బీజేపీ ప్రచారానికి అమిత్ షా

by  |
బీజేపీ ప్రచారానికి అమిత్ షా
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ ఎన్నికలు హైదరాబాద్ నగరానికి సంబంధించినవే అయినప్పటికీ బీజేపీ మాత్రం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవాలనుకోవడం లేదు. జాతీయ నేతలందరినీ హైదరాబాద్ నగరానికి ప్రచారం నిమిత్తం రప్పిస్తోంది. ఇప్పటికే కేంద్ర మంత్రులు ప్రకాశ్ జవదేకర్, స్మృతి ఇరానీ వచ్చి వెళ్ళగా ఇక ప్రచారానికి నాలుగు రోజులే గడువు ఉన్నందున కీలక నేతలను కూడా ఇక్కడికి తీసుకువస్తోంది. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ తదితరులంతా నగరంపై ప్రచారం కోసం దండయాత్ర చేయనున్నారు.

బీజేపీ మాజీ అధ్యక్షుడైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగింపు రోజున హైదరాబాద్‌లో రోడ్ షో నిర్వహించనున్నారు. దానికి ముందు రోజు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం చేయనున్నారు. కేవలం రోడ్ షో, ర్యాలీలకు మాత్రమే పరిమితం కాకుండా వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాలతో, ఆయా రాష్ట్రాల అసోసియేషన్లతో వీరిరువురూ సమావేశాల్లో పాల్గొనేలా బిజీ షెడ్యూలు తయారుచేయడంపై రాష్ట్ర నాయకత్వం దృష్టి పెట్టింది. ఈనెల 28న ముఖ్యమంత్రి కేసీఆర్ ఎల్బీనగర్‌లో బహిరంగసభ నిర్వహిస్తున్న రోజునే బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో కూడా భారీ కార్యక్రమానికి రాష్ట్ర పార్టీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది.

అసెంబ్లీ ఎన్నికలను మించిపోయి జీహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ సర్వశక్తులూ ఒడ్డుతోంది. కేవలం సింగిల్ డిజిట్‌కు మాత్రమే గత ఎన్నికల్లో పరిమితమైన బీజేపీ ఇప్పుడు ఏకంగా మేయర్ పీఠాన్నే కొట్టేయాలనుకుంటోంది. దుబ్బాక గెలుపుతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ దాన్ని రిపీట్ చేయడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదులుకోడానికి సిద్ధంగా లేదు. అందులో భాగమే కేంద్రమంత్రులు, జాతీయ స్థాయి గుర్తింపు ఉన్న నాయకులను హైదరాబాద్‌లో ప్రచారానికి వినియోగించుకోవడం విశేషం.



Next Story

Most Viewed