భారత వృద్ధి అంచనాను భారీగా పెంచిన ఐక్యరాజ్యసమితి

2024లో భారత వృద్ధి 6.2 శాతం నుంచి 6.9 శాతానికి, 2025లో 6.6 శాతంగా నమోదు చేయనుందని తెలిపింది.

Update: 2024-05-17 09:00 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారత ఆర్థికవ్యవస్థ వృద్ధి అంచనాలను ఐక్యరాజ్యసమితి భారీగా పెంచింది. ఈ ఏడాదిలో దేశ జీడీపీ దాదాపు 7 శాతానికి చేరుకుంటుందని, ప్రధానంగా ప్రభుత్వ పెట్టుబడులు, ప్రైవేటు వినియోగం పెరగడమే ఇందుకు కారణమని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. 2024లో భారత వృద్ధి 6.2 శాతం నుంచి 6.9 శాతానికి, 2025లో 6.6 శాతంగా నమోదు చేయనుందని తెలిపింది. భారత్‌కు వెలుపల డిమాండ్ నెమ్మదిగా ఉండటం వల్ల సరుకుల ఎగుమతుల వృద్ధిలో బలహీనత ఉందని, ఫార్మా, రసాయన ఎగుమతులు మాత్రమే బలంగా ఉన్నాయని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. భారత్‌లో స్థానిక డిమాండ్, తయారీ, సేవల రంగాలలో బలమైన వృద్ధి కనిపిస్తోంది. ఇదే సమయంలో దేశీయంగా రిటైల్ ద్రవ్యోల్బణం 2023లో ఉన్న 5.3 శాతం నుంచి ఈ ఏడాది 4.5 శాతానికి దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దక్షిణాసియా మొత్తం ద్రవ్యోల్బణం ఇదే స్థాయిలో నమోదు కానుంది. అత్యధిక ద్రవ్యోల్బణం ఇరాన్‌లో 33.6 శాతం, మాల్దీవుల్లో అతి తక్కువగా 2.2 శాతం ఉండొచ్చని ఐక్య్రరాజ్యసమితి అంచనా వేసింది. భారత్‌తో పాటు బంగ్లాదేశ్‌లలో ఆహారపదార్థాల ధరలు తగ్గుముఖం పడుతున్నప్పటికీ ఇంకా అధిక స్థాయిల్లోనే ఉన్నాయని అభిప్రాయపడింది. ఇక, ప్రపంచ ఆర్థికవ్యవస్థ కూడా ఈ ఏడాది 2.7 శాతం, 2025లో 2.8 శాతం వృద్ధి నమోదు కానుందని పేర్కొంది. 

Tags:    

Similar News