భారత్ నుంచి వియత్నాంకు 248 శాతం పెరిగిన ప్రయాణికులు

ప్రస్తుతం భారత్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది.

Update: 2024-05-16 11:41 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రస్తుతం భారత్ నుంచి ఇతర దేశాలకు ప్రయాణించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా వియత్నాంకు ఎక్కువ మంది భారతీయులు ప్రయాణిస్తున్నట్లు ఒక నివేదిక వెల్లడించింది. Mastercard's Economics Institute నుంచి వచ్చిన ట్రావెల్ ట్రెండ్స్ 2024, బ్రేకింగ్ బౌండరీస్ నివేదికలో వియత్నాం అంతర్జాతీయ గమ్యస్థానంగా అభివృద్ధి చెందుతున్నట్లు పేర్కొంది. అలాగే గత కొన్నేళ్లలో భారత్ నుంచి ఇక్కడికి ప్రయాణించే వారి సంఖ్య దాదాపు 248 శాతం పెరిగినట్లు డేటా చూపించింది. అదే సమయంలో అమెరికాకు 59 శాతం, జపాన్‌కు 53 శాతం వృద్ధి రేటు నమోదైంది. 2024 జనవరి-మార్చిలో దేశీయ, అంతర్జాతీయంగా కలిపి 9.7 కోట్ల మంది విమానాల ద్వారా ప్రయాణించారని నివేదిక పేర్కొంది. అలాగే, ఆమ్‌స్టర్‌డామ్, సింగపూర్, లండన్ 2024లో భారతీయ ప్రయాణికులకు మొదటి మూడు వేసవి సెలవుల ఆప్షన్‌గా ఉన్నాయి.

జనవరి-మార్చి 2024 మధ్య కాలానికి ప్రయాణికుల డేటా ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక పరిస్థితుల మధ్య వచ్చే ఐదేళ్లలో భారతదేశం దాదాపు 20 మిలియన్ల మంది మధ్యతరగతిలోకి ప్రవేశించే అవకాశం ఉందని నివేదిక అంచనా వేసింది. రవాణా సదుపాయాలు మెరుగవడం, ప్రజల ఆదాయ స్థితిగతులు వృద్ధి చెందుతుండటంతో దేశం నుంచి ఇతర దేశాలకు ప్రయాణాలు జరిపే వారి సంఖ్య రాను రాను పెరుగుతుందని నివేదిక అభిప్రాయపడింది.

భారతదేశం ఇప్పుడు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన మార్కెట్. చరిత్రలో ఎన్నడూ లేనంతగా భారత్ నుంచి ఎక్కువ అంతర్జాతీయ పర్యటనలను చూస్తున్నామని మాస్టర్ కార్డ్ ఆసియా పసిఫిక్ చీఫ్ ఎకనామిస్ట్ డేవిడ్ మాన్ అన్నారు. 2024లో, భారత ప్రయాణికులు విశ్రాంతి తీసుకోవడానికి, షాపింగ్, వ్యాపార అవసరాల కోసం నాలుగు రోజుల నుండి సగటున ఐదు రోజుల పాటు సుదీర్ఘ పర్యటనలను ఆస్వాదిస్తున్నారని నివేదకలో తేలింది.

Similar News