విశాఖకు రాజధాని తరలింపు మరింత ఆలస్యం: అసలు లోగుట్టు ఇదేనా?

రాజధాని తరలింపు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? విజయదశమికి సాధ్యం అయ్యే ఛాన్స్‌లేవా?

Update: 2023-10-15 10:41 GMT

దిశ, డైనమిక్ బ్యూరో : రాజధాని తరలింపు మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందా? విజయదశమికి సాధ్యం అయ్యే ఛాన్స్‌లేవా? నవంబర్ లేదా డిసెంబర్‌లో రాజధాని షిఫ్ట్ అవ్వొచ్చు అంటున్న వార్తల్లో వాస్తవం ఎంత?రాజకీయ లబ్ధి కోసం రాజధాని తరలింపు ఆలస్యం అవుతుందా? లేక భవనాల ఎంపిక, సీఎం క్యాంపు కార్యాలయం ఇంకా పూర్తి కాలేదనా? ఆలస్యం అవ్వడానికి కారణం ఏంటి? ఇవి ఏపీలో ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని ప్రతీ పౌరుడి మదిని తొలిచివేస్తున్న ప్రశ్నలు. ఈనెల విజయదశమి నుంచి విశాఖ కేంద్రంగా పరిపాలన ఉంటుందని సీఎం వైఎస్ జగన్ ప్రకటించేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కూడా ఆదేశాలు సైతం ఇచ్చేశారు. అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సీఎంఓ కార్యాలయం షిఫ్ట్ చేస్తూ జీఓ 2015 విడుదల చేశారు. అంతేకాదు ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటుకు అవసరమైన వసతి కోసం ఏర్పాట్లపైనా దిశానిర్దేశం చేశారు. అయితే పనులు అంత వేగంగా జరగడం లేదని తెలుస్తోంది. దీంతో సీఎం జగన్ విశాఖకు షిఫ్ట్ అవ్వాలనుకున్న ముహూర్తం వాయిదా పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈసారి వాయిదానే

పరిపాలన వికేంద్రీకరణతోనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని సీఎం వైఎస్ జగన్ అభిప్రాయపడ్డారు. ఇందులో భాగంగా మూడు రాజధానులు ప్రకటించారు. విశాఖపట్నంను పరిపాలన రాజధానిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాజధాని తరలింపునకు అనేక ముహూర్తాలు పెట్టారు. కానీ అవేమీ జరగలేదు. కానీ ఈసారి విజయదశమికి పక్కాగా విశాఖ నుంచే పరిపాలన కొనసాగుతుందని ప్రకటించారు. రెండు నెలలకు ముందు సీఎం జగన్ ప్రకటించిన నేపథ్యంలో ఈసారి పక్కా అని అంతా భావించారు. అంతేకాదు ప్రభుత్వం రాజధాని తరలింపు విషయంలో చకచకా పనులు మెుదలు పెట్టింది. రాజధాని తరలింపునకు జీవో విడుదల చేయడం..శాఖల కార్యాలయాల ఎంపికకు సంబంధించి కమిటీని ఏర్పాటు చేయడం వంటి పనులు చకచకా జరిగిపోయాయి. దీంతో ఇక తరలింపు షురూ అయిపోయిందని అంతా భావించారు. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా అక్టోబర్ 23న సీఎం క్యాంపు కార్యాలయం లో గృహప్రవేశం చేసి 24 నుంచి విశాఖ నుంచే పరిపాలన చేస్తారని ప్రచారం సైతం కూడా జరిగింది. దీంతో ఇక దసరాకు అమరావతి నుంచి విశాఖపట్నంకు సీఎం షిఫ్ట్ అవుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. తాజా పరిస్థితులను పరిశీలిస్తే సీఎం విశాఖ నుంచి పాలన చేయడం మరింత ఆలస్యం అవుతుందని తెలుస్తోంది. ఈ దసరాకు అమరావతి నుంచి రాజధాని విశాఖకు షిఫ్ట్ అయ్యే అవకాశాలు దాదాపు లేవని తెలుస్తోంది. ఈసారి కూడా వాయిదా పడటం తప్పదు అని ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందుతుంది.

