వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం – టీడీపీ సీనియర్ నేత

ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిందని, జగన్‌ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అవేదన వ్యక్తం చేశారు.

Update: 2024-04-29 15:25 GMT

దిశ,ప్రతినిధి: ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర భవిష్యత్తు సర్వనాశనం అయిందని, జగన్‌ రాష్ట్ర అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోలేదని టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు అవేదన వ్యక్తం చేశారు. బాపులపాడు మండలం వీరవల్లి గ్రామంలో సోమవారం సాయంత్రం నిర్వహించిన ప్రచార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వీరవల్లి ఎన్.టి.ఆర్ విగ్రహం వద్ద జరిగిన సభలో యనమల మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధి జరగాలంటే ఉమ్మడి కూటమి అధికారంలోకి రావాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఓటు అనే ఆయుధం ద్వారా జగన్ ను ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు పప్పు బెల్లాలు పంచి పెట్టి పెద్ద ఎత్తున ప్రజాధనాన్ని జగన్ లూటి చేశారని ఆరోపించారు. రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలన్నా, అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరగాలన్నా రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడం చారిత్రక అవసరమని యనమల అన్నారు. మచిలీపట్నం పార్లమెంట్ కూటమి అభ్యర్థి వల్లభనేని బాలసౌరి మాట్లాడుతూ వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనకబడిపోయింది. రాష్ట్రం అభివృద్ధి పథంలో నడిపించాలంటే ఎన్డీఏ కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీగా పని చేసిన ఐదేళ్ల కాలంలో బందరు నియోజకవర్గ అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు తెచ్చినట్లు చెప్పారు. కూటమి అభ్యర్థులకు ఓట్లు వేసి రాష్ట్ర భవిష్యత్తును, దేశ భవిష్యత్తును కాపాడాలని ఓటర్లకు పిలుపునిచ్చారు.

గన్నవరం నియోజకవర్గం ఎన్డీయే కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు మాట్లాడుతూ తనను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపితే గన్నవరం నియోజకవర్గాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలుపుతామని, నియోజకవర్గానికి పరిశ్రమలు తెచ్చి స్థానిక యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. నిరుపేదలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడంతో పాటు నియోజకవర్గంలో తాగు, సాగు నీటి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. ప్రత్యేక ప్రణాళిక ద్వారా గన్నవరం నియోజకవర్గం రూపురేఖలు మార్చుతానని వివరించారు. మే 13న జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ సైకిల్ గుర్తుకు ఓటు వేసి తనను ఎమ్మెల్యేగా, గాజు గ్లాసు గుర్తుపై ఓటేసి వల్లభనేని బాలశౌరిని ఎంపీగా గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Similar News