రాజకీయాలేనా పాలన వద్దా?

రాజకీయాలేనా పాలన వద్దా?... trs not doing governance they focus on 2023 elections says katragadda prasuna

Update: 2022-12-06 18:30 GMT

ఎన్నికలు వస్తే ప్రజా సమస్యలపై చూపించిన శ్రద్ధ సాధారణ సమయాలలో ప్రభుత్వం చూపించడం లేదు. ఇదే ఇటీవల మునుగోడులో కనిపించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ప్రతి గ్రామానికి వెళ్లి నెల రోజులు రాత్రింబవళ్లు పనిచేశారు. ఇందులో పదవ వంతు శ్రద్ధ రాష్ట్రం మొత్తం పెడితే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి. మునుగోడును చూశాక ' మీరు కూడా రాజీనామా చేస్తే మా ప్రాంత సమస్యలు సైతం పరిష్కారమవుతాయని' ఎమ్మెల్యేలకు ప్రజలు ఫోన్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. అందుకే, ప్రభుత్వం ఎన్నికలలో గెలవడంపై చూపిస్తున్న శ్రద్ధను ప్రజా సమస్యలను పరిష్కరించడంపై చూపిస్తే బాగుంటుంది.

తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసినా ప్రజలు సమస్యలతో సతమతమవుతున్నారు. వారి సమస్యలను పట్టించుకోకుండా ప్రభుత్వం రాజకీయ కార్యకలాపాలలో నిమగ్నమైంది. పాలనను వదిలి వచ్చే ఎన్నికలలో ఎలా గెలవాలి, ఎలా ప్రతిపక్షాన్ని దెబ్బకొటాలనే వ్యూహ ప్రతివ్యూహలలలో మునిగిపోయింది. ముఖ్యమంత్రి సైతం అధికారిక కార్యక్రమాల వైపు ఏమాత్రం దృష్టి సారించడం లేదు. రాష్ట్రంలోని ప్రభుత్వ పథకాలకు నిధులు సకాలంలో అందకపోవడంతో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కుంటుపడిపోతున్నాయి. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. ఉద్యోగాల జాతర అంటూ ప్రకటనలు ఇవ్వడంతో వారంతా అప్పులు చేసి కోచింగ్ సెంటర్లలో కుస్తీ పట్టడం మొదలుపెట్టారు. ప్రభుత్వం కొన్ని ఉద్యోగాలను మాత్రమే ప్రకటించడంతో నిరుద్యోగుల ఆశలు సన్నగిల్లుతున్నాయి. దీంతో వారు మళ్లీ గ్రామాల వైపు వెళుతున్నారు.

నిరుద్యోగ భృతి(unemployment benefit) ఇస్తామని ప్రకటించారు పాలకులు. దీనికోసం 2019-21 వరకు రూ. 10,310 కోట్ల బడ్జెట్ కేటాయించి కూడా వారికి పైసా ఇవ్వలేదు. రైతులకు లక్ష రూపాయల రుణమాఫీ(Loan waiver) అన్నారు. యేటా రూ. 25 వేల చొప్పున మాఫీ చేస్తామని నాలుగేళ్లలో రూ. 35 వేలు మాత్రమే మాఫీ చేశారు. ఇప్పటికీ 47.40 లక్షల మంది రైతులకు రూ. 24,738 కోట్ల రుణమాఫీ చేయాల్సి ఉంది. యేటా రుణమాఫీకి బడ్జెట్ కేటాయిస్తున్నా నిధులు మాత్రం విడుదల చేయడం లేదు. దీంతో బ్యాంకులు రైతులను డిఫాల్టర్ల జాబితాలో ఉంచుతున్నారు. కొత్త రుణాలు మంజూరు చేయడం లేదు. ఇల్లు లేని పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు(double bed room houses) కట్టిస్తామన్నారు. 2,90,057 ఇళ్లు మంజూరు చేసినా, 1,18,824 ఇళ్లు మాత్రమే నిర్మించారు. అందులో 20,709 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు అందించారు. సొంత జాగా ఉన్నవారికి ఇల్లు కట్టుకోవడానికి మూడు లక్షల రూపాయలు ఇస్తామని వాగ్దానం చేసినా, నిధులు మంజూరు చేయడం లేదు. పేదింటి ఆడబిడ్డల పెళ్లిళ్ల కోసం తీసుకొచ్చిన కల్యాణలక్ష్మి(kalyana laxmi),, షాదీముబారక్(shadi mubarak) పథకాల కింద రూ.1,00,116 సాయం చేస్తామన్నారు. పెళ్లి సమయానికి సాయం అందించాలని అనుకున్నా నేటికి ఒక్క హైదరాబాద్‌లోనే 14 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. గర్భిణులకు, బాలింతలకు కేసీఆర్ కిట్(kcr kit) ప్రారంభించి ఆడపిల్లకు రూ.13వేలు, మగ పిల్లగాడికి రూ.12 వేల చొప్పున ఇస్తామన్నారు. రెండు సంవత్సరాల నుంచి నిధులు రావడం లేదు.గర్భిణులు, బాలింతలకు రూ.750 కోట్లు నిధులు ఇవ్వాల్సి ఉంది.

