కమల వికాసం కల నెరవేరేనా?
కమల వికాసం కల నెరవేరేనా?... Can bjp come into power in telangana
తెలంగాణలో 19 అసెంబ్లీ స్థానాలు ఎస్సీలకు, 12 స్థానాలు ఎస్టీలకు (మొత్తం 31) రిజర్వు అయి ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014, 2018 లలో జరిగిన మూడు ఎన్నికల్లో, ఈ మొత్తంలో కనీసం ఒక స్థానం కూడా బీజేపీ గెలువలేదు. ఎందుకు ఈ పరిస్థితి? ఏమిటి కారణం? ఎలా దీన్ని అధిగమించడం అనే పరిశీలన, పరిశోధన, అధ్యయనం జరుగలేదు. వీటిలో పరిస్థితి మెరుగు పరిచే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీల పనితీరు కూడా అంతంత మాత్రమే! కేవలం రాజకీయ విమర్శలతో పని జరుగదు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏయే హామీలను కేసీఆర్ ప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చింది? డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, తాగునీరు, వివిధ బంధుల కింద ఆర్థిక సహాయం, వ్యవసాయానికి మద్దతు, కేజీ టు పీజీ ఉచిత విద్య, వైద్యం... వంటి రంగాల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని ఎత్తి చూపే, కార్యక్షేత్రంలోని కృషితో మాత్రమే ప్రజాందోళనల్ని నిర్మించగలుగుతారు. అవే పార్టీకి దన్ను. విజయాలకు ఆలంబన
తెలంగాణలో చీకట్లు పోయి, కమలం వికసించడం ఖాయం' అన్నవి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మాటలు. ఈ మాటలను నిశితంగా పరిశీలించి, వాస్తవికంగా విశ్లేషిస్తే, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఓ చిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటున్నట్టే! మోదీ ఆశలు మొగులుపైన ఉంటే, పార్టీ పనితీరు నేలబారున ఉంది. ఇప్పటిదాకా అన్నీ కలిసి వస్తున్న ప్రయోజనాలే తప్ప రాజకీయంగా పరిస్థితిని సానుకూలంగా మలచుకోవడానికి జరుగుతున్న 'పార్టీ పరమైన కృషి' పెద్దగా లేదు. ఎదుగుదలా అంతంతే! తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఉన్న కేసీఆర్‌ని కొట్టడానికి ఆ మాత్రం సరిపోతుందా? అనేది బీజేపీ సగటు కార్యకర్తలనే కాకుండా సాధారణ పౌరులనీ వెన్నాడే సందేహం! రాష్ట్రంలో మరో జాతీయపార్టీ కాంగ్రెస్‌ను వెనక్కి నెట్టి 'మేమే ప్రత్యామ్నాయంగా పౌరుల ముందున్నాం' అని చెప్పుకోగలుగుతున్నారు. కానీ, తామే తదుపరి ప్రభుత్వం అనేంత ధీమా బీజేపీలో కనిపించడం లేదు. అందుకు, ఆశ`ఆకాంక్ష లేక కాదు, పార్టీ సంస్థాగతంగా అంత బలోపేతమై ప్రజాక్షేత్రంలో లేకపోవడమే!
నిన్నటికి నిన్న హైదరాబాద్‌లో పార్టీ నాయకులు, కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ మోడీ స్వయంగా వెల్లడించినట్టు నెరవేరే కలేనా? ఒట్టిపోయే కలేనా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వారికి రాష్ట్రంలో అవకాశాలున్నాయి, అదే స్థాయిలో అవాంతరాలూ ఉన్నాయి. పరిస్థితిని మెరుగుపరచుకునేందుకు ఉన్న బోలెడు అవకాశాలను పార్టీ నాయకత్వం పూర్తి స్థాయిలో సొమ్ము చేసుకోవటం లేదు. అందివస్తున్న అవకాశాలనూ ఒక్కోసారి కాలదన్నుకుంటున్న ఛాయలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. నాలుగైదేళ్లుగా రాష్ట్రంలో పార్టీ పనితీరును గమనించినపుడు, లక్ష్యంతో పనిచేయడం, జనం`వారి ఆశలు`ఆకాంక్షలతో మమేకం కావడం, ప్రజలకు విశ్వాసం కలిగించేలా కొంచెం వ్యూహంతో వ్యవహరించడం, నిన్నటి మీద నేడు, నేటి పైన రేపు పార్టీని బలోపేతం చేసుకోవడం. వంటివి ప్రధానంగా లోపించినట్టు కనిపిస్తోంది. నడత మార్చుకోకుండా ఇదే పంథాలో ముందుకు సాగితే, గెలుపు ముంగిట, బెంగాల్‌లా బీజేపీ భంగపోవడం ఖాయం!
