వైసీపీ మేనిఫెస్టోపై సొంత పార్టీలోనే పెదవి విరుపు.. ఆశాజనకంగా ఏమీ లేవంటున్న నేతలు

వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన రెడ్డి శనివారం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో పట్ల సొంత పార్టీ అభ్యర్థులు, నేతలే పెదవి విరుస్తున్నారు.

Update: 2024-04-29 02:15 GMT

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: వైసీపీ అధినేత , ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన రెడ్డి శనివారం ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టో పట్ల సొంత పార్టీ అభ్యర్థులు, నేతలే పెదవి విరుస్తున్నారు. ఊరించి ఊరించి ఊసూరుమనిపించారని అవేదన వ్యక్తం చేస్తున్నారు. పది పరకా పెంపుతో పాత పథకాలే అమలు జరుగుతాయని చెప్పేందుకు ప్రత్యేకంగా మేనిఫెస్టో ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ మేనిఫెస్టోతో జనంలోకి వెళ్లి ఓట్లు ఎలా అడగాలని మధన పడుతున్నారు. తమ మేనిఫెస్టో కంటే తెలుగుదేశం పార్టీ ఆరు నెలల క్రితం ప్రకటించిన సూపర్ సిక్స్ చాలా బెటరని వారే అభిప్రాయపడుతున్నారు.

రుణ మాఫీ లేదే ?

రైతు రుణమాఫీ వైసీపీ మేనిఫెస్టోలో ఉంటుందని ఆ పార్టీ నేతలు ఎదురు చూశారు. కరోనా ఆ తరువాత కరువు కారణంగా రాష్ట్రంలో రైతాంగం తీవ్రంగా నష్టపోయిందని, రైతులు అప్పులు ఊబిలో కూరుకుపోయారని వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. అటువంటి రైతాంగానికి కనీసం లక్ష రూపాయల వరకైనా రుణమాఫీ ఇస్తే ఎన్నికలలో లబ్ధి చేకూరుతుందని వైసీపీ అభ్యర్థులు భావించారు. అటువంటిది ఏమీ లేకుండా నాలుగు వేల రూపాయల రైతు భరోసా దశల వారీగా పెంచి అమలు అనే హామీ ఇచ్చారు. రైతుల విషయంలో తెలుగుదేశం హామీ ఇంతకంటే బాగుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెన్షన్ పెంచలేకపోయారా?

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఏప్రిల్ నుంచే పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేస్తామని సూపర్ సిక్స్ హామీలలో భాగంగా ప్రకటించింది. అది చూసిన తరువాత కూడా పెన్షన్ విషయంలో కొసరి కొసరి రెండు విడతలుగా 2029 ఎన్నికల నాటికి 3500 చేస్తామనడం ఊసూరుమనిపించింది. అభ్యర్థులు పెన్షన్ హామీ చూసి లబోదిబో మంటున్నారు. 60 లక్షల మందిని ప్రత్యక్షంగా ప్రభావితం చేసే పెన్షన్ విషయంలో తమ పార్టీ పప్పులో కాలేసిందని బాధ పడుతున్నారు.

బస్సు ప్రయాణం లేదు

కర్ణాటక, తెలంగాణలలో కాంగ్రెస్ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం హామీతో విజయం సాధించింది. తెలుగుదేశం వెంటనే ఆ హామీని సూపర్ సిక్స్ లో చేర్చింది. వైసీపీ కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి కొంత మేర అయినా అవకాశం కల్పిస్తుందని అభ్యర్థులు, నేతలు ఎదురు చూశారు. చివరకూ ఆ హామీ లేకపోవడం నిరాశ పర్చింది. మహిళలను ప్రత్యేకంగా ఆకట్టుకొనే ప్రత్యక పథకం ఏదీ లేదు.

ప్రత్యేక హోదా అంశమే లేదు

గత ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు ప్రధాన కారణాల్లో ఒకటి అయిన రాష్టానికి ప్రత్యేక హోదా అంశమే మేనిఫెస్టోలో లేదు. గత ఎన్నికల్లో 25 కు 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రత్యేక హోదా తీసుకు వస్తానని జగన్ హామీ ఇచ్చారు. ఆప్పుడు ఎంపీల సంఖ్య 31 కి చేరింది. అయినా హోదా కాదు కదా మిగిలిన విభజన హామీల విషయంలోనూ ఒక్క ముందుడుగూ లేదు. విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ అంశం రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా భూములు ఇవ్వకపోవడం వల్ల ఆగిపోవడం తీవ్ర విమర్శలకు అవకాశం కల్పించింది.

ఇది మేనిఫెస్టోయేనా ?

ఇదేం మేనిఫెస్టో అని పీసీపీ అధ్యక్షురాలైన సొంత చెల్లి షర్మిల ఘాటుగా విమర్శించారు. సంపూర్ణ మద్య నిషేధం చేయకుండా 2024 ఎన్నికల్లో ఓటు అడగను అని జగనన్న చెప్పిన మాట ఏమైందని ఆమె ప్రశ్నించారు. మెగా డీఎస్సీ దగా డీఎస్సీ అయిందని, ఐదేళ్లలో ఒక సంక్రాంతికి జాబ్ క్యాలెండర్ విడుదల కాలేదని తప్పుపట్టారు. ఇక తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అయితే మేనిఫెస్టోను చూసి ఎన్నికలకు ముందే జగన్ చేతులెత్తేశారని వ్యాఖ్యానించారు.

Read More..

పోసాని కృష్ణమురళికి బిగ్ షాక్.. టీడీపీ తీర్థం పుచ్చుకున్న ఫ్యామిలీ మెంబర్ 

Similar News