ఈ వ్యక్తి శరీరమే ఓ వైన్ షాప్.. తనంతట తాను ఆల్కహాల్ తయారు చేసుకుంటున్న బాడీ..

బెల్జియంకు చెందిన ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడని పోలీసులు అరెస్టు చేశారు. భారీగా జరిమానా విధించారు. అయితే తను ఎలాంటి తప్పు చేయలేదని.. అసలు నేను తాగనని వాదించాడు బాధితుడు

Update: 2024-05-05 10:40 GMT

దిశ, ఫీచర్స్: బెల్జియంకు చెందిన ఓ వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడని పోలీసులు అరెస్టు చేశారు. భారీగా జరిమానా విధించారు. అయితే తను ఎలాంటి తప్పు చేయలేదని.. అసలు నేను తాగనని వాదించాడు బాధితుడు. ఈ విషయంలో కోర్టు వరకు వెళ్లాడు. చివరకు ఆయనను పరీక్షించిన వైద్యులు అతడు తాగలేదు కానీ ఆయన బాడీ ఆటోమేటిక్ గా ఆల్కహాల్ ఉత్పత్తి చేస్తుందని తెలిపారు. దీన్ని గట్ ఫెర్మెంటేషన్ సిండ్రోమ్ (GFS) లేదా ఆటో-బ్రూవరీ సిండ్రోమ్(ABS) అంటారని వివరించారు. శరీరం జీర్ణశయాంతర ప్రేగులలో ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే అరుదైన పరిస్థితిగా పేర్కొన్నారు. ఈ ప్రాసెస్ లో కార్బోహైడ్రేట్స్.. ఫెర్మెంటేషన్ ద్వారా ఆల్కహాల్ గా మార్చబడతాయని వివరించారు. అయితే ఈ కండిషన్ ఎందుకు తలెత్తుతుంది? ఆరోగ్యపరంగా ఏమైనా నష్టలున్నాయా? ఉంటే ట్రీట్మెంట్ ఏమైనా ఉందా? తెలుసుకుందాం.

ఎవరు ఎఫెక్ట్ అవుతారు?

ఆడ, మగ ఎవరైనా వయసుతో సంబంధం లేకుండా ABSకు ప్రభావితం అవుతారు. ముఖ్యంగా డయాబెటిస్, ఒబేసిటీ, రోగనిరోధక వ్యవస్థ, గట్ హెల్త్ ను ఎఫెక్ట్ చేసే కండిషన్స్ తో బాధపడుతున్న వారిలో సాధారణం. ADH (ఆల్కహాల్ డీహైడ్రోజినేస్) మరియు ALDH (ఆల్డిహైడ్ డీహైడ్రోజినేస్) జన్యు పాలిమార్ఫిజమ్‌లు ఉన్న వ్యక్తులు ఇథనాల్‌ను జీవక్రియ చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇది ఆల్కహాల్ మత్తు లక్షణాలను మరింత తీవ్రతరం చేస్తుంది. అంటే ADH, ALDH జన్యువులు మరియు వాటి పాలిమార్ఫిజమ్‌ల మధ్య పరస్పర చర్య వల్ల ABS పరిస్థితి తలెత్తుతుంది.

ఎలా వస్తుంది?

చిన్న ప్రేగులలో కొన్ని కిణ్వ ప్రక్రియ సూక్ష్మజీవుల అసమతుల్యత లేదా అధిక పెరుగుదల ఉన్నప్పుడు ABS యుక్తవయస్సులోనే వస్తుంది. ఈ అసాధారణ సూక్ష్మజీవుల వాతావరణం ఆహారపు కార్బోహైడ్రేట్‌లను ఇథనాల్‌గా పులియబెట్టడానికి దారితీస్తుంది. దీనివల్ల మత్తు లాంటి ప్రభావాలు ఏర్పడతాయి.

లక్షణాలు

సింప్టమ్స్ ఆల్కహాల్ తీసుకున్నపుడు ఉండేంత మత్తుతో సమానంగా ఉంటాయి. రక్తంలో ఆల్కహాల్ స్థాయిలు పెరగడం, స్పష్టంగా మాట్లాడకపోవడం, గందరగోళం, చర్మం ఎర్రబడటం జరుగుతుంది. ఈ పరిస్థితి ఉన్న వ్యక్తులు ఉబ్బరం, డయేరియా వంటి జీర్ణశయాంతర లక్షణాలను కూడా కలిగి ఉంటారు.

సమస్యకు పరిష్కారం?

రెగ్యులర్ గా తీసుకునే ఆహారంలో మార్పులు చేయాలి. కార్బోహైడ్రేట్లు, చక్కెరలను తీసుకోవడాన్ని తగ్గించాలి. కొన్ని సందర్భాల్లో ప్రోబయోటిక్స్/యాంటీ ఫంగల్ మందులు తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తారు. ఆల్కహాల్ అధిక ఉత్పత్తికి కారణమయ్యే ఈస్ట్‌ లేదా బ్యాక్టీరియాను లక్ష్యంగా చేసుకుని కొన్ని యాంటీబయాటిక్స్ కూడా ఇస్తారు. అంతేకాదు ఆటో-బ్రూవరీ సిండ్రోమ్ కు కారణం అవుతున్న డయాబెటిస్ లేదా ఇమ్యునో డిఫిషియెన్సీ డిజార్డర్స్ ట్రీట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది.

Similar News