గెజిటెడ్ ఉద్యోగులకు బ్యాడ్‌న్యూస్

దిశ, న్యూస్ బ్యూరో : ఆంక్షలతో కూడిన హామీ నెరవేరుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపు ఈ నెల నుంచి వర్తించే అవకాశాలున్నాయి. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని సమాచారం. గెజిటెడ్ హోదా ఉన్నవారికి అవకాశం లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ ఫైల్‌ను సిద్ధం చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ సూచనలతో ఉన్నతాధికారులు సమావేశ మయ్యారు. తమిళనాడులో అమలవుతున్న విధానాలనూ పరిశీలించారు. ఆర్థిక శాఖ నుంచి రామకృష్ణారావు, సీఎంఓ నుంచి […]

Update: 2020-08-25 21:21 GMT

దిశ, న్యూస్ బ్యూరో : ఆంక్షలతో కూడిన హామీ నెరవేరుతోంది. ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ పెంపు ఈ నెల నుంచి వర్తించే అవకాశాలున్నాయి. నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు మాత్రమే ఈ అవకాశం ఉంటుందని సమాచారం. గెజిటెడ్ హోదా ఉన్నవారికి అవకాశం లేదని చెబుతున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖ ఫైల్‌ను సిద్ధం చేసింది. మంగళవారం సీఎం కేసీఆర్ సూచనలతో ఉన్నతాధికారులు సమావేశ మయ్యారు. తమిళనాడులో అమలవుతున్న విధానాలనూ పరిశీలించారు. ఆర్థిక శాఖ నుంచి రామకృష్ణారావు, సీఎంఓ నుంచి నర్సింగారావు, మరో ఉన్నతాధికారి మాణిక్‌రాజ్ సమావేశమై తుది నివేదికలను సిద్ధం చేశారు.

సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాల జేఏసీతో ఈ నెల 27న భేటీ కానున్నారని సమాచారం. ఆ తరువాతే ఆర్డినెన్స్ తీసుకు వస్తారని అంటున్నారు. 60 ఏండ్లకు ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ చేసే విధంగా ఆర్డినెన్స్ తీసుకువస్తున్న ప్రభుత్వం దానిలో కొంతమందికి మినహాయిస్తోంది. గెజిటెడ్ నుంచి ఆ పై స్థాయి అధికారులకు పదవీ విరమణ పెం పు వర్తించకుండా నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. రెవన్యూ వ్యవస్థ… అందులోనూ తాసీల్దార్లంటే గుర్రుగా ఉన్న సీఎం కేసీఆర్ గెజిటెడ్ అధికారులకు రిటైర్మెంట్ ఏజ్ పెంపు వర్తించకుండా ఉద్యోగులకే పరిమితం చేయనున్నట్లు చెబుతున్నారు. ఉపాధ్యాయులకు ఉద్యోగ విరమణ వయస్సు పెంపు ఉండదని అంటున్నారు.

వాళ్లు కూడా వద్దంటున్నారు

ఉద్యోగ సంఘాల జేఏసీలోని భాగస్వామ్యపక్షాలు కొన్ని రోజులుగా ప్రభుత్వంపై వ్యతిరేకతతో ఉన్నాయి. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా తీర్చలేదు. పీఆర్సీ ఊసే లేకపోవడం, అంతర్రాష్ట్ర బదిలీలు చేయకపోవడం, పదోన్నతులు కల్పించకపోవడంతో పాటుగా కనీసం రెగ్యులర్‌గా ఉద్యోగులకు వచ్చే డీఏను సైతం పెండింగ్ పెట్టడంతో ఉద్యోగ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. జేఏసీ తరుపున పలుమార్లు విన్నవించినా ఫలితం లేకుండా పోయింది. పదవీ విరమణ పెంపుపై ఏడాదిన్నర కాలంగా ఆశలు పెట్టుకున్నారు. కొంతమంది ఉద్యోగ సంఘాల నేతలు ఎలాగో పొడగింపును తెచ్చుకుంటున్నారు. దిగువస్థాయిలో ఉద్యోగులకు మాత్రం పొడగింపు రావడం లేదు. ఫైరవీలు చేసుకునే స్తోమత కూడా లేదు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ హామీ నెరవేరుతుందని ఆశతో ఉన్నా… కదలిక లేకపోవడంతో జేఏసీ నేతలపై సైతం మండిపడ్డారు. పదవీ విరమణ పెంపును జేఏసీలోనే కొన్ని ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. జేఏసీలో దాదాపు 120 ఉద్యోగ సంఘాలు భాగస్వామ్యంగా ఉన్నా, టీఎన్జీఓ పెద్ద సంఘం. ఆ తర్వాత స్థానం టీజీఓదిగా భావిస్తున్నారు. తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం (టీజీఓ) పదవీ విరమణ పెంపునకు వ్యతిరేకంగానే ఉంటోంది. 58 ఏండ్లకు ఉంటేనే సరిపోతుందన్నట్లుగా వ్యవహరిస్తోంది. ప్రభుత్వం దృష్టికి సైతం తీసుకుపోయినట్లు చెప్పుకుంటున్నారు. సీఎం కేసీఆర్ చాలా సందర్భాల్లో రెవెన్యూ శాఖపై అక్కసు వెళ్లగక్కారు. ఇటీవల కాలంలో రెవెన్యూ శాఖలో లంచావ తారులు ఎక్కువగా బయటకు వస్తున్నారు. తాజాగా కీసర తాసీల్దార్ ఏకంగా కోటి రూపాయల లంచంతో దొరికిపోవడం రెవెన్యూ శాఖకు తీరని మచ్చగా మారింది. ఈ కోపంతోనూ గెజిటెడ్ హోదా ఆంక్షలు పెట్టినట్లు కూడా ప్రచారం జరుగుతోంది.

