మీరు చదవండి.. మీ చదువులకు నేనే పూచీ : CM Jagan

మీరు చదవండి.. మీ చదువులకు నేనే పూచీ. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం చదువు మాత్రమే.

Update: 2022-11-30 08:21 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : 'మీరు చదవండి.. మీ చదువులకు నేనే పూచీ. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి కేవలం చదువు మాత్రమే. కుటుంబాల తలరాత మారాలన్నా.. పేదరికం దూరం కావాలన్నా చదువే మార్గం'అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెలో జగనన్న విద్యాదీవెన పథకం కింద విద్యార్థులకు జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికం నిధులను సీఎం వైయ‌స్‌ జగన్ నేడు విడుదల చేశారు. బటన్‌ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ.694 కోట్లు జమ చేశారు. దీనివల్ల మొత్తం 11.02 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన పథకాల కింద రూ.12,401 కోట్లు విడుదల చేసింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బహిరంగ సభలో ప్రజలు, విద్యార్థులను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. పేదరికం చదువులకు అవరోధం కావొద్దని దివంగత నేత వైఎస్ఆర్ ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తీసుకువచ్చారని గుర్తు చేశారు.ప్రతి విద్యార్థి తలరాత మార్చాలని తపన పడ్డారని.. ఆ పథకం వల్ల ఎంతో మంది విద్యార్థులు ఉన్నత స్థానాల్లో ఉన్నారని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు.

పేదలకు చదువును హక్కుగా మార్చాం

మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని నిర్లక్ష్యం చేశాయి. ఇక టీడీపీ ప్రభుత్వం అయితే పథకాన్ని పూర్తిగా నీరుగార్చింది. ఫలితంగా నిరుపేద పిల్లలు పెద్ద చదువులు చదవాలన్న కోరిక నెరవేరకుండా పోయింది. పాదయాత్రలో విద్యార్థుల కష్టాలు నేను నేరుగా చూశాను. అధికారంలోకి రాగానే జగనన్న విద్యాదీవెన కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చెల్లిస్తున్నాం' అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. విద్యాదీవెనకు తోడు జగనన్న వసతి దీవెన కూడా ఇస్తు్న్నాం అని జగన్ స్పష్టం చేశారు. అంతేకాదు విద్యావ్యవస్థలో సమూల సంస్కరణలు తీసుకువస్తున్నామని... పేదలకు చదువును హక్కుగా మార్చాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.

ఎంతమందిపిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తాం

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పథకాన్ని పూర్తిగా రూపురేఖలు లేకుండా చేశారని సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు. చంద్రబాబు హయాంలో రూ.1,778 కోట్లు బకాయిలు పెడితే ఆ బకాయిలను మన ప్రభుత్వమే చెల్లించింది. జగనన్న విద్యాదీవెన కింద రూ.9,052 కోట్లు, జగనన్న వసతి దీవెన కింద రూ.3,349 కోట్లు కలిపి మొత్తంగా రూ.12,401 కోట్లు అందించాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. నేడు రూ. 694 కోట్లు జమ చేసినట్లు చెప్పుకొచ్చారు. నేరుగా తల్లుల ఖాతాల్లోకే డబ్బులు జమ చేసినట్లు సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. పిల్లల చదువుకు పెట్టే ఖర్చును ఖర్చుగా భావించం.. ఆస్తిగా భావిస్తాం అని సీఎం వైఎస్ జగన్ తెలిపారు. ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందిని చదివిస్తానని భరోసా ఇస్తున్నట్లు చెప్పుకొచ్చారు. మీ పిల్లల చదువులకు నేను అండగా ఉంటా. మీ పిల్లలను పూర్తిగా చదివించే బాధ్యత నాదే అని సీఎం వైఎస్ జగన్‌ భరోసా ఇచ్చారు. ఆర్థికస్తోమత లేక ఏ విద్యార్థి ఉన్నత చదువులకు దూరం కాకూడదని జగనన్న విద్యాదీవెన పథకం కింద పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంటును అమలు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రకటించారు.

బస్సుటాప్‌పై కూర్చుని జగన్ సభకు

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ పర్యటన నేపథ్యంలో వైసీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. సభకు వెళ్లేందుకు అభిమానులకు కేటాయించిన బస్సులు చాలకపోవడంతో బస్సు టాప్‌ కూడా ఎక్కి ప్రయాణం చేశారు. అభిమానులే కాదు పార్టీ కార్యకర్తలు, నేతలు కూడా ముఖ్యమంత్రి సభకు బస్సు పైన కూర్చుని వెళ్లడంతో అంతా అవాక్కయ్యారు.

Tags:    

Similar News