బ్రిటానియా ఇండస్ట్రీస్ సీఈఓగా రజనీత్ కొహ్లీ నియామకం!

దేశీయ దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ తన సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీత్ కోహ్లీని నియమించింది..Latest Telugu News

Update: 2022-09-23 15:26 GMT

ముంబై: దేశీయ దిగ్గజ ఎఫ్ఎంసీజీ సంస్థ బ్రిటానియా ఇండస్ట్రీస్ తన సీఈఓ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా రజనీత్ కోహ్లీని నియమించింది. ఈ నెల 26 నుంచి ఆయన నియామకం అమలులోకి వస్తుందని కంపెనీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే సమయంలో సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్‌గా వరుణ్ బెరీని ప్రమోట్ చేస్తూ, ఆయనను కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగించనున్నట్టు శుక్రవారం స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది.

సంస్థ సీఈఓగా నియమించబడిన రజనీత్ కొహ్లీ ప్రస్తుతం డోమినోస్ రెస్టారెంట్లకు అధిపతిగా ఉన్నారు. దేశీయ ఆహార, రిటైల్ పరిశ్రమలో 24 ఏళ్ల అనుభవం ఉన్న కొహ్లీ, ఏషియన్ పెయింట్‌లో ఆరేళ్లు, కోకా-కోలాలో 14 ఏళ్లు, జుబిలెంట్ ఫుడ్‌వర్క్స్‌లో మూడేళ్లకు పైగా పనిచేశారు. అంతేకాకుండా ఆయా కంపెనీల్లో కాలానుగుణంగా అనేక మార్పులకు, అభివృద్ధికి నాయకత్వం వహించడంలో కీలకంగా వ్యవహరించారు.

భారత మార్కెట్లో వందేళ్లకు పైగా ఉన్న కంపెనీలో చేరడం సంతోషంగా ఉంది. బ్రిటానియా సంస్థ వినియోగదారులకు నమ్మకమైన, కొత్త ఉత్పత్తులతో ఆకర్షించగలిగే ట్రాక్ రికార్డును కలిగి ఉంది. భవిష్యత్తులో సంస్థ అభివృద్ధికి కృషి చేయనున్నట్లు రజనీత్ కొహ్లీ చెప్పారు.

మెరుగైన పనితీరు, లాభదాయకమైన బ్రాండ్‌లను వినియోగదారులకు అందించడంలో మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు రజనీత్ భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్న్నామని వరుణ్ బెరీ వెల్లడించారు.

Similar News