సమస్యల మీద శ్రద్ధ చూపాలి

గ్రామాలలో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం నుంచి నిధులు రాకున్నా సర్పంచులే చొరవ తీసుకుని వైకుంఠ దామాలు, వర్కర్లకు జీతాలు, టాక్టర్లకు డబ్బులు, కరెంట్ బిల్లులు, పల్లె వనాల కోసం అప్పులు చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. అప్పులు తీర్చడానికి ఆస్తులు అమ్ముకుంటున్నారు. రాష్ట్రంలో 26 భారీ, 13 మధ్య తరహా ప్రాజెక్టుల పనులు జరుగుతున్నాయి. వీటికి సంబంధించి కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన 8,174 కోట్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ(aarogyasri) పథకంలో 2007 లో నిర్ణయించిన ధరలు ఉండటంతో ప్రైవేట్ ఆసుపత్రులు చికిత్స చేయడానికి నిరాకరిస్తున్నాయి. ఉద్యోగులు, పెన్షనర్లకు సైతం వైద్య ఖర్చు కోసం చేసిన బిల్లులను రెండు సంవత్సరాల నుంచి చెల్లించడం లేదు.

తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల కరెంటు బిల్లులు రూ.10 వేల కోట్ల మేరకు పేరుకుపోయాయి. సబ్సీడీల కింద ప్రభుత్వం డిస్కంలకు నిధులు చెల్లించకపోవడంతో రూ.22 వేల కోట్ల అప్పులతో కొనసాగుతున్నాయి. మధ్యాహ్న భోజనంలో రూ.150 కోట్ల బిల్లులు చెల్లించాల్సి ఉంది. ధరణి పోర్టల్(dharani) అందుబాటులోకి వచ్చాక భూ సమస్యలు మరింత రెట్టింపయ్యి తగాదాలు అవుతున్నాయి. రిజిస్ట్రేషన్‌కు డబ్బులు చెల్లిస్తే రిజిస్ట్రేషన్ కాకపోయినా ఆ డబ్బులు వెనకకు రావడం లేదు. ఇలా ధరణి సమస్యలతో సుమారు రెండు లక్షల మంది ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం ఈ సమస్యను పరిష్కరించడం లేదు. పోడుభూములపై ప్రజాదర్బార్ పెట్టి పట్టాలిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి సంవత్సరాలు గడిచినా సమస్య పరిష్కరించలేదు. ఫారెస్ట్ ఆఫీసర్ హత్య దాకా పెరిగిపోయింది సమస్య. 2019 నుంచి రూ.3,350 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

అందులో పది శాతం పెట్టినా

రాష్ట్రంలో రోడ్లు గుంతలమయంగా మారి ప్రయాణికులకు నరకాన్ని చూస్తున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఎన్నికలు వస్తే ప్రజా సమస్యలపై చూపించిన శ్రద్ధ సాధారణ సమయాలలో ప్రభుత్వం చూపించడం లేదు. ఇదే ఇటీవల మునుగోడులో కనిపించింది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు ప్రతి గ్రామానికి వెళ్లి నెల రోజులు రాత్రింబవళ్లు పనిచేశారు. ఇందులో పదవ వంతు శ్రద్ధ రాష్ట్రం మొత్తం పెడితే ప్రజా సమస్యలు పరిష్కారమవుతాయి. మునుగోడును చూశాక ' మీరు కూడా రాజీనామా చేస్తే మా ప్రాంత సమస్యలు సైతం పరిష్కారమవుతాయని' ఎమ్మెల్యేలకు ప్రజలు ఫోన్‌ చేసే పరిస్థితి ఏర్పడింది. అందుకే, ప్రభుత్వం ఎన్నికలలో గెలవడంపై చూపిస్తున్న శ్రద్ధను ప్రజా సమస్యలను పరిష్కరించడంపై చూపిస్తే బాగుంటుంది


కాట్రగడ్డ ప్రసూన

మాజీ ఎమ్మెల్యే, ఉపాధ్యక్షురాలు,

తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్రం

98663 36011

Tags:    

Similar News