శ్రీవారి ఆలయంలో మాపట్ల ఎవరూ అసభ్యంగా ప్రవర్తించలేదు : రవికుమార్ వీడియో విడుదల

శ్రీవాణి టికెట్ కొని శ్రీవాణి దర్శనం చేసుకున్న తమకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని హైదరాబాద్‌కు చెందిన భక్తుడు రవికుమార్ దంపతులు స్పష్టం చేశారు.

Update: 2023-12-08 05:58 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : శ్రీవాణి టికెట్ కొని శ్రీవాణి దర్శనం చేసుకున్న తమకు స్వామివారి దర్శనం చాలా బాగా జరిగిందని హైదరాబాద్‌కు చెందిన భక్తుడు రవికుమార్ దంపతులు స్పష్టం చేశారు. దర్శనం అనంతరం స్వామి వారిని చూస్తూ వెనక్కు నడుచుకుంటూ తన్మయత్వంలో అక్కడే ఆగిపోయిన సమయంలో అక్కడి సిబ్బంది వేగంగా వెళ్లాలని తమకు గట్టిగా చెప్పారేకానీ అసభ్యంగా ప్రవర్తించలేదని వివరణ ఇచ్చారు. అయితే ఈ అంశాన్ని మీడియా, సోషల్ మీడియా వక్రీకరించి టీటీడీ మీద బురద చల్లేలా ప్రచారం చేయడం తమకు బాధ కలిగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు శుక్రవారం రవికుమార్ ఒక వీడియోను పోస్ట్ చేశారు.‘మేము శ్రీవాణి టికెట్ మీద దర్శనానికి వచ్చాము తిరుమలలో వసతి దర్శనం అన్నీ బాగా అయ్యాయి దర్శనం తరువాత స్వామిని చూస్తూ వెనక్కు వస్తూ తన్మయత్వంతో అక్కడే నిలబడిపోయాము. ఆ సమయంలో అక్కడి సిబ్బంది మాతో గట్టిగా మాట్లాడారు. దాంతో మేం కొంత బాధపడి వాస్తవాలు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళితే సమస్యలు ఏమైనా ఉంటే సరి చేసుకుంటారనే ఉద్దేశంతో మీడియాతో మాట్లాడాము’ అని తెలిపారు. అయితే దీన్ని కొందరు లేనివి ఉన్నట్లుగా వారి రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకునేలా ట్రోల్ చేయడం బాధాకరం. ఇప్పటికి మేము నాలుగు సార్లు శ్రీవాణి దర్శనానికి వచ్చాము. ఎలాంటి ఇబ్బంది కలగలేదు. మమ్మల్ని అడ్డుపెట్టుకుని టీటీడీ మీద బురద చల్లడం మాకు చాలా బాధ కలిగించింది’ అని రవికుమార్ ఆ వీడియోలో వెల్లడించారు.

Tags:    

Similar News