ఆ పార్టీనే Rayalaseema ద్రోహి ..Cpi సంచలన ఆరోపణ

రాయలసీమకు ద్రోహం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ ఆరోపించారు. ...

Update: 2022-12-04 09:56 GMT

దిశ, అనంతపురం: రాయలసీమకు ద్రోహం చేసింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీనేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జగదీష్ ఆరోపించారు. సీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి జాఫర్, సహాయ కార్యదర్శులు నారాయణస్వామి, మల్లికార్జున, నగర కార్యదర్శి శ్రీరాములు, రాప్తాడు నియోజకవర్గం కార్యదర్శి రామకృష్ణ, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్‌లతో కలిసి ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు.


ఈ సందర్భంగా సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జగదీష్ మాట్లాడుతూ రాయలసీమ ద్రోహులు వైయస్సార్ పార్టీ వారేనన్నారు. న్యాయ రాజధాని హైకోర్టు కర్నూలు అని ప్రజలను మభ్యపెడుతూ మరోపక్క సుప్రీంకోర్టులో అమరావతిలోనే హైకోర్టు ఉంటుందని స్వయాన ప్రభుత్వ న్యాయవాది సుప్రీంకోర్టు సాక్షిగా చెప్పాడన్నారు. కడపలో ఉక్కు కర్మాగారం నిర్మిస్తామని స్వయానా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి శిలాఫలకం వేసి మూడున్నర సంవత్సరాలైనా కర్మాగారానికి ప్రభుత్వం ఏ మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. హంద్రీనీవాకు సమాంతర హంద్రీనీవా కాలువను నిర్మిస్తామని తద్వారా పదివేల క్యూసెక్కులు జీడిపల్లి రిజర్వాయర్ వరకు నీరు తీసుకువస్తామని ముఖ్యమంత్రి అనంతపురం బహిరంగ సభలో హామీ ఇచ్చి మూడేళ్ల అయిందన్నారు. ఏ ఒక్క పరిశ్రమనూ రాయలసీమకు తీసుకురాలేకపోయి వైయస్సార్ ప్రభుత్వమే రాయలసీమకు తీరని ద్రోహం చేసిందన్నారు. వైసీపీ నిర్వాకం వల్ల అన్నమయ్య ప్రాజెక్టు నీటిలో కొట్టుకుపోయిందని, రాయలసీమకు ఆ పార్టీ తీరని అన్యాయం చేసిందని రాజేష్ తెలిపారు.

తిరుపతిలో ఉన్న పరిశ్రమలు కూడా ఇతర రాష్ట్రాలకు తరలిపోయినాయని విమర్శించారు. అందువల్లనే డిసెంబర్ 9న సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ నాయకత్వంలో కడప జిల్లాలో ఉక్కు కర్మాగారం నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ పాదయాత్రలు చేపడుతున్నామన్నారు. ఇప్పటికైనా వైయస్సార్ ప్రభుత్వం రాయలసీమ అభివృద్ధిపై చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రజలను, ప్రజాస్వామిక వాదులను సమీకరించి ఆందోళనలు చేపడతామని జగదీష్ హెచ్చరించారు.

Similar News