అట్లా అయితే ఎట్లా..?

గెజిటెడ్ అధికారులకు పదవీ విరమణ పెంపు మినహాయింపును కొందరు వ్యతిరేకిస్తున్నా, మరి కొందరు సమర్థిస్తున్నారు. ఉద్యోగులదరికీ ఒకే విధమైన పాలసీ ఉండాలని, కొంతమందికి ఇచ్చి, మరికొంత మందికి ఎందుకు ఇవ్వరంటూ ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయం వెలువడగానే వ్యతిరేకత చూపిస్తామంటున్నారు. గెజిటెడ్ హోదా నుంచి పదవీ విరమణ వయస్సు పెంపు ఉండదని, పరిమితులు ఉంటాయని ఓ మంత్రి దగ్గర ఉద్యోగ సంఘాలు నేతలు చర్చించినట్లు చెబుతున్నారు. దీనికి సదరు మంత్రి కూడా ‘‘ఎన్నికల హామీ ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సును పెంచుతామని సీఎం కేసీఆర్ ప్రకటించారని, ప్రభుత్వ అధికారులకు కాదు’’ అని వ్యాఖ్యానించినట్లు ప్రచారం జరుగుతోంది.

వీరికి పెంపు… వారికి ఎక్స్ టెన్షన్

ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపుపై విమర్శలు కూడా గుప్పుమంటున్నాయి. ఇప్పటికే ఈ ఏడాది నుంచి రిటైర్మెంట్ అయిన వారంతా ఉద్యోగ సంఘాల నేతలపై దుమ్మెత్తి పోస్తున్నారు. ఉద్యోగులకు ఈసారి పదవీ విరమణ వయస్సు పెంచుతారని, ఇక గెజిటెడ్ హోదాకు పైన ఉన్న అధికారులకు ఎలాగైనా ఫైరవీలు ఉంటాయని, మంత్రులు దగ్గర ఉంటారని, వారికి సర్వీసు పొడగింపు, రీ అప్పాయింట్‌మెంట్ వస్తుందని, ఇంతకంటే ఇంకేం కావాలంటూ సెటైర్లు వేస్తున్నారు.

1.15 లక్షల మంది ఉద్యోగులకు

జేఏసీ నేతలకు కూడా ఈ నెలలోనే పదవీ విరమణ గడువు ఉండటంతో సీఎం కేసీఆర్ కచ్చితంగా ప్రకటన చేస్తారని చెబుతున్నారు. దీనిలో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు (సూపరింటెండెంట్ స్థాయి వరకు) పదవీ విరమణ వయస్సు పెంపు ఆర్డినెన్స్ తీసుకువస్తున్నారని అంటున్నారు. ఆగస్టు నెల నుంచి రాష్ట్రంలో పదవీ విరమణ వయస్సు 60 ఏండ్లకు పెరుగుతుందని ప్రచారం జరుగుతోంది. 1.15 లక్షల మంది ఉద్యోగులకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది.

Tags:    

Similar News