హీరో మోటార్స్ ఆదాయం రూ.1,016 కోట్లు.. డివిడెండ్ రూ.40

ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తన ఆర్థిక ఫలితాలను తాజాగా విడుదల చేసింది

Update: 2024-05-08 10:20 GMT

దిశ, బిజినెస్ బ్యూరో: ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ కంపెనీ హీరో మోటోకార్ప్ తన ఆర్థిక ఫలితాలను తాజాగా విడుదల చేసింది. కంపెనీ మార్చి 31, 2024 తో ముగిసిన త్రైమాసికానికి నికర లాభం ఏడాది క్రితంతో పోలిస్తే 18.4 శాతం పెరిగి రూ. 1,016 కోట్లకు చేరుకుందని ప్రకటించింది. బలమైన వాల్యూమ్ వృద్ధి, కొత్త ఉత్పత్తులు విపణిలోకి రావడం, కమోడిటీ ఖర్చులను తగ్గించడం, అధిక సగటు అమ్మకపు ధరల నేపథ్యంలో కంపెనీ లాభం గతంతో పోలిస్తే పెరిగిందని హీరో మోటోకార్ప్ ఒక ప్రకటనలో పేర్కొంది. అలాగే, ఏడాది ప్రాతిపదికన రాబడి ఎఫ్‌వై23లో నాలుగో త్రైమాసికంలో రూ.8,307 కోట్లతో పోలిస్తే ఇప్పుడు 15 శాతం పెరిగి రూ.9,519 కోట్లకు చేరుకుంది. బోర్డు మీటింగ్‌లో ఒక్కో షేరుకు రూ. 40 తుది డివిడెండ్ ఇవ్వడానికి అంగీకరించారు.

పూర్తి ఆర్థిక సంవత్సరంలో, కంపెనీ ఆదాయం 11 శాతం పెరిగి రూ.37,456 కోట్లకు చేరుకోవడంతో నికర లాభం ఏడాది ప్రాతిపదికన 36 శాతం పెరిగి రూ.3,968 కోట్లకు చేరుకుంది. హీరో మోటోకార్ప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిరంజన్ గుప్తా మాట్లాడుతూ, కొత్త ఉత్పత్తులు లాంచ్ చేయడం, నెట్‌వర్క్ అప్‌గ్రేడ్, కస్టమర్ సంతృప్తిపై మా దృష్టి కేంద్రికరించడం కొత్త శిఖరాలకు నడిపించిందని అన్నారు. ఎఫ్‌వై24లో ప్రీమియం, 125 cc సెగ్మెంట్‌లో కొత్త లాంచ్‌ల నేపథ్యంలో మార్కెట్ షేర్ లాభాలను పెంచుకుంటాము. ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో Xoom 125 cc, Xoom 160 cc లను విడుదల చేయడం ద్వారా స్కూటర్ పోర్ట్‌ఫోలియోను పెంచుతున్నాము, అలాగే రాబోయే సంవత్సరాల్లో EVలో పెద్ద పురోగతిని చూస్తామని నిరంజన్ గుప్తా పేర్కొన్నారు.

Similar News