Tulasireddy: వైసీపీ సలహాదారులపై సెటైర్స్

వైసీపీ ప్రభుత్వంలోని సలహాదారులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డా.ఎన్ తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు....

Update: 2023-05-26 12:20 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: వైసీపీ ప్రభుత్వంలోని సలహాదారులపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత డా.ఎన్ తులసిరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ సర్కార్‌లో సలహాదారులుగా నియమితులైన వారంతా కేవలం స్వాహాదారులు మాత్రమేనని ఆరోపించారు. లక్షల్లో జీతాలు తీసుకుంటున్న సలహాదారులు ఏ ఒక్క మంచి సలహా అయినా ప్రభుత్వానికి ఇచ్చారా అని నిలదీశారు. విభజన నేపథ్యంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని.. ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉందన్నారు. ఇంతటి దయనీయ పరిస్థితుల్లో ప్రభుత్వానికి అంతమంది సలహాదారులు అవసరమా అని తులసిరెడ్డి నిలదీశారు. మింగ మెతుకు లేదు... మీసాలకు సంపంగి నూనె అన్నచందంగా వైసీపీ ప్రభుత్వం పరిస్థితి ఉందని మండిపడ్డారు.

ఒక్కో సలహాదారుడికి నెలకు రూ. 5 లక్షలు ప్రభుత్వం వెచ్చిస్తుందని ఇంత ఖర్చు అవసరమా అని మండిపడ్డారు. ప్రస్తుతం ఉన్న వారు సలహాలు ఇచ్చింది లేదని ఒకవేళ ఇచ్చినా సీఎం వైఎస్ జగన్ స్వీకరించేది లేదని మండిపడ్డారు. ఒక్క మైనార్టీ శాఖకే నలుగురు సలహాదారులు ఉండటం ఆశ్చర్యకరంగా ఉందన్నారు. సలహాదారుల నియామకాలపై హైకోర్టు అక్షింతలు వేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సలహాదారుల వ్యవస్థ వైసీపీ నేతలకు ఉపాధి హామీ పథకంలా మారిందని తులసి రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Tags:    

Similar News