రాష్ట్ర ఏర్పాటు కోసం జయశంకర్ సార్ చేసిన త్యాగాలేంటో తెలుసా?

Update: 2022-08-05 18:30 GMT

తెలంగాణలోని ప్రతి పల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నది. రాష్ట్రంలో ఆయన తిరగని ప్రాంతం లేదు. రాష్ట్రం విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికల మీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలలో, సమావేశాలలో తెలంగాణ రణ నినాదాన్ని లెక్కలతో సహా వినిపించిన పోరాట శీలి. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ దాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తి చేయడంలో ఆయన పాత్ర మరువలేనిది.

విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతున్న అన్యాయం పట్ల, అసమానతల పట్ల ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ తీవ్రంగా పోరాటం చేశారు. 1962 నాన్ ముల్కీ ఉద్యమంలో పాల్గొని ఆనాటి నుంచి సమరశీల పాత్రను పోషించారు. ఎవరూ మాట్లాడటానికి సాహసించని కాలంలోనే 1954లో విశాలాంధ్ర ప్రతిపాదనను ఎండగట్టిన ధీశాలి జయశంకర్ సార్. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్‌ఆర్‌సీ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి. అధ్యాపకుడిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించిన మహనీయుడు. తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేసి, విశ్లేషించి ప్రతీ రోజూ రచనలు చేశారు.

తెలంగాణ సిద్ధాంతకర్తగా

జయశంకర్ సార్ 1934, ఆగస్టు 6న వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం అక్కంపేటలో జన్మించారు. తల్లి మహాలక్ష్మి, తండ్రి లక్ష్మీకాంతరావు. ఆయనకు ముగ్గురు సోదరులు, ముగ్గురు సోదరీమణులు ఉన్నారు. జయశంకర్ సార్ తల్లిదండ్రులకు రెండో సంతానం, సొంత కుటుంబాన్ని నిర్మించుకోకుండా తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా మిగిలిపోయారు. 1952లో జయశంకర్ నాన్ ముల్కీ ఉద్యమంలో, సాంబార్, ఇడ్లీ గోబ్యాక్ ఉద్యమంలో పాల్గొన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల విలీనాన్ని వ్యతిరేకించి, విద్యార్థి నాయకుడిగా ఆయన 1954లో ఫజల్ అలీ కమిషన్‌కు నివేదిక ఇచ్చారు. స్వరాష్ట్రం కావాలంటూ 1969లో జరిగిన తెలంగాణ తొలి దశ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు.

కేసీఆర్‌కు ఉద్యమ సమయంలో సలహాదారుడిగా, మార్గదర్శిగా, తెలంగాణ సిద్దాంతకర్తగా తోడ్పాటును అందించారు. తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతపై పుస్తకాలు రాశారు. రాష్ట్రంలోనే కాకుండా, దేశంలోని ఇతర ప్రాంతాలలో, విదేశాలలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగాలు చేశారు. జయశంకర్ సార్ తన ఆస్తిని, జీవితాన్ని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అంకితం చేశారు. ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా యూనివర్సిటీని తలుచుకుంటే తెలంగాణ వాడినైనందుకు గర్వంగా ఉందనేవారు.

ప్రజలకు చైతన్య దివిటీగా

'2009 డిసెంబర్ 9న రాష్ట్ర ఏర్పాటుకు చిదంబరం చేసిన ప్రకటన తర్వాత ఉస్మానియాలో పిల్లలు జరుపుకున్న సంబరం నా జీవితంలో మర్చిపోలేని గొప్ప జ్ఞాపకం' అనేవారు. వారి భవిష్యత్తుతో, కలలతో ఆడుకున్నది ఎవరు? వారి ఆశలతో ఆడుకుని వారి శవాలపై ప్రమాణం చేసిన రాజకీయ నాయకులకు వాళ్ల ఉసురు తగలకుండా పోతుందా? అంటూ ప్రశ్నించారు. 'మా వనరులు మాకున్నాయి. వాటిపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి. మా తెలంగాణ మాగ్గావాలె. దానికోసం పోరాటం, అవగాహన, రాజకీయ ప్రక్రియ ఈ మూడు ఏకకాలంలో జరగాలని' నిత్యం తెలంగాణ ప్రజలలో చైతన్య దివిటీ వెలిగించిన గొప్ప మేధావి.

చివరి రోజులలో 'ఇప్పుడైతే నాకు ఒకే కోరిక మిగిలింది.తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ్లారా చూడాలి, తర్వాత మరణించాలి' అనేవారు. దురదృష్టవశాత్తు క్యాన్సర్ రూపంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందే 2011 జూన్ 21న జయశంకర్ సార్ మరణించారు. ఆయన చూపిన మార్గం, ఉద్యమ పాఠాలు, చైతన్యం యావత్తు తెలంగాణ సమాజం గుండెలలో చిరస్మరణీయం. తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి 'ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం'గా పేరు పెట్టారు. 2016 అక్టోబర్ 11న కొత్తగా ఏర్పాటుచేసిన జిల్లాలలో భూపాలపల్లికి జయశంకర్ సార్ పేరు పెట్టారు. వారిని యాది చేసుకుంటూ హృదయపూర్వక నివాళి.

(నేడు జయశంకర్ సార్ జయంతి)


సంపత్ గడ్డం

దళిత విద్యార్థి ఉద్యమ నాయకుడు

కామారెడ్డి, 78933 03516

Tags:    

Similar News