రైతు రాజ్యం

Poem on Farmers

Update: 2024-03-11 06:41 GMT

రైతు దేశానికి కంటి చూపులు

మట్టిలోంచి పత్తి పువ్వు లాంటి

అన్నం మెతుకులు తీసి కాపులు

రబ్బర్ పిలట్ ఏదో ఒకటి

కళ్ళని కుళ్ల పొడిస్తే

పట్టపగలు దేశం

చిమ్మన్ చీకటి అవుతుంది

రైతు దేశానికి వెన్నెముక

చక్కెర పూత చేదు మాత్ర

చప్పరించేందుకు నోరూరిస్తుంది

బ్యాక్ బోన్ను విరగ్గొడితే

దేశం నడవలేక నేల మీద పాకుతుంది

వ్యవసాయానికి ఊతమంటే

మందులు చల్లే కష్టం తీరిందనుకున్నం

ఎవుసందారుల మీద డ్రోన్ల తో

టియర్ గ్యాస్ ను ప్రయోగిస్తారనుకోలేదు

గ్రామ సంపదనుతరలించవచ్చని

నిగనిగలాడే రహదారులు వేశారు

ఆ దారులే ముట్టడికి

ఇప్పుడు దగ్గరి తొవ్వలైనయ్

కార్పొరేట్లకు దేశ సంపదను

పలారంలో పంచి పెట్టవచ్చు

రైతు పంటకు మద్దతు ధర ఇస్తే

దేశం తలకిందులు అవుతుంది

అవును దేశం ఇప్పుడు

తలకిందులు గానే శీర్షాసనం వేసి

అతి గొప్ప ఆర్థిక శక్తిగా నడుస్తుంది

నిరసన వాళ్ళ హక్కు

నిజము వాళ్ళ వాక్కు

ఎద్దు ఏడ్చిన ఎవుసం

రైతు ఏడ్చిన రాజ్యం

ఎన్నటికీ పోగు పోయదు

ఎప్పటికీ బాగుపడదు

-జూకంటి జగన్నాథం

94410 78095

Tags:    

Similar News