GST officials arrested: తెలంగాణలో 40 కోట్ల కుంభకోణం.. జీఎస్టీ అధికారులు అరెస్ట్

తెలంగాణలో భారీ అవినీతి బయట పడింది. జీఎస్టీలో 40 కోట్ల కుంభకోణం వెలుగు చూసింది.

Update: 2024-05-04 11:31 GMT

దిశ, క్రైమ్ బ్యూరో: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. నకిలీ పత్రాలు సృష్టించి పెద్దమొత్తంలో జీఎస్టీ రిఫండ్‌ పొందిన బాగోతాన్ని శనివారం హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు బయటపెట్టారు. మొత్తం రూ.45.25 కోట్ల మోసానికి పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. సీసీఎస్ డీసీపీ వివరాల ప్రకారం.. న్యూఢిల్లీకి చెందిన చిరాగ్ శర్మ(టాక్స్ కన్సల్టెంట్), ఆంధ్రప్రదేశ్ పల్నాడు, కడప ప్రాంతాలకు చెందిన వీఆర్ రమేష్ రెడ్డి, ఎం.గిరిధర్ రెడ్డి, కే.వినీల్ చౌదరీలు ఎలక్ట్రికల్ బైక్ తయారీ యూనిట్‌లను ప్రారంభిస్తున్నామని హైదరాబాద్‌లో పలువురు అమాయకులను నమ్మించారు. ఈ క్రమంలోనే వారి వద్దనుంచి ఎలక్ట్రిసిటీ బిల్స్‌ను సేకరించారు.

అనంతరం నకిలీ పత్రాలు, రెంటల్ అగ్రిమెంట్‌లు సృష్టించి జీఎస్టీ పోర్టల్‌లో నమోదు చేశారు. లేని కంపెనీలు ఉన్నట్లు చూపించి జీఎస్టీ రిఫండ్స్‌కు దరఖాస్తు చేసుకున్నారు. ఈ కుంభకోణంలో పీటల స్వర్ణ కుమార్(డిప్యూటీ కమిషనర్, నల్గొండ, జీఎస్టీ డివిజన్ ), కేలం వేణు గోపాల్(అసిస్టెంట్ కమిషనర్, స్టేట్ టాక్స్, అబిడ్స్ సర్కిల్), పొదిలా విశ్వకిరణ్(అసిస్టెంట్ కమిషనర్, స్టేట్స్ టాక్స్, మాదాపూర్-1, సర్కిల్), వేమవరపు వెంకటరమణ( డిప్యూటీ స్టేట్ టాక్స్ ఆఫీసర్, జీఎస్టీ, మాదాపూర్-2 సర్కిల్ ), మర్రి మహిత(సీనియర్ అసిస్టెంట్ మాదాపూర్ -3 సర్కిల్)లు కీలక పాత్రలు పోషించారని పోలీసుల దర్యాప్తులో తేలింది. ప్రాథమిక ఆధారాలు సేకరించి వారిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం రిమాండ్‌కు తరలించారు.

Similar News