లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడం కూడా కొంత సానుకూల ర్యాలీకి కారణమైంది.

Update: 2024-05-02 12:30 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: భారతీయ ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. ఒకరోజు సెలవు తర్వాత మొదలైన ట్రేడింగ్‌లో సూచీల రోజంతా ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మద్దతు లేకపోయినప్పటికీ దేశీయంగా రికార్డు జీఎస్టీ ఆదాయం, త్రైమాసిక ఫలితాలు వంటి అంశాలు మదుపర్ల సెంటిమెంట్‌ను పెంచాయి. గ్లోబల్ మార్కెట్లలో ముడి చమురు ధరలు తగ్గడం కూడా కొంత సానుకూల ర్యాలీకి కారణమైంది. ఈ క్రమంలోనే కీలక ఆటో, మెటల్, ఎనర్జీ రంగాల్లో కొనుగోళ్ల జోరు కనిపించింది. దీంతో మార్కెట్లు ముగిసే సమయానికి సెన్సెక్స్ 128.33 పాయింట్లు లాభపడి 74,611 వద్ద, నిఫ్టీ 43.35 పాయింట్ల లాభంతో 22,648 వద్ద ముగిశాయి. నిఫ్టీలో ఆటో, మెటల్, ఫార్మా రంగాలు రాణించాయి. రియల్టీ, బ్యాంకింగ్ రంగాల్లో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. సెన్సెక్స్ ఇండెక్స్‌లో పవర్‌గ్రిడ్, ఏషియన్ పెయింట్, టాటా మోటార్స్, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్, ఎంఅండ్ఎం కంపెనీల షేర్లు లాభాలను సాధించాయి. కోటక్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, భారతీ ఎయిర్‌టెల్, విప్రో, ఐసీఐసీఐ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ స్టాక్స్ నష్టాలను నమోదు చేశాయి. అమెరికా డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 83.48 వద్ద ఉంది. 

Tags:    

Similar News