పాండ్యాకు షాక్.. టీమ్ ఇండియా వైస్ కెప్టెన్‌గా ఎవరు ఊహించని ఆటగాడు?

ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ సందడి మొదలుకానుంది. జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభకానుంది.

Update: 2024-04-29 19:16 GMT

దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్ సందడి మొదలుకానుంది. జూన్ 1 నుంచి పొట్టి ప్రపంచకప్ ప్రారంభకానుండగా.. ఇంకా బీసీసీఐ భారత జట్టును ప్రకటించలేదు. జట్టును ప్రకటించడానికి మే 1 చివరి తేదీ. మంగళవారం అహ్మదాబాద్‌లో బీసీసీఐ సెలెక్షన్ కమిటీ మీటింగ్ జరగనుంది. ఈ సమావేశం తర్వాత జట్టును ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దీంతో జట్టులో ఎవరికి చోటు దక్కుతుందోనని అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఈ పరిస్థితుల్లో ఓ ఆసక్తికర వార్త బయటకొచ్చింది. వైస్ కెప్టెన్సీ మార్పు ఉండబోతుందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

కెప్టెన్ రోహిత్ శర్మ గైర్హాజరులో టీ20 జట్టును హార్దిక్ పాండ్యా నడిపించాడు. దీంతో ప్రపంచకప్‌లో అతనే వైస్ కెప్టెన్‌గా ఉంటాడని అంతా అనుకున్నారు. అయితే, ఐపీఎల్-17లో నిరాశపరుస్తున్న పాండ్యాపై సెలెక్టర్లు వేటు వేసినట్టు సమాచారం. వికెట్ కీపర్ రిషబ్ పంత్‌‌కు డిప్యూటీ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి.

ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా హార్దిక్ పాండ్యా ఘోరంగా విఫలమవుతున్నాడు. పాండ్యా నాయకత్వంలో ముంబై జట్టు 9 మ్యాచ్‌ల్లో మూడింట మాత్రమే నెగ్గింది. అంతేకాకుండా, పాండ్యా బ్యాటుతో, బంతితో నిరాశపరుస్తూ విమర్శలు ఎదుర్కొంటున్నాడు.

మరోవైపు, ఈ సీజన్‌లో రిషబ్ పంత్ అదరగొడుతున్నాడు. 2022 డిసెంబర్‌లో కారు ప్రమాదం నుంచి కోలుకున్న తర్వాత అతను ఐపీఎల్‌తోనే మైదానంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. తన ఆటతో మునపటి రిషబ్‌ను గుర్తు చేస్తున్నాడు. 11 మ్యాచ్‌ల్లో 158.56 స్ట్రైక్‌రేటుతో 398 పరుగులు చేశాడు. ఢిల్లీ క్యాపిటల్స్ తరపున అతనే టాప్ స్కోరర్. వికెట్ కీపింగ్ నైపుణ్యాలతోనూ ఆకట్టుకున్నాడు. అలాగే, ఢిల్లీ కెప్టెన్‌గా తన మార్క్‌ను చూపిస్తున్నాడు. ఈ నేపథ్యంలో టీ20 ప్రపంచకప్‌లో రోహిత్‌కు డిప్యూటీగా పంత్‌ను ఎంపిక చేయాలని సెలెక్టర్లు భావిస్తున్నట్టు తెలుస్తోంది. జట్టు ప్రకటన తర్వాతే దీనిపై స్పష్టత రానుంది. 

Similar News