Kuppam Incident: చంద్రబాబు జోలికి వస్తే ఎవర్నీ వదలం!

ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక, దుష్టపరిపాలను సాగిస్తున్నాడని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు.

Update: 2023-01-04 12:48 GMT

దిశ,రాయదుర్గం: ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరాచక, దుష్టపరిపాలను సాగిస్తున్నాడని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విలువల పట్ల ఏ మాత్రం గౌరవం లేని జగన్ రెడ్డి పాలనలో అడుగడుగునా పౌర హక్కులకు భంగం వాటిల్లుతుందని మండిపడ్డారు. క్షుద్రశక్తుల చేతిలో రాష్ట్రం ఎంతగా విలవిల లాడిపోతుందో, ప్రజాస్వామ్యం అడుగడుగునా పరిహాసానికి గురవుతుందో కుప్పంలో జరుగుతున్న సంఘటనలే ప్రత్యక్ష నిదర్శనమని పేర్కొన్నారు.

వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన కేడి నెం:01 జీ.ఓ.ను అడ్డుపెట్టుకొని చంద్రబాబు సొంత నియోజకవర్గంలో సభలు పెట్టకుండా, ప్రజలను కలవకుండా ఆంక్షలు విధించడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయనగరంలో మంత్రి బొత్స సత్యనారాయణతో పాటు వైసీపీ నాయకులు అందరూ పెద్ద ఎత్తున నిర్వహించిన ర్యాలీకి జీ.ఓ నెం: 01 ఎందుకు వర్తించదని ఆయన ప్రశ్నించారు. అదేవిధంగా నిన్న జగన్మోహన్ రెడ్డి రాజమండ్రి పర్యటనలో రోడ్డుకు అడ్డంగా బారికేడ్లతో ప్రజల రాకపోకలకు తీవ్ర విఘాతం కల్పించడంతో పాటు పౌరుల హక్కుల్ని హరించివేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జీ.ఓ. నెం:01 ఎందుకు వర్తించదని నిలదీశారు.

సొంత నియోజకవర్గం కుప్పంలో మూడుసార్లు ముఖ్యమంత్రిగా పని చేసిన నాయకుడు, జాతీయ స్థాయిలో గౌరవ మర్యాదలు పొందుతున్న నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటనకే అడ్డంకులు సృష్టిస్తున్న పోలీసు వ్యవస్థను ఆయన తప్పుబట్టారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో పౌరుల హక్కులకు భంగం కలిగించిన, ప్రజల కదలికలను ఇష్టానుసారం నియంత్రిచాలనుకొంటే ఈ రాష్ట్రంలో తీవ్రమైన పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకొంటే, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. ఇది ఇలా ఉండగా ఇంకోవైపు జీ. ఓ.నెం: 2430 తీసుకొచ్చి పత్రికలను నియంత్రించడానికి జగన్మోహన్ రెడ్డి కుట్రలు చేస్తున్నడన్నారు. అదే క్రమంలో నేడు ప్రతిపక్షాల పార్టీలు సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేసుకోవడానికి వీలు లేకుండా కొత్త సంవత్సరంలో తెచ్చిన జీ. ఓ నెం:01 పై ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. ప్రజలిచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని నష్టం జరగక తప్పదన్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనను అడ్డుకొంటే మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున టీడీపీ శ్రేణులు అందరూ రోడ్లపై నిరసన తెలియజేయడంతో పాటు జీ. ఓ నెం:01 ప్రతిఘటిస్తామన్నారు. టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు జోలికొస్తే మాత్రం ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి నూకలు చెల్లినట్లేనని హెచ్చరించారు.

Tags:    

Similar News