‘దక్షిణాది’ ప్రాధాన్యత తగ్గించే కుట్ర!

delimitation for Lok Sabha seats could shake up politics and its disadvantage south states

Update: 2023-04-25 23:00 GMT

దేశంలో ప్రస్తుతం 545 పార్లమెంటు నియోజకవర్గాలు (లోక్‌సభ) ఉన్నాయి. వీటిలో 543 మంది ప్రత్యక్షంగా లోక్‌సభలో అడుగుపెతారు. 1951–52 లో దేశ జనాభా 36 కోట్లు. అప్పుడు సీట్లు 489. పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజన జరిగిన 1971లో దేశ జనాభా 54 కోట్లు. అప్పుడు సీట్ల సంఖ్య 545 కు పెంచారు. అయితే ఈ సీట్లను 1976, 2001లో పెంచాల్సి ఉన్నా.. అప్పట్లో ఉన్న ప్రధానులు రాజ్యాంగ సవరణ చేశారు. అయితే 2001లో మాత్రం వాజేపేయ్ లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచకుండా పునర్వ్యవస్థీకరణ చేసి. కొన్ని జనరల్‌ స్థానాలను ఎస్సీ, ఎస్టీ వర్గాలకు కేటాయించి.. వారి ప్రాతినిధ్యం పెంచారు. అలాగే లోక్‌సభ సీట్ల సంఖ్య పెంపు అంశాన్ని 2026కి వాయిదా వేశారు. దీంతో 2026 లో ఎవరు అధికారంలోకి వచ్చినా, నియోజకవర్గాలను పునర్విభజించాల్సిందే. అయితే ప్రస్తుతం 2011 సెన్సెస్ మాత్రమే అందుబాటులో ఉంది. 2021 జనగణనను కరోనా కారణంగా వాయిదా వేయడంతో 2011 జనగణననే ప్రామాణికంగా తీసుకుంటారా? లేదా కొత్తగా జనగణన పూర్తిచేసి నియోజకవర్గాలను పునర్విభజిస్తారా అనేది అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ నిర్ణయం తీసుకోనున్నది.

అయితే ప్రస్తుతం ఉన్న బీజేపీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలపై చూపుతుంది. దక్షిణాది రాష్ట్రాలు కేంద్రానికి చెల్లిస్తున్న పన్ను 20 నుంచి 50 శాతం మాత్రమే తిరిగి పొందుతుండగా, అదే బీహార్, యూపీ వంటి ఉత్తరాది రాష్ట్రాలు తాము చెల్లించిన పన్నుల్లో ఐదు నుంచి పదిహేను రెట్లు ఎక్కువగా పొందుతున్నాయి. అయితే ఈ అన్యాయంపై దక్షిణాది రాష్ట్రాలు గళమెత్తుతున్నా.. కేంద్రంలో పట్టించుకునే వారు లేరు. అయితే, కేంద్రం ఇప్పుడు ఆ గళాన్ని కూడా అణచివేసే కుట్ర చేస్తుంది. 2026లో జరిగే పార్లమెంట్ నియోజకవర్గాల పునర్విభజనలో దక్షిణాది రాష్ట్రాల ప్రాతినిధ్యాన్ని తగ్గించే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు మేధావులు. తద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో తమకున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునే కుట్ర చేస్తుందని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. నిజానికి 2011 లేదా 2021 జనాభా లెక్కల పునర్విభజన జరిగితే సీట్ల సంఖ్య 888 నుంచి 1000 వరకు పెరగొచ్చు. అయితే ఉత్తరాది రాష్ట్రాలలో పోలిస్తే, దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో మెరుగైన ఫలితాలు సాధించడం, అభివృద్ధిలో దూసుకెళ్లడమే ఈ రాష్ట్రాలకు శిక్షగా మారుతున్నది.

రాజకీయ ఆందోళనలకు అవకాశం!

