గడువు ముగిసిన ఆహార పదార్థాలు ఎందుకు ప్రమాదకరం?.. అనుకోకుండా తింటే ఏం చేయాలి?

ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థతకు గురవుతుంటారనే వార్తలు మనం తరచూ వింటుంటాం. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగానూ మారుతుంది. అయితే ఇందుకు గల ప్రధాన కారణాల్లో గడువు ముగిసిన ఆహారం తీసుకోవడం కూడా ఒకటి.

Update: 2024-04-29 08:04 GMT

దిశ, ఫీచర్స్ : ఫుడ్ పాయిజనింగ్ వల్ల అస్వస్థతకు గురవుతుంటారనే వార్తలు మనం తరచూ వింటుంటాం. కొన్ని సందర్భాల్లో ఇది ప్రాణాంతకంగానూ మారుతుంది. అయితే ఇందుకు గల ప్రధాన కారణాల్లో గడువు ముగిసిన ఆహారం తీసుకోవడం కూడా ఒకటి. సాధారణంగా మనం తినే ప్రతీ ఆహార పదార్థానికి ఒక గడువు తేదీ ఉంటుంది. ఇంట్లోనే తయారు చేసుకునే పదార్థాల విషయంలో అయితే అవి ఎప్పుడు వండారు? ఎన్నిరోజుల వరకు తినవచ్చు అనే విషయాలపట్ల ఒక క్లారిటీ ఉంటుంది. కానీ బయట కొన్న వాటికి ఇలాంటి గ్యారెంటీ ఏమీ ఉండదు. ఉన్నా పూర్తిగా నమ్మలేని పరిస్థితి.

మార్కెట్లో కొనే ఆహార పదార్థాలపై ఎక్స్‌పైరీ డేట్ ఉన్నప్పటికీ కొన్నిసార్లు మనం వాటిని పట్టించుకోకుండా వదిలేస్తుంటాం. క్వాలిటీ ఉన్నవి, గడువు ఉన్నవే అమ్ముతారనే గుడ్డి నమ్మకంతో కూడా కొన్నిసార్లు ఇలా చేస్తుంటాం. ఫ్రిడ్జ్‌లో పెట్టి అవసరం అయినప్పుడు తింటుంటాం. ఫ్రెష్‌గానే ఉన్నాయి కదా.. తింటే ఏం అవుతుంది? అనుకుంటాం. అయితే అనుకోకుండా తిన్నా.. ఏం కాదులే అనుకొని తిన్నా.. ఎక్స్‌పైరీ డేట్ ముగిసిన పదార్థాలు ప్రాణాంతకమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలో రసాయన మార్పులు జరుగుతాయి. అంతేకాకుండా సాల్మనెల్లా, ఇ. కొలీ లేదా లిస్టేరియా, ఇతర హానికర బ్యాక్టీరియాలు, ఫంగస్‌లు చేరుతుంటాయి.

ఏం జరుగుతుంది?

గడువు ముగిసిన పదార్థాల్లో హానికారక బ్యాక్టీరియా పేరుకుపోతుంది కాబట్టి వాటిని తినడంవల్ల ఫుడ్ పాయిజనింగ్ ఏర్పడి తీవ్ర అనారోగ్యం సంభవిస్తుంది. వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, జ్వరం, వికారం, తలనొప్పి వంటివి సంభవిస్తాయి. కొన్నిసార్లు ఫుడ్ పాయిజనింగ్ ప్రాణాంతకం కావచ్చు. ఒక్కోసారి అలెర్జీలు, శ్వాసకోశ ఇబ్బందులు, నరాల బలహీనత వంటి సమస్యలకు గడువు ముగిసిన పదార్థాలు తినడం కారణం అవుతుంది.

ఎలా గుర్తు పట్టాలి ?

తాజా ఆహారానికి, గడువు ముగిసిన ఆహారానికి తేడాను గుర్తించడం పెద్ద విషయం ఏమీ కాదు. ఎక్స్‌పైరీ డేట్ అయిపోతే ఆ పదార్థాలు రంగు, రుచి, షేప్ మారిపోయి ఉంటాయి. దుర్వాసన వస్తుంది. వీటిని తింటే రోగాలు, జీర్ణాశయ వ్యాధులు కూడా వస్తాయి. మార్కెట్లో దొరికే కొన్ని పదార్థాలను ఎక్కువ రోజులు నిల్వ ఉంచాలనే ఉద్దేశంతో వాటిలో బిస్పినాల్ అండ్ థాలేట్స్ వంటి హానికర కెమికల్స్ మిక్స్ చేస్తుంటారు. ఇవి చాలా ప్రమాదకరం.

అనుకోకుండా తింటే ఏం చేయాలి?

చూడకుండానో, అనుకోకుండానో గడువు ముగిసిన ఆహార పదార్థాలు తింటుంటారు కొందరు. తర్వాత అసలు విషయం తెలిసి కంగారు పడుతుంటారు. కానీ ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి. ఇబ్బంది అనిపించినప్పటికీ ప్రతీ పదార్థం ఒకే విధమైన హాని చేయకపోవచ్చు. అన్నీ ప్రాణాంతకం కాకపోవచ్చు. కాబట్టి వెంటనే కంగారు పడవద్దని నిపుణులు సూచిస్తున్నారు. ప్రశాంతంగా ఉంటూ డీప్ బ్రీత్ తీసుకోవాలి. ఎటువంటి సింప్టమ్స్ ఫేస్ చేస్తున్నారో శ్రద్ధగా గమనించి తమకు ఏర్పడిన ఇబ్బందులను కుటుంబ సభ్యులకు, డాక్టర్లకు తెలియజేయాలి. ఎందుకంటే లక్షణాలను బట్టి చికిత్స చేయడం డాక్టర్లకు సలువు అవుతుంది. దీంతోపాటు ఫుడ్ పాయిజనింగ్ లక్షణాలు ఉన్నప్పుడు నీరు అధికంగా తాగూతూ ఉండాలి. దీనివల్ల బాడీలోని కొన్ని టాక్సినేషన్స్ యూరిన్, వాంతుల రూపంలో బయటకు వెళ్లే చాన్సెస్ ఉంటాయి.

Similar News