కొత్త లేబర్ కోడ్‌లు..కార్మికుల మెడకు ఉరితాళ్లు

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస పాలనలో భారత కార్మికులు కూడా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. రోజుకి 12 నుండి 15 గంటలు పనిచేశారు.

Update: 2024-05-01 01:00 GMT

బ్రిటిష్ సామ్రాజ్యవాదుల వలస పాలనలో భారత కార్మికులు కూడా దుర్భర పరిస్థితుల్లో ఉన్నారు. రోజుకి 12 నుండి 15 గంటలు పనిచేశారు. ఎటువంటి హక్కులు లేవు. తమ పరిస్థితులను మెరుగు పరుచుకునే ఆలోచనకు కార్మికులు వచ్చారు. చికాగో కార్మికుల పోరాటానికి ముందే భారతీయ రైల్వే కార్మికులు 1862లో 8 గంటల పని డిమాండ్ చేస్తూ మొట్టమొదటి సమ్మె చేశారు. సమ్మెపై వలస పాలకులు తీవ్ర నిర్బంధం ప్రయోగించారు. కొందరు కార్మికులు ప్రాణాలు కూడా కోల్పోయారు.

దేశంలో, అధికార మార్పిడి తర్వాత భారత పాలకులు, వలస పాలకుల కార్మిక వ్యతిరేక విధానాలనే అమలు జరిపారు. నెహ్రూ ప్రభుత్వం పాలనలో సంఘటిత రంగంలోని కార్మికులు 1960 జూలై 11 అర్ధరాత్రి నుంచి సమ్మె చేశారు. ప్రభుత్వం తీవ్రమైన అణచివేతకు పూనుకుంది. తుపాకులతో పోలీసులు కార్మికులపై విరుచుకు పడ్డారు. ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, 25వేల మంది కార్మికులు అరెస్టు చేయబడ్డారు. 1968 సెప్టెంబర్ 19న కేంద్ర ప్రభుత్వ రంగంలోని 25 లక్షల మంది కార్మికులు సమ్మె చేశారు. 1974లో చారిత్రాత్మకమైన రైల్వే కార్మికుల సమ్మె జరిగింది. ఇందిరా ప్రభుత్వాన్ని ఈ సమ్మె గడగడలాడించింది. తీవ్రమైన నిర్బంధంతో సమ్మె విరమించేలా ప్రభుత్వం చేసింది. పీవీ నరసింహారావు, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాలు కూడా కార్మిక వ్యతిరేక చట్టాలు, విధానాలు అమలు జరిపాయి. మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతాంగం జరిపిన ఉద్యమంపై తీవ్ర నిర్బంధం ప్రయోగించి 700 రైతుల ప్రాణాలు హరించింది.

ఆస్తుల అమ్మకంలో కొత్త పంథా

మోడీ ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలు మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలు, ప్రభుత్వ సంస్థల, ఆస్తుల అమ్మకాలు తీవ్రం చేసింది. 49 ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టింది. అటవీ భూములను, సంపదలను కార్పొరేట్లకు కట్టబడుతున్నది . మినహాయింపులు లేకుండా అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లోకి విదేశీ పెట్టుబడులు ఆహ్వానించింది. బడా వ్యాపారవేత్తలు బ్యాంకుల్లో తీసుకున్న 6లక్షల బ్యాంకుల అప్పులను మొండి బకాయిల పేరుతో రద్దు చేశాడు. వ్యవసాయ పంటలకు న్యాయమైన ధరలు ప్రకటించి చట్టబద్దత కల్పించ నిరాకరించింది. బీజేపీ పార్టీ మొదటి నుంచి కార్మిక వ్యతిరేక విధానాలను కలిగి ఉంది. కాంట్రాక్ట్ , ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల పేరుతో ఉద్యోగ భద్రత లేకుండా చేసింది. గత 9 సంవత్సరాల్లో 2 కోట్ల, 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారు.

నిరంకుశ కార్మిక చట్టాలు

2014లో అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను సవరిస్తానని పేర్కొంది. 2015లో మోడీనే స్వయంగా ప్రకటించాడు. కార్మికులు ఎన్నో పోరాటాల ద్వారా సాధించుకున్న 44 కార్మిక చట్టాలను, వేతనాల కోడ్, సామాజిక భద్రత కోడ్, పారిశ్రామిక సంబంధాల కోడ్, భద్రత-ఆరోగ్యం -పని పరిస్థితుల సంబంధిత కోడ్ అని నాలుగు కోడ్‌లుగా మార్చి కార్మిక హక్కులను మోడీ ప్రభుత్వం హరిస్తున్నది. మందబలంతో, ప్రతిపక్ష పార్టీలను పార్లమెంట్ నుంచి బహిష్కరించి ఎటువంటి చర్చ లేకుండా వాటిని ఆమోదింప చేసుకుంది. పారిశ్రామిక సంబంధాల కోడ్ కార్మిక హక్కులను కాల రాస్తుంది. ఈ కోడ్ రావడానికి ముందు కార్మికుల డిమాండ్లపై సమ్మె నోటీసు ఇవ్వడానికి 14 రోజుల వ్యవధి సరిపోయేది. ఇప్పుడు దాన్ని 60 రోజులకు పెంచారు. సమ్మెకు వ్యతిరేకంగా ట్రిబ్యునల్ కు వెళ్లే అవకాశం యజమానులకు కల్పించారు. గతంలో 10 కంటే ఎక్కువ మంది పని చేసే సంస్థలను పరిశ్రమలగా గుర్తించే వారు. ఇప్పుడు ఆ సంఖ్య 20 మందికి పెంచారు. విద్యుత్ సంస్థల్లో అది 40 మందికి పెరిగింది.

హక్కులని హరించి..

ఏ సంఘానికైనా కార్మికుల డిమాండ్లపై చర్చించే అవకాశం ఇంతకు ముందు ఉంటే, ఇప్పుడు 51% సభ్యత్వమున్న సంఘాన్ని గుర్తింపు సంఘంగా పరిగణిస్తారు. నాలుగు కోడ్‌లు రాక ముందు పరిశ్రమల్లో జరిగే ప్రమాదాలకు యజమానులే బాధ్యత వహించాలి. ఇప్పుడు కార్మికులే ప్రమాదాలకు బాధ్యత వహించాలి. ప్రమాదాలకు కారణం కార్మికులని తెలిస్తే, 10 వేల జరిమానా, జైలు శిక్ష విధించవచ్చు. ఎనిమిది గంటల పనికి స్వస్తి చెప్పి, యజమానులు కోరితే 10 నుంచి 12 గంటలు పని చేయాలి. అందుకు ప్రత్యేక వేతనం ఉండదు. ఈ విధంగా నాలుగు కోడ్‌ల పేరుతో కార్మిక హక్కులు హరించి కార్మికులను వెట్టి చాకిరి బానిసలుగా మోడీ ప్రభుత్వం మారుస్తున్నది. గత కార్మిక వర్గ ఉద్యమాలను అవగాహన చేసుకుని, మోడీ ప్రభుత్వ కార్మిక, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మిలిటెంట్ వర్గ పోరాటాలకు కార్మిక వర్గం సిద్ధం కావాలి. అందుకు 2024 సంవత్సరం మే 1 నాంది కావాలి.

(మేడే సందర్భంగా)

బొల్లిముంత సాంబశివరావు

రాష్ట్ర కార్యవర్గ సభ్యులు

రైతు కూలీ సంఘం (ఏపీ)

98859 83526

Tags:    

Similar News