హస్తినలో బండి మకాం.. ఎందుకు?

దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్​పై కమలం కన్నుపడింది. రానున్న కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ టార్గెట్ చేసింది. మహానగరంపై కాషాయం జెండా ఎగురవేసేందుకు కసరత్తు చేస్తున్నది. మహాపోరులో గెలిచి తీరాలనే సంకల్పంతో ఇప్పటి నుంచే వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. బీజేపీకి నగరంలో బలమైన కేడర్ ఉంది. కేడర్ లో ఉత్తేజం నింపుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ […]

Update: 2020-08-01 20:32 GMT

దిశ ప్రతినిధి, మేడ్చల్: గ్రేటర్​పై కమలం కన్నుపడింది. రానున్న కార్పొరేషన్ ఎన్నికలను బీజేపీ టార్గెట్ చేసింది. మహానగరంపై కాషాయం జెండా ఎగురవేసేందుకు కసరత్తు చేస్తున్నది. మహాపోరులో గెలిచి తీరాలనే సంకల్పంతో ఇప్పటి నుంచే వడివడిగా అడుగులు వేస్తున్నది. ఈసారి జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను కైవసం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. బీజేపీకి నగరంలో బలమైన కేడర్ ఉంది. కేడర్ లో ఉత్తేజం నింపుతూ బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను ఇంటింటా ప్రచారం చేసేందుకు సన్నాహాలు చేస్తోంది.

గ్రేటర్ కు ఆరుగురు సారథులు..

నగరాన్ని పార్టీ పరంగా నాలుగు జిల్లాలుగా విభజించేందుకు ప్రణాళికలు రూపొందించారు. సికింద్రాబాద్, ముషీరాబాద్, సనత్ నగర్, కంటోన్మెంట్ నియోజకవర్గాలను కలుపుకోని ఒకటి, గోషామహల్, చార్మినార్, కార్వాన్ నియోజకవర్గాలతో మరొకటి, అంబర్ పేట, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, నాంపల్లి నియోజకర్గాలను కలుపుకొని ఇంకొకటి, యాకత్ పూర, చంద్రాయణగుట్ట, బహదూర్ పుర, మలక్ పేట నియోజకవర్గాలతో ఒక జిల్లా లెక్కన నాలుగు జిల్లాల కమిటీలను నియమించనున్నారు. వీటికి అంబర్ పేట, సికింద్రాబాద్, గోల్కొండ, భాగ్యనగర్ పేరిట నామకరణం చేసి కమిటీలను వేయనున్నారు. అదేవిధంగా జీహెచ్​ఎంసీలోనే అంతర్భాగంగా ఉన్న మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లాలోని ఉప్పల్, మల్కాజిగిరి, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి నియోజకవర్గాలతో ఒక కమిటీ, రంగారెడ్డి జిల్లాలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల్లోని జీహెచ్ఎంసీ ప్రాంతాలను కలుపుకొని మరో కమిటీని ఏర్పాటు చేయనున్నారు. ఇలా మొత్తంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఆరు జిల్లా కమిటీలకు ఆరుగురు సారథులను నియమించనున్నారు.

సెమి ఆర్బన్, గ్రామీణ ప్రాంతాల్లో మరో రెండు..

మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో జీహెచ్ ఎంసీ ప్రాంతం పోను సెమీ ఆర్బన్, గ్రామీణ ప్రాంతాలతో మరో కమిటీని వేయనున్నారు. ఇందులో బోడుప్పల్, ఫీర్జాదిగూడ, జవహర్ నగర్, నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్లు, 9 మున్సిపాలిటీలతోపాటు 61 గ్రామ పంచాయతీలతో మేడ్చల్ రూరల్ జిల్లా కమిటీని వేసేందుకు వ్యూహరచన చేస్తున్నారు. అదేవిధంగా రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, రాజేంద్రనగర్, ఇబ్రహీంపట్నం, షాద్ నగర్, కల్వకుర్తి, చేవేళ్ల నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న మూడు మున్సిపల్ కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలతోపాటు 560 గ్రామ పంచాయతీలను కలుపుకొని రూరల్ కమిటీని ఏర్పాటు చేయనున్నారు.

టార్గెట్ గ్రేటర్..

గ్రేటర్ హైదరాబాద్ నే టార్గెట్ చేస్తూ నియమించిన కమిటీలకు సారథులను ఎంపిక చేసేందుకు పార్టీ అధినాయకత్వం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అన్ని వర్గాలను ప్రభావితం చేసేలా బలమైన నాయకత్వాన్ని నియమించేందుకు చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ దిశగా ప్రత్యేక కార్యాచరణను రూపొందించుకున్నారు. ఇప్పటికే పార్టీ సీనియర్లతో సారథుల నియామకంపై విస్తృతంగా చర్చలు జరిపారు. అధినాయకత్వం ఆమోదం కోసం ఢిల్లీలో సంజయ్ మకాం వేశారు. కమిటీలకు ఆమోద ముద్ర వేసుకునే బండి రాష్ట్రానికి వస్తారని పార్టీ శ్రేణులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు.

Tags:    

Similar News