నవంబర్ లేదా డిసెంబర్‌లో షిఫ్ట్

విశాఖపట్నం కేంద్రంగా పాలన సాగించాలి అనుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆశలు నెరవేరేందుకు మరింత సమయం పట్టనుంది. ఎందుకంటే విశాఖలో పూర్తి స్థాయిలో వసతుల కల్పన పూర్తికాలేదు. ఈ ప్రధాన కారణంతో రాజధాని షిఫ్టింగ్‌ మరింత ఆలస్యం అయ్యే అవకాశం కనిపిస్తోంది. రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం నిర్మాణం జరుగుతున్న సంగతి తెలిసిందే. దసరా నాటికి ఈ భవనంలో అన్ని మౌళికవసతులు పూర్తి చేసి అప్పగించాలని ప్రభుత్వం కోరినప్పటికీ సాధ్యం కాలేదు. మంత్రులు, శాఖల వారీగా ఎంతెంత మేర స్థలం అవసరం, భవనాలకు సంబంధించిన వివరాలు సేకరించేపనిలో ముగ్గురు అధికారుల కమిటీ నిమగ్నమై ఉంది. ఈ కమిటీ పూర్తి స్థాయిలో నివేదిక అందించాల్సి ఉంది. ఇప్పటికే విశాఖపట్నంలలో అనుకూలంగా ఉండే భవనాల ఎంపిక ప్రక్రియలో జోరు పెంచింది. సీఎం కార్యాలయ సిబ్బందితో పాటు సీఎస్, మంత్రులు,కార్యదర్శులకు అవసరమైన వసతి చూసిన తర్వాతే సీఎం వైఎస్ జగన్ విశాఖలో మకాం వేస్తారని తెలుస్తోంది. సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణంతోపాటు ప్రధాన కార్యాలయాలు అందుబాటులోకి రావడానికి నెలకు పైగా సమయం పట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. అంటే నవంబర్ నెలాఖరు లేదా డిసెంబర్‌లో సీఎం వైఎస్ జగన్ విశాఖ నుంచి పరిపాలన చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.

రాజకీయ లబ్ధికోసమేనా?

మూడు రాజధానుల అంశాన్ని వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 2024 ఎన్నికల్లో దీన్నే ఎన్నికల ప్రధాన అస్త్రంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైసీపీ భావిస్తోంది. ఉత్తరాంధ్రలో వైసీపీకి మైలేజ్ పెంచడంతోపాటు టీడీపీ, జనసేనలకు దెబ్బకొట్టాలని భావిస్తోంది. విశాఖను రాజధానిగా ప్రకటిస్తే ఉత్తరాంధ్రలో పార్టీకి మంచి మైలేజ్ రావడంతోపాటు ఉభయగోదావరి జిల్లాలపైనా దాని ప్రభావం ఉంటుందని వైసీపీ భావిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇప్పటికిప్పుడు రాజధాని తరలింపు చేస్తే ఎన్నికల సమయానికి అంతా మరచిపోతారని వైసీపీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఎన్నికల వేడి రాజుకుంటున్న సమయంలో అందులోనూ సీఎం జగన్ నేరుగా ఎన్నికల ప్రచార బరిలోకి దిగే సమయంలో రాజధాని తరలింపు ప్రక్రియ చేపడితే బాగుంటుందని వైసీపీలో కొందరు అభిప్రాయపడుతున్నట్లు తెలుస్తోంది. రాజధాని తరలింపును ఓ వేడుకగా ఉత్తరాంధ్రతోపాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించాలని వైసీపీ భావిస్తోంది. అందువల్లే రాజధాని షిఫ్టింగ్ ఆలస్యం చేస్తోందని ఒకవైపు ప్రచారం జరుగుతుంది.

Tags:    

Similar News