యేడాదిలో ఎంత ఎదుగుతారు?
'ఇంకొంచెం కష్టపడుంటే, ముందస్తు ప్లానింగ్‌తో ఉండుంటే' మునుగోడు వచ్చేదే!' అని కూడా మోదీ అన్నారు. 2023 సాధారణ ఎన్నికలు ముగిశాక, సరిగ్గా ఇటువంటి అనునయింపు మాటలే రాష్ట్ర పార్టీకి అవసరం పడొద్దు. అనుకుంటే, రాష్ట్ర విభాగం పనితీరు మారాలి. మోదీ అన్నట్టుగానే ప్లానింగ్ ఉండాలి, ఇంకొంచెం కష్టపడాలి. 'అంతా అయిపోయింది, కేసీఆర్‌ను గద్దె దింపేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు, ఇక మమ్ములను గద్దెనెక్కించడమే తరువాయి' అనేది రాజకీయ ప్రకటనగా పనికొస్తుందేమో గానీ, అదే నమ్ముకొని తమ పరిస్థితి బావుందని నిమ్మకు నీరెత్తినట్లుండటం పార్టీ ఎదుగుదలకు తీరని నష్టం కలిగిస్తుంది. పార్టీ నాయకులలో అదే ధీమా కనిపిస్తోంది. ఎన్నికలకు ఏడాది మాత్రమే సమయం ఉన్న దశలో ఇంకా నాయకుల మధ్య సమన్వయం లేదు. సీనియర్ల మధ్య అంతరాలు తప్ప కలుపుకుపోవడాలు కనిపించవు.
హైదరాబాద్ మహానగరపాలక సంస్థఎన్నికలలో పార్టీకి ప్రజలు మంచి సంఖ్యలో (48/150) కార్పొరేటర్లను ఇస్తే, ఇప్పటివరకు ఫ్లోర్ లీడర్‌ను ఎన్నుకోలేని నాయకత్వ స్పర్ధలు బీజేపీలో ఉన్నాయి. రాష్ట్రం నుంచి జాతీయ కార్యవర్గంలో పది మంది వరకున్నారు. మరో నలుగురు వివిధ ఇతర హోదాలలో ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గంలోనూ పలువురు సీనియర్లు వివిధ హోదాలలో పనిచేస్తున్నారు. అంతటి సీనియర్లు కూడా పార్టీ సంస్థాగత విస్తరణలో, తమ జిల్లాలలో పార్టీ సమన్వయానికి, ప్రజాపోరాటాల నిర్మాణానికి జరిపే కృషి నామమాత్రమే! జరుగుతున్న పరిణామాలపైన లోతైన సమీక్షలు, ప్రజా స్పందనపై అధ్యయనాలు, దాన్ని బట్టి ఆందోళనా కార్యక్రమాలు రూపొందించడం వంటివి ఏమీ లేవు. రాష్ట్రంలోని మెజారిటీ నియోజకవర్గాలలో, ఇప్పటికీ ఆ స్థాయిలో పోటీ పడగల నాయకులే రూపొందని స్థితిలో ఎక్కువ మంది సీనియర్లు, తమకో, కుటుంబ సభ్యులకో టిక్కెట్ కోసం ఇప్పట్నుంచి ముమ్మర యత్నాలు చేస్తున్నారు. పార్టీ ఒకవైపు కేసీఆర్ కుటుంబ పాలన మీద విమర్శలు గుప్పిస్తున్న సమయంలో, కుటుంబ సభ్యుల టిక్కెట్ల కోసం సీనియర్ల వెంపర్లాట రేపు ఏం సంకేతాలిస్తుందోనన్న ఆందోళన బీజేపీ దిగువ శ్రేణి నాయకులు, కార్యకర్తలలో ఉంది.
