ఘరానా మోసం.. ఆధార్ కార్డుపై కేసు ఉందని రూ.కోట్లు కొట్టేశారు

ఆధార్ కార్డుపై కేసు ఉందని రూ.కోట్లు కొట్టేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన నిందితులు కోరుట్ల పట్టణానికి చెందిన బాశెట్టి శంకరయ్య అనే వ్యక్తిని సారిక వర్మ పేరుతో వచ్చిన ఫోన్ కాల్ తో ట్రాప్ చేశారు.

Update: 2024-04-27 15:41 GMT

దిశ, కోరుట్ల టౌన్ : ఆధార్ కార్డుపై కేసు ఉందని రూ.కోట్లు కొట్టేశారు. కేరళ రాష్ట్రానికి చెందిన నిందితులు కోరుట్ల పట్టణానికి చెందిన బాశెట్టి శంకరయ్య అనే వ్యక్తిని సారిక వర్మ పేరుతో వచ్చిన ఫోన్ కాల్ తో ట్రాప్ చేశారు. మీ ఆధార్ కార్డు అక్రమంగా వినియోగించి ముంబైలో మీపై కేసు నమోదైందని, మీ ఆధార్ కార్డు మనీ లాండరింగ్ కేసులో లింక్ అయిందంటూ భయబ్రాంతులకు గురిచేసి అతడి వద్ద నుండి కోట్ల రూపాయలు నిందితుల ఖాతాలోకి మళ్లించుకున్నారు. ఈ సంఘటన కోరుట్లలో జరిగింది. చివరకు మోసపోయానని గమనించిన బాధితుడు కోరుట్ల ఠాణాలో ఫిర్యాదు చేయగా రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను కేరళ రాష్ట్రానికి వెళ్లి వారం రోజులపాటు శ్రమించి పట్టుకొని కోరుట్లకు తీసుకువచ్చారు.

    అందుకు సంబంధించిన వివరాలను కోరుట్ల సీఐ, సురేష్ బాబు, ఎస్సై కిరణ్ కుమార్, మేడిపల్లి ఎస్సై శ్యామ్ రాజ్ శనివారం మీడియాకు వెల్లడించారు. కేరళ రాష్ట్రానికి చెందిన షౌకత్ అలీ, అబ్దుల్ బాసిత్, సిద్ధికుం అక్బర్, అజ్మల్ పొక్కుట్టి, కంరోద్దిన్ అనే ఐదుగురు నిందితులు కోరుట్లకు చెందిన శంకరయ్యను మీ ఆధార్ కార్డుపై మనీలాండరింగ్ కేసు నమోదైందని సుప్రీం కోర్టుపేరుతో నకిలీ నోటీస్ పంపి భయబ్రాంతులకు గురి చేశారు. మీ బ్యాంకు ఖాతాలో గల డబ్బులు సవిత అనే అకౌంట్ లో వేయాలని కోరగా వెంటనే వాటిని తిరిగి ఇస్తామని నమ్మించడంతో శంకరయ్య తన అకౌంట్లో గల రూ.3 కోట్ల 23 లక్షల 65 వేలను నిందితుల అకౌంట్లోకి పంపించినట్లు తెలిపారు.

    జరిగిన విషయం ఎవరికీ చెప్పకుండా గోప్యాంగా ఉంచాలని నిందితులు శంకరయ్యను ఆదేశించారు. గత ఏడాది డిసెంబర్ 9న ఆకాష్ పేరుతో ఉన్న అకౌంట్ లో మరో రూ. కోటి పంపిస్తే మీ కేసు పూర్తవుతుందని చెప్పారు. అది నమ్మి బాధితుడు మరో రూ. కోటి నిందితులకు అందించారు. అవి కాకుండా 20 ఏళ్ల షేర్ మార్కెట్ డబ్బులు సైతం పంపించాలని కోరగా చివరికి మోసపోయినట్లు గమనించి గత సంవత్సరం డిసెంబర్ 27న కోరుట్ల పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. రంగంలోకి దిగిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. పట్టుకున్న నిందితులను కోర్టుకు తరలించారు. నిందితులను పట్టుకోవడంలో చాకచక్యం ప్రదర్శించిన వారిని ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అభినందించారు. 

Similar News