గురు… మూడు నామినేషన్లు వేశారు. ఇందులో ఇండిపెండెంట్ అభ్యర్థిగా చంద్రశేఖర్ నామినేషన్ వేశారు.

నామినేషన్లు వేసిన టీఆర్ఎస్ అభ్యర్థులు..

అధిష్టానం స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థులుగా ఎంపిక చేసి భీపారాలు అందజేయడంతో ఆదిలాబాద్‌లో దండె విఠల్, మహబూబ్‌నగర్‌లో కూచకుళ్ల దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, కరీంనగర్‌లో టీ.భానుప్రసాద్ రావు, ఎల్ .రమణ, నిజామాబాద్‌లో కల్వకుంట్ల కవిత, నల్లగొండలో ఎంసీ కోటిరెడ్డి, రంగారెడ్డిలో శంభీపూర్ రాజు, పట్నం మహేందర్ రెడ్డి, ఖమ్మంలో తాతా మధు, మెదక్ డాక్టర్ మర్రి యాదవరెడ్డి, వరంగల్‌లో పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి నామినేషన్లు వేశారు.

అధిక సంఖ్యలో స్వతంత్ర అభ్యర్థులు బరిలో నిలువడంతో టీఆర్ఎస్ పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా స్థానిక సంస్థల సభ్యులు సమస్యల పరిష్కారం కోసం బరిలో నిలువడంతో ఏం చేయాలనే ఆలోచనలో పడింది. వారిని ఎలాగైనా ఉపసంహరింపజేయాలని భావిస్తోంది. అయితే సమస్యల పరిష్కారం కోసం పట్డుబడుతుండటంతో ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తే ఉపసంహరించుకుంటారా లేదా అనేదానిపై ఆసక్తి నెలకొంది. నేడు నామినేషన్ల పరిశీలన ఉండటంతో ఇండిపెండెంట్ అభ్యర్థులపై ఒత్తిడి తెచ్చి ఏకగ్రీవం అయ్యేలా చూసేందుకు అధికారపార్టీ నేతలు సర్వశక్తులు ఒడ్డుతున్నారు.

Tags:    

Similar News