రేటు ఎక్కువగా ఉన్నప్పటికీ బంగారానికి డిమాండ్ మాత్రం తగ్గేదేలే

భారతీయ సాంప్రదాయంలో బంగారానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. పండుగలు, ఫంక్షన్లు వంటి వాటికి బంగారు నగలు ధరించడానికి చాలామంది ఇష్టపడుతుంటారు.

Update: 2024-04-30 07:41 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ సాంప్రదాయంలో బంగారానికి చాలా ముఖ్యమైన పాత్ర ఉంది. పండుగలు, ఫంక్షన్లు వంటి వాటికి బంగారు నగలు ధరించడానికి చాలామంది ఇష్టపడుతుంటారు. అందుకోసం ఎంతో కొంత కొనుగోలు చేసి తమ వద్ద దాచుకుంటారు. అలాంటిది ఇప్పుడు బంగారం సామాన్యులకు అందనంత దూరంలో ఉంది. 24 క్యారెట్ల ధర రూ.73 వేలకు దగ్గరగా ఉంది. అయితే ధర ఎక్కువగా ఉండటంతో చాలా మంది బంగారం కొనుగోలు చేయడానికి వెనకడుగు వేస్తున్నప్పటికి మార్చి త్రైమాసికంలో దేశంలో బంగారం డిమాండ్ సంవత్సరానికి 8 శాతం పెరిగి 136.6 టన్నులకు చేరుకుందని మంగళవారం విడుదలైన వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (WGC) నివేదిక పేర్కొంది.

ధరలు చరిత్రలో రికార్డు స్థాయికి చేరుకున్నప్పటికి కూడా గోల్డ్ డిమాండ్ మరింత పెరగడం ఆశ్చర్యంగా ఉందని నివేదిక అభిప్రాయ పడింది. ఈ ఏడాది జనవరి-మార్చి కాలంలో సగటు ధరలు 11 శాతం పెరిగాయని 'గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్ Q1 2024' నివేదికలో వెల్లడించారు. మొత్తం బంగారం డిమాండ్‌లో, భారతదేశంలో ఆభరణాల డిమాండ్ 4 శాతం పెరిగి 91.9 టన్నుల నుంచి 95.5 టన్నులకు చేరుకుంది. అలాగే బంగారంపై పెట్టుబడి 34.4 టన్నుల నుంచి 19 శాతం పెరిగి 41.1 టన్నులకు చేరుకుంది. మార్చిలో ధరలు గరిష్ట స్థాయికి చేరుకున్న కారణంగా అమ్మకాలు మందగించాయి, అయినప్పటికీ భారతదేశ బలమైన స్థూల ఆర్థిక వాతావరణం బంగారు ఆభరణాల వినియోగానికి మద్దతుగా ఉందని WGC, ఇండియా రీజినల్ సీఈఓ సచిన్ జైన్ అన్నారు. అలాగే, ఏడాదిలో దేశంలో బంగారం డిమాండ్ 700-800 టన్నుల పరిధిలో ఉంటుందని జైన్ అంచనా వేస్తున్నారు.

Similar News