IPOకు సిద్ధమవుతున్న బైజూస్ అనుబంధ ఆకాశ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్!

ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ అనుబంధ ఆకాశ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్(ఏఈఎస్ఎల్) త్వరలో పబ్లిక్ ఇష్యూకు తీసుకురానున్నట్లు సోమవారం ప్రకటనలో తెలిపింది

Update: 2023-06-05 14:08 GMT

ముంబై: ప్రముఖ ఎడ్‌టెక్ స్టార్టప్ బైజూస్ అనుబంధ ఆకాశ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్(ఏఈఎస్ఎల్) త్వరలో పబ్లిక్ ఇష్యూకు తీసుకురానున్నట్లు సోమవారం ప్రకటనలో తెలిపింది. 2024 మధ్య నాటికి ఏఈఎస్ఎల్ ఐపీఓ ప్రక్రియను ప్రారంభిస్తామని వెల్లడించింది. బైజూస్ బోర్డు అధికారికంగా ఆకాశ్ ఐపీఓను ఆమోదించింది. ఐపీఓ ప్రక్రియ కోసం త్వరలో మర్చంట్ బ్యాంకర్లను నియమిస్తామని కంపెనీ స్పష్టం చేసింది.

ఐపీఓ ద్వారా వచ్చే నిధులను ఆకాశ్ మౌలిక సదుపాయాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు, కార్యకలాపాల విస్తరణకు వినియోగించనున్నారు. దేశవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందించే చర్యలు తీసుకుంటామని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఆదాయం మెరుగుపడుతోందని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఏఈఎస్ఎల్ ఎబిటా(నిర్వహణ లాభం) రూ. 900 కోట్లతో కలిపి రూ. 4,000 కోట్ల ఆదాయాన్ని సమకూర్చుకోగలదని బైజూస్ అంచనా వేసింది.

2021లో బైజూస్ సంస్థ ఆకాశ్ ఎడ్యుకేషన్ సర్వీసెస్‌ను రూ. 7,100 కోట్లకు కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ఆ ఏడాది నుంచి కంపెనీ ఆదాయం మూడు రెట్లు పెరిగింది. సుమారు 4 లక్షల మంది విద్యార్థులకు 325 సెంటర్ల ద్వారా ఆకాశ్ సేవలను అందిస్తోంది.

Tags:    

Similar News