బంధం

poem

Update: 2024-03-31 18:30 GMT

మౌమితా..

మీ తల్లి ఎవరో

ఆమె మహోన్నత ప్రేమ బంధమేమిటో

మాకు తెలీక పోవొచ్చు

కానీ..

నీకు ఇక్కడొక తల్లి ఉంది

తెలంగాణ తల్లి.

ఆమె

గడప మీద కూచున్న ముసలి తల్లి

క్షితిజ రేఖ కేసి చూపు సారించి

వలసబోయిన కొడుక్కోసం

ఎదురు చూసినట్టు

నీకై ఎదురుచూస్తుంటది

తీరం మీద తిరుగాడుతూ

ఎగిసి పడ్తున్న అలలమీదుగా

చూపులు సారించి

పడవ మునక తర్వాత

కొడుక్కోసం గుండెలెగిరి పడ్డట్టు

నీ కోసం ఆరాటం పడ్తుంటది

మౌమితా..

మీ నేల ఎట్లాంటిదో

పండే పంట లేమిటో

తెలీకపోవొచ్చు

కాని.. మాతెలంగాణ

ప్రేమ పంటల మాగాణి,

నువ్వెప్పుడొచ్చినా

హృదయాన్ని

రెడ్ కార్పెట్‌లా పర్చి

స్వాగతించడాన్కి సిద్ధంగా ఉంటది

కొత్త పొద్దులకోసం

వేల వసంతాలై విరబూస్తది

మాకిప్పుడు

వేలాది మౌమితాలు గావాలి

మనం

ఉపనదులు కలగల్సిన

సజీవనదిలా సాగిపోదాం

మనం మాట్లాడుదాం

చర్చిద్దాం, విభేదించుదాం

కల్సిపోదాం, ఆడుదాం, పాడుదాం

అంతిమంగా

నియంత ముఖం మీద

ఉమ్మేద్దాం

ఈ ప్రేమానుబంధాలు

కలకాలం వర్ధిల్లనీ...

ఉదయమిత్ర

89196 50545

Tags:    

Similar News