AP Politics:వైసీపీ ఐదేళ్ల పాలనలో విధ్వంసమే తప్ప అభివృద్ధి లేదు..ప్రచారంలో నారా కుటుంబం!

మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి నారా లోకేష్‌కు ఓటేయాలని ఆయన కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు.

Update: 2024-05-07 13:22 GMT

దిశ ప్రతినిధి,గుంటూరు:మంగళగిరి నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరు ఆలోచించి నారా లోకేష్‌కు ఓటేయాలని ఆయన కుటుంబ సభ్యులు పిలుపునిచ్చారు. మంగళగిరి పట్టణం పలు వార్డులలో మంగళవారం నారా లోకేష్ కుటుంబ సభ్యులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. నారా లోకేష్‌ అత్యధిక మేజార్టీతో గెలవాలని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వేడుకున్నారు. అనంతరం ఇంటింటికీ తిరుగుతూ కూటమి మేనిఫెస్టో, సూపర్‌సిక్స్‌ పథకాలు, బీసీ డిక్లరేషన్‌కు సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. 13న జరిగే పోలింగ్‌ రోజు ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్‌ను, ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ను సైకిల్‌‌ గుర్తుపై ఓట్లు వేసి భారీ మేజార్టీతో గెలిపించాలని కోరారు. మహిళలు, ప్రజలు వీరికి అడుగడుగునా ఘన స్వాగతం పలికి హారతులిచ్చారు.

ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి మద్దతు తెలిపారు. భారీగా తరలి వచ్చిన ప్రజలతో రెండు వార్డుల్లో సందడి వాతావరణం నెలకొంది. 10వ వార్డులోని కుండల తయారీ కేంద్రంలో కుండ తయారు చేసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండు వార్డుల ప్రజలు తమ సమస్యలను వీరి దృష్టికి తీసుకురాగా నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్ మాట్లాడుతూ నారా లోకేష్ ఐదేళ్లుగా కష్టపడుతూ నియోజకవర్గ ప్రజలకు దగ్గరయ్యారని పేర్కొన్నారు. మంగళగిరిని ఆదర్శవంతమైన నియోజకవర్గంగా అభివృద్ధి చేయడమే నారా లోకేష్ లక్ష్యమని చెప్పారు.

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడంతో పాటు విద్యార్థులకు, నిరుద్యోగులకు మంచి మార్గాలు చూపిస్తారని, నియోజకవర్గానికి పరిశ్రమలు తీసుకు వస్తారని అన్నారు. రాజధాని అమరావతి అభివృద్ధి చెందుతుందని చెప్పారు. ప్రజలకు మేలు చేయడం కోసమే టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పాడ్డాయని తెలిపారు. కూటమి అధికారం చేపట్టడం ద్వారా రాష్ట్ర భవిష్యత్తు మెరుగు పడుతుందన్నారు. కూటమిని ప్రజలు ఆదరిస్తున్నారని, ఈ ఎన్నికల్లో కూటమికి విజయం తథ్యమన్నారు. ప్రజలు రాష్ట్ర భవిష్యత్తు, భావితరాల బాగు కోసం టీడీపీకి ఓటు వేయాలని కోరారు. నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు.

సూపర్‌ సిక్స్ పథకాలతో అందరికీ ప్రయోజనం

టీడీపీ కూటమి ప్రకటించిన సూపర్‌ సిక్స్‌ పథకాలతో అందరికీ ప్రయోజనం చేకూరుతుందన్నారు. ప్రతి కుటుంబానికి ఉచితంగా మూడు సిలిండర్లు, తల్లికి వందనం పేరుతో చదువుకునే పిల్లలకు ఒక్కొక్కరికి ఏడాదికి రూ.15వేలు, ప్రతి మహిళలకు నెలకు రూ.15 వందలు, నిరుద్యోగులకు ఉపాధి, భృతి, మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం తదితర ఉపయోగాలు ఉన్నట్లు చెప్పారు. చంద్రబాబు సీఎం అవగానే వీటిని అమలు చేస్తారని చెప్పారు. పింఛనుదారులకు నెలకు రూ.4 వేలు, దివ్యాంగులకు రూ.6 వేలు, పక్షవాతం వంద శాతం ఉన్న వారికి రూ.10వేలు పింఛన్ ఇవ్వనున్నట్లు తెలిపారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో విధ్వసంమే తప్ప అభివృద్ధి సంక్షేమం జాడ లేదని మండిపడ్డారు. ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి కాలేదన్నారు. పోలవరం, చింతలపూడి ప్రాజెక్టులను గాలికి వదిలేశారని విమర్శించారు. మూడు రాజధానుల పేరుతో అమరావతిని సర్వనాశనం చేసి ఆంధ్రప్రదేశ్‌కు రాజధాని లేని రాష్ట్రంగా చేశారని ధ్వజమెత్తారు. వైసీపీ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనుకబడిందన్నారు. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే, సంతోషంగా ఉండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం ఒక్కటే మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో గారపాటి లోకేశ్వరి, నందమూరి మాధవి మణి, గారపాటి శ్రీనివాస్, కంఠమనేని శ్రీనివాస్ ప్రసాద్, శారద దుర్గాప్రసాద్, కవిత ప్రసాద్, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Similar News