Also read: మరోకోణం: బీజేపీకి ప్రత్యామ్నాయమేది?
సాధారణంలో సమరమే ముఖ్యం
'కేసీఆర్ సర్కారు దిగివచ్చి, మునుగోడులో నూరు రోజులు క్యాంపు వేసింది' అన్న మోదీ మాటలు బీజేపీ రాష్ట్ర యంత్రాంగానికి ఇంకో విధమైన సందేశమే! ఇది ఉప ఎన్నిక గనుక మునుగోడులో అంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులను ఏకకాలంలో దింపగలిగారు. అదే సాధారణ ఎన్నికలలో, మొత్తం 119 నియోజకవర్గాలలో అటువంటి మోహరింపు పాలకపక్షం చేయలేదన్నది సంకేతం! అంటే, సాధారణ ఎన్నికలలో ఈ ఎత్తులు సాగవు కనుక అక్కడ జరిగేది ప్రత్యక్ష పోరే! జనాదరణే గెలుపునకు గీటురాయి. అందుకు దీటుగా పార్టీని సమాయత్తపరిచే స్థితిలో ఇప్పుడు బీజేపీ లేదు. ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాడే నిర్దిష్ట కార్యక్రమాల రచన పార్టీ పరంగా జరగటం లేదు. ఒకవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసుకుంటూనే, ఇంకోవైపు ప్రజాభిమానాన్ని కూడగట్టాలి.
రాష్ట్రవ్యాప్త అంశాలతో పాటు ఎక్కడికక్కడ నియోజకవర్గ స్థాయిలో సమస్యలను గుర్తించడం, స్థానికులను భాగస్వాములను చేస్తూ, స్థానిక భాష, ఆలోచన, భావజాలం వంటి ఉపకరణాలతో ఆందోళనలు పార్టీ నాయకత్వం చేపట్టడం లేదనేది విమర్శ. 2018 అసెంబ్లీ ఎన్నికలలో ఒకే అసెంబ్లీ స్థానం గెలిచినప్పటికీ 2019 లోక్‌సభ ఎన్నికలలో ఏకంగా 4 స్థానాల్లో గెలవటం పార్టీకి ఊపుతెచ్చిన మాట నిజమే! అయినా, అందుకు దారితీసిన పరిస్థితులను లోతుగా, వాస్తవికంగా విశ్లేషించుకోవాల్సిన అవసరం పార్టీకి ఉంది. 21 అసెంబ్లీ సెగ్మెంట్లలోనే ఆధిక్యత లభించి, మరో 22 సెగ్మెంట్లలో బీజేపీకి రెండో స్థానం దక్కింది. పై స్థాయిలో ప్రచారాలు, మీడియాలో తగినంత స్థానం దక్కించుకోవడం, మైకు దొరికితే చాలు కేసీఆర్ పైన, ఆయన కుటుంబ సభ్యులపైనా విమర్శలు దట్టించడం మాత్రమే ఎన్నికల క్షేత్రంలో పార్టీ పరిస్థితిని మెరుగుపరుస్తుందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రజాక్షేత్రంలోకి విస్తరించి, వ్యూహాలు, ఎత్తుగడలతో గెలిచే ప్రయత్నం జరుగటం లేదు.
ఉదాహరణకు: తెలంగాణలో 19 అసెంబ్లీ స్థానాలు ఎస్సీలకు, 12 స్థానాలు ఎస్టీలకు (మొత్తం 31) రిజర్వు అయి ఉన్నాయి. నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2009, 2014, 2018 లలో జరిగిన మూడు ఎన్నికల్లో, ఈ మొత్తంలో కనీసం ఒక స్థానం కూడా బీజేపీ గెలువలేదు. ఎందుకు ఈ పరిస్థితి? ఏమిటి కారణం? ఎలా దీన్ని అధిగమించడం అనే పరిశీలన, పరిశోధన, అధ్యయనం జరుగలేదు. వీటిలో పరిస్థితి మెరుగు పరిచే లక్ష్యంతో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీల పనితీరు కూడా అంతంత మాత్రమే! కేవలం రాజకీయ విమర్శలతో పని జరుగదు. గత ఎన్నికల్లో ఇచ్చిన ఏయే హామీలను కేసీఆర్ ప్రభుత్వం ఏ మేరకు నెరవేర్చింది? డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, తాగునీరు, వివిధ బంధుల కింద ఆర్థిక సహాయం, వ్యవసాయానికి మద్దతు, కేజీ టు పీజీ ఉచిత విద్య, వైద్యం... వంటి రంగాల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యల్ని ఎత్తి చూపే, కార్యక్షేత్రంలోని కృషితో మాత్రమే ప్రజాందోళనల్ని నిర్మించగలుగుతారు. అవే పార్టీకి దన్ను. విజయాలకు ఆలంబన
Also read: బీజేపీని అలా చేసేది కేసీఆర్ ఒక్కడేనా?
