Heavy Rains: ఏపీలో పలు చోట్ల భారీ వర్షం.. తిరుపతిలో బీభత్సం

ఉపరితల ద్రోణి ప్రభావతంతో ఏపీలో పలు చోట్ల భారీగా వర్షాలు కురిశాయి..

Update: 2023-05-25 17:02 GMT

దిశ, వెబ్ డెస్క్: ఉపరితల ద్రోణి ప్రభావతంతో ఏపీలో పలు చోట్ల భారీగా వర్షాలు కురిశాయి. తిరుపతి, ప్రకాశం, బాపట్ల జిల్లాలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. తిరుపతిలో మధ్యాహ్నం వరకూ ఎండ ఉక్కపోతతో అల్లాడిపోయిన ప్రజలు సాయంత్రం అయ్యే సరికి వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పలుచోట్ల కురిసింది. టీటీడీ పరిపాలనా భవనం, లీలా మహల్ జంక్షన్‌లో ఈదురు గాలుల ధాటికి భారీ వృక్షం నెలకూలాయి. బస్టాండ్ సెంటర్‌లో వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. మరోవైపు రోడ్లపై నీరు నిలిచిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తిరుమల వెళ్లే భక్తులు సైతం ఇక్కట్లు పడ్డారు. పలు కాలనీల్లో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయింది.

అటు ప్రకాశం జిల్లాలోనూ వర్షం బీభత్సం సృష్టించింది. తాళ్లూరు మండలం బొద్దుకూరపాడులో ఈదులుగాలులతో కూడిన వర్షం పడింది. దీంతో 12 విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. బాపట్ల జిల్లా చినగంజాంలోనూ వర్షం కురిసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడటంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. వర్షాలు పడుతున్నప్పుడు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావొద్దని, చెట్ల కింద అసలు నిలబడొద్దని హెచ్చరించారు. 

Tags:    

Similar News