విభిన్న ప్రాంతాలు, రాష్ట్రాలు ఉన్న మన దేశంలో సభ్యుల సంఖ్య పెంచడంలో ఏమాత్రం తేడా వచ్చినా రాజకీయంగా తీవ్ర గందరగోళానికి దారితీసింది. జనాభా తక్కువ ఉన్నా సరే రాష్ట్రాలు పార్లమెంట్ లో తమ ప్రాతినిధ్యం తగ్గడానికి ఏ మాత్రం ఒప్పుకోవు. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు సీట్ల సంఖ్య పరంగా చాలా నష్టపోతాయి. అంతేకాకుండా, బీజేపీ, కాంగ్రెస్ వంటి పార్టీలు బలంగా ఉన్న ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ సంఖ్యలో సీట్లు పెరుగుతాయి. దీంతో కేవలం నాలుగైదు రాష్ట్రాల్లో సత్తా చాటగలిగిన పార్టీలు కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే అవకాశాలున్నాయి. సమాఖ్య వ్యవస్థ కలిగిన భారతదేశంలో పన్నుల వ్యవస్థ అటు కేంద్రం-ఇటు రాష్ట్రం రెండింటి చేతిలో ఉంది. జీఎస్టీ అనంతరం ఏ పన్ను అయినా సగం నేరుగా కేంద్రానికి వెళ్లనుంది. దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గితే కేంద్రం నుంచి ఒత్తిళ్లు మరింత పెరిగే ప్రమాదముంది. దక్షిణాది రాష్ట్రాలకు చెందిన సీట్లతో అవసరం లేకుండా ఉత్తరాది వారే ప్రధాని కావచ్చు. దక్షిణ రాష్ట్రాల ప్రజల నిరసనలకు - వినతులకు విలువిచ్చే అవకాశముండదు. 2026 లో లేటెస్ట్ సెన్సెస్ ప్రకారం నియోజకవర్గాల విభజన జరిగితే దక్షిణాదిపై ఉత్తరాది ఆధిపత్యం శాశ్వతం అయ్యే ప్రమాదముంది. ఇది రాజకీయంగా, భాష, సంస్కృతి పరంగా, నిధుల పంపకం.. ఇలా అన్ని రంగాల్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుంది.

పరిష్కార మార్గాలేమిటి

అందుకే నియోజకవర్గాల పునర్విభజనకు ముందు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేయాల్సిన అవసరమున్నదని రాజకీయ విశ్లేషకులు, మేధావులు అభిప్రాయ పడుతున్నారు. ముందుగా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని, అలాగే ప్రజాభిప్రాయాన్ని సేకరించి, దానికి అనుగుణంగా నియోజకవర్గాల పునర్విభజనకు ముందడుగులు వేయాల్సి ఉందని. అంతేకాకుండా తమిళనాడులో గతంలో నియోజకవర్గాలను తగ్గించడంపై మద్రాస్ హై కోర్టు కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు పంపి, జనాభా మార్పుతో సంబంధం లేకుండా అదే సంఖ్యలో లోక్‌సభ నియోజకవర్గాలను ప్రకటించేందుకు అవసరమైతే రాజ్యాంగంలోని 81వ అధికరణను సవరించడానికి వీలుందో మోనని పరిశీలించాలని సూచించింది. అందుకే ఈ నియోజకవర్గాల పునర్విభజనకు మద్రాస్ హై కోర్టుతో పాటు రాజకీయ విశ్లేషకులు సూచిస్తున్న పరిష్కార మార్గాలను కేంద్రం పరిగణనలోకి తీసుకుంటే బాగుంటుంది.

పార్లమెంటులో ప్రాతినిధ్యం తగ్గకుండా ఉండేందుకు దక్షిణాది రాష్ట్రాలంతా ఒక్కటై కేంద్రంతో పోరాడాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఉద్యమించినట్లు... ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడినట్లు.. ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకోవాల్సిన అవసరమున్నది. దీనికోసం ముందుగా ప్రాంతీయ పార్టీలను బతికించుకోవాల్సిన అవసరమున్నది. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఉత్తరాది పార్టీలు పాగా వేస్తే, హైకమాండ్ అంటూ ఇక్కడి నేతలు నోరు విప్పే అవకాశముండదు. అందుకు ప్రధాన జాతీయ పార్టీలను సమాన దూరంలో ఉంచుతూ ప్రాంతీయ పార్టీలను ఆదరించాల్సిన అవసరమున్నది. అప్పుడే కేంద్రాన్ని ప్రశ్నించే, నిలదీసే అవకాశముంటుంది. ఉద్యమాలను నిర్మించేందుకు ప్రజలను చైతన్యవంతులను చేయాల్సిన ఆవశ్యకత ఉన్నది.

ఫిరోజ్ ఖాన్

9640466464

పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ dishaopinion@gmail.com, వాట్సప్ నెంబర్ 7995866672

Tags:    

Similar News