వ్యూహాలు తోడైతేనే
'తెలంగాణకు బీజేపీతో విడదీయరాని బంధం ఉంది, దేశవ్యాప్తంగా పార్టీకి రెండే స్థానాలు దక్కినప్పుడు కూడా, ఒకటి జంగారెడ్డి రూపంలో ఇక్కడి నుంచే లభించింది' అని మోదీ గుర్తుచేయడం వ్యూహాత్మకమే! ఇది రాష్ట్ర పార్టీ నాయకత్వం గుర్తించాలి. అన్ని వర్గాలను ఆకట్టుకునే 'సోషల్ ఇంజనీరింగ్' బీజేపీకి చాలా ముఖ్యం. 2014, 2018 ఎన్నికలలో ఈ విషయమై పార్టీ నాయకత్వం విఫలమైందని టిక్కెట్ల కెటాయింపును విశ్లేషిస్తే ఇట్టే అర్థం అవుతుంది. ఇక సంస్థాగతంగా కూడా జాగ్రత్త పడలేదు. పార్టీ జిల్లా (నగర కలిపి) అధ్యక్షులు రాష్ట్రంలో 38 మంది ఉంటే, అందులో 25 మంది అగ్రవర్ణాలకు చెందిన వారే! మరో ఎనిమిది మంది బీసీలు. 2019 ఎన్నికలలో బీజేపీ 4 లోక్‌సభ స్థానాలు గెలిచినపుడు, అనూహ్యంగా బీసీల మద్దతు, అంతకు ముందరి 8 శాతం నుంచి 25 శాతానికి పెరిగింది.
వ్యూహాలు రచించేప్పుడు ఇటువంటి అంశాలను పార్టీ నాయకత్వం పరిగణనలోకి తీసుకోవాలి. ముస్లిం ఓటు బ్యాంకు రాజకీయాలలో భాగంగా దేశంలో ఎక్కడెక్కడో పోటీ చేసే మజ్లీస్ పార్టీ, తెలంగాణలో మాత్రం వ్యూహాత్మకంగా పరిమిత స్థానాలలో మాత్రమే పోటీ చేస్తుంది. మిగతా చోట్ల పోటీ చేయకుండా, ముస్లిం ఓటు పాలక టీఆర్‌ఎస్‌కు మేలు చేసేలా వ్యవహరిస్తుంది. దాన్ని ఎత్తిచూపడంతో పాటు తగిన విరుగుడు ఎత్తుగడలు తమ నాయకత్వం రచించాలని బీజేపీ శ్రేణులు ఆశిస్తున్నాయి. పార్టీ ఎన్నికల ప్రణాళిక (మేనిఫెస్టో) ను, ఎన్నికలకు కొన్ని రోజుల ముందు మొక్కుబడిగా తీసుకురాకుండా, తగినంత ముందుగానే తీసుకువచ్చి, ఏడాదిపాటు బాగా ప్రచారం చేసి, ప్రజాదరణ పొందాలనే సూచన కూడా వస్తోంది. బూత్ స్థాయిలోకి పార్టీని విస్తరించడం, పకడ్బందిగా కమిటీలు వేయడం, అభ్యర్థుల ఎంపికకు ఇప్పట్నుంచే తగిన కసరత్తు చేయడం వంటివి చేసుకొని పార్టీని బలోపేతం చేసుకుంటే తప్ప మోదీ కంటున్న కల నెరవేరదనే భావన బీజేపీ కార్యకర్తలు, సానుభూతిపరులలో వ్యక్తమవుతోంది.
దిలీప్‌రెడ్డి
పొలిటికల్ ఆనలిస్ట్, పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ
dileepreddy.ic@gmail.com
9949099802