అమిత్ షా.. నేరుగా పాతబస్తీకే..

by  |
అమిత్ షా.. నేరుగా పాతబస్తీకే..
X

దిశ, తెలంగాణ బ్యూరో : పాతబస్తీ వేడక్కనుంది. శనివారం సీఎం ఆదిత్యనాథ్ యోగి పర్యటన ఉండగా.. ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఢిల్లీ నుంచి నేరుగా పాతబస్తీకి చేరుకోనున్నారు. చార్మినార్ దగ్గరి భాగ్యలక్ష్మి ఆలయాన్ని సందర్శించి.. పావుగంట పాటు అక్కడే అమ్మవారికి జరిగే ప్రత్యేక పూజలో పాల్గొననున్నారు. ఇప్పటికే హైదరాబాద్ లో బీజేపీ, ఎంఐఎం పార్టీలు ప్రచారంలో మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. ఒకరినొకరు సవాళ్లు విసుకుంటుంన్నారు. ఈ పరిస్థితుల్లో అమిత్ షా పర్యటన ఓల్డ్ సిటీ నుంచి ప్రారంభం అవుతుండడంతో నగరంలో ఉత్కంఠ నెలకొన్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వరద సాయంపై లేఖ రాసినట్లు వివాదం వచ్చినప్పుడు ఈ ఆలయాన్నే సందర్శించి ఆ లేఖ రాయలేదంటూ ప్రమాణం చేశారు. ఇప్పుడు అమిత్ షా ఆదివారం ఉదయం 10.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి రోడ్డుమార్గం గుండా 11.30 గంటలకు నేరుగా భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయానికే చేరుకుంటారు. అక్కడి నుంచే ఆయన ఎన్నికల ప్రచార కార్యక్రమం ప్రారంభమవుతుంది.

భాగ్యలక్ష్మి ఆలయంలో పూజల అనంతరం అమిత్ షా సనత్‌నగర్, ఖైరతాబాద్, జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో రోడ్‌షోలు నిర్వహిస్తారు. సుమారు రెండు గంటల పాటు జరిగే రోడ్‌షోల అనంతరం నేరుగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడే లంచ్ చేసి మీడియా కాన్ఫరెన్సు నిర్వహిస్తారు. సాయంత్రం ఐదు గంటలకల్లా ఎన్నికల ప్రచార గడువు పూర్తవుతున్నందున పార్టీ రాష్ట్ర, నగర నాయకులతో ఎన్నికలకు సంబంధించిన అంశాలపై అంతర్గతంగా చర్చిస్తారు. రాత్రి 9.30 గంటలకు తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారు.

Next Story

Most Viewed