వెండి తెరకు 'కళ' తెచ్చిన తపస్వి

వెండి తెరకు 'కళ' తెచ్చిన తపస్వి... An ascetic director who brought art to the silver screen

Update: 2023-02-03 18:30 GMT

తెలుగు నాట కళాతపస్విగా గుర్తింపు పొందిన సినీ దర్శకులు విశ్వనాధ్ భౌతికంగా దూరమవ్వడం చిత్ర సీమకు, కళారంగానికే కాకుండా తెలుగు వారికి తీరని లోటు. వృద్ధాప్య కారణాలతో ఆయన చాలాకాలంగా సినిమా రంగంలో క్రియాశీలకంగా లేకపోయినా గతంలో మూడు దశాబ్దాల పాటు వెండితెరకు అదనపు గౌరవాన్ని తీసుకువచ్చారు. ఆయనకు ముందు వెండి తెరపై కళాఖండాలు లేకపోలేదు. ఆయనతో బాటు గానీ,తర్వాత గానీ ఉత్తమ చిత్రాలు లేకపోలేదు. ఆయన గొప్పతనమేమిటంటే మూస ధోరణికి ఎదురెళ్ళడం. ఎవరూ టచ్ చెయ్యలేని కథల్ని తీసుకుని సున్నితంగా, కళాత్మకంగా, ప్రభావవంతంగా తెరకు అనువాదం చెయ్యడం. పామరుల్ని సైతం ఒప్పించడం. ఉత్తమ అభిరుచితో, ఏమాత్రం అశ్లీలత జోలికి పోకుండా క్లీన్‌‌గా సినిమా తీసి మెప్పించడం. ఆర్ట్ సినిమా అయితే డబ్బులు రాలవు, కమర్షియల్ సినిమా అయితే అవార్డులు రాలవు అన్నట్టున్న సినీరంగంలో ఆ గీతల్ని చెరిపివేసి రెంటినీ సాధించిన దిగ్దర్శకుడు. మనదైన సంప్రదాయం, సంగీతం, సాహిత్యం పట్ల తన సినిమాలన్నింట్లో గౌరవం చూపడమే కాకుండా ప్రేక్షకుల్లో ఉన్నతభావం కలిగించిన తపస్వి. అదే సమయంలో వరకట్నం, కులమత భేదాలు, పరాయి సంస్కృతి పట్ల వెర్రి వ్యామోహం లాంటి దురాచారాల పట్ల వ్యతిరేకత, స్వీయ గౌరవం, స్వయం కృషి పట్ల ఆరాధన కలిగేలా కథల్ని మలిచిన తీరు ఆయన సంస్కరణాభిలాషకు నిదర్శనం. ఆయనకు శ్రద్ధాంజలి. ఆయన సినిమాల ప్రభావం పెద్దలపైనే కాదు పిల్లల పైన ఉండేది.

ఇవి కూడా చదవండి : చివరి కోరిక తీరకముందే కన్నుమూసిన కళాతపస్వి..!

 డా. డి.వి.జి.శంకర రావు,

94408 36931.

Tags:    

Similar News