Kodi Kathi case : విచారణకు సీఎం జగన్ హాజరుకావాల్సిందే: జడ్జి ఆదేశాలు

వైఎస్ జగ‌న్‌పై విశాఖలో కోడికత్తితో దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.

Update: 2023-01-31 08:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : వైఎస్ జగ‌న్‌పై విశాఖలో కోడికత్తితో దాడి చేసిన ఘటన తెలుగు రాష్ట్రాలతోపాటు యావత్ దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఎన్ఐఏ కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితుడిగా ఉన్న సీఎం వైఎస్ జగన్ సైతం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. తదుపరి విచారణకు హాజరుకావాలని విజయవాడలోని ఎన్ఐఏ కోర్టు మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. కోడికత్తి కేసు విచారణను ఎన్ఐఏ కోర్టు చేపట్టింది.

ఇందులో భాగంగా నాడు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న విశాఖ ఎయిర్‌పోర్టు అసిస్టెంట్ కమాండేట్ దినేష్ కుమార్‌ను విచారణకు రావాలని ఇటీవలే ఎన్ఐఏ కోర్టు నోటీసులు ఇచ్చింది. ఘటన జరిగిన నాలుగేళ్ల తర్వాత కేసు మరోసారి తెరపైకి వచ్చింది. ఈ కేసు విచారణలో భాగంగా నిందితుడు శ్రీనివాస్‌ విచారణకు హాజరయ్యారు. శ్రీనివాస్ తరుపున సలీం వాదనలు వినిపించారు. కానీ అసిస్టెంట్ కమాండేట్ దినేష్ కుమార్ మంగళవారం విచారణకు హాజరుకాలేదు. ఈ కేసుకు సంబంధించి మొత్తం ట్రయల్ షెడ్యూల్‌ను కోర్టుకు సమర్పించాలని ఆదేశించింది. ఇందులో విక్టిమ్ (బాధితుడు) షెడ్యూల్ కూడా ఉండాలని తెలిపింది.

ఈ కేసులో బాధితుడు జగన్ కావడంతో ఆయన కూడా కోర్టుకు వచ్చేలా షెడ్యూల్‌ను రూపొందించాలని ఎన్ఐఏను జడ్జి ఆదేశించారు. తదుపరి విచారణను ఫిబ్రవరి 15కు వాయిదా వేసిన కోర్టు ఆరోజు విచారణకు జగన్ రావాలని ఆదేశాలు జారీ చేశారు. ఇకపోతే వైఎస్ జగన్ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ప్రజా సంకల్పయాత్ర పేరుతో పాదయాత్ర చేసిన సంగతి తెలిసిందే. పాదయాత్రకు స్వల్ప విరామం ఇచ్చి విశాఖ ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్ బయలుదేరుతుండగా వైఎస్ జగన్ పై శ్రీనివాస్ అనే యువకుడు కోడికత్తితో దాడి చేశాడు. ఈ కేసు విచారణ విజయవాడలోని ఎన్ఐఏ కోర్టులో ఇప్పటికీ కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

Read more:

YS Jagan on AP Capital: :ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు 

Tags:    

Similar News