YS Jagan on AP Capital: :ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 4 |
YS Jagan on AP Capital: :ఏపీ రాజధానిపై సీఎం జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో : విశాఖ రాజధాని అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి క్లారిటీ ఇచ్చేశారు. గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహాక సదస్సు వేదికగా కీలక ప్రకటన చేశారు. విశాఖయే ఆంధ్రప్రదేశ్ పరిపాలన రాజధాని అని స్పష్టం చేశారు. త్వరలోనే విశాఖ రాజధాని కాబోతుందని....రాజధాని కాబోతున్న విశాఖపట్టణంకు ఇండస్ట్రీస్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని సీఎం జగన్ ఆహ్వానించారు. ఢిల్లీలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో పాల్గొన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఈ సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని నెలల్లోనే తాను కూడా విశాఖకు మకాం మార్చుతానని ప్రకటించేశారు. అంతేకాదు సీఎం క్యాంపు కార్యాలయంపై సంకేతాలు సైతం ఇచ్చేశారు. మార్చి 3,4తేదీలలో విశాఖలో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని..ఈ అంతర్జాతీయ పెట్టుబడుల సదస్సుకు అంతా హాజరుకావాలని సీఎం జగన్ అభ్యర్థించారు. పరిశ్రమల అనుమతుల విషయంలో సింగిల్ డెస్క్ విధానం అమలు చేస్తున్నామని... గతంలో ఎన్నడూ లేని విధంగా 21 రోజుల్లో పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హామీ ఇచ్చారు.

పెట్టుబడులు పెట్టండి

న్యూఢిల్లీ వేదికగా జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సన్నాహక సదస్సులో భాగంగా వివిధ దేశాల దౌత్యవేత్తలతో రౌండ్‌ టేబుల్ సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వివరించారు. బల్క్ డ్రగ్స్, స్పైస్ పరిశ్రమల నెలకొల్పేందుకు మంచి అనుకూల వాతావరణం ఉందని.. నిరంతర విద్యుత్, ల్యాండ్ బ్యాంక్‌ సమృద్దిగా ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ దౌత్యవేత్తలకు తెలియజేశారు. మరోవైపు ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో గత మూడేళ్లుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నంబర్ వన్ స్థానంలో ఉందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సన్నాహక సదస్సులో స్పష్టం చేశారు. పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం చేస్తున్న కృషితో పాటు పారిశ్రామిక వేత్తలు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్‌తోనే నంబర్‌ వన్‌గా ఉన్నట్లు తెలియజేశారు.

రాష్ట్రంలో సుదీర్ఘ తీరప్రాంతం ఉందని అలాగే 11.43శాతం వృద్ధి రేటుతో దేశంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌అని సీఎం వైఎస్ జగన్ వెల్లడించారు. అంతేకాదు 11 ఇండస్ట్రియల్‌ కారిడార్లలో మూడు ఏపీకే రావడం అత్యంత శుభపరిణామమని చెప్పుకొచ్చారు. ఇందుకు సహకరించిన వ్యాపారులకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు తమవంతు సహకారం అందిస్తామని రాయితీలు ఇస్తామని సీఎం జగన్ హామీ ఇచ్చారు. ఈ ఇన్వెస్టర్ సన్నాహక సదస్సులో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌తోపాటు సీఎస్ కేఎస్‌ జవహర్‌రెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డి, స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్యతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు.

Read more:

వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యే ఝలక్

విచారణకు సీఎం జగన్ హాజరుకావాల్సిందే: జడ్జి ఆదేశాలు

Next Story