నెలాఖరులో అమెరికా లాక్‌డౌన్ ఎత్తేస్తుందా?

by  |
నెలాఖరులో అమెరికా లాక్‌డౌన్ ఎత్తేస్తుందా?
X

వాషింగ్టన్ : అమెరికా.. కరోనాతో కొట్టుమిట్టాడుతున్నది. అక్కడ రోజుకు కొన్నిసార్లు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ఇప్పటి వరకు 28వేలకుపైగా మృతిచెందారు. ఆరు లక్షల కరోనా పాజిటివ్ కేసులు నమోదవడం గమనార్హం. అటువంటి దుస్థితిని ఎదుర్కొంటున్న అమెరికాలో లాక్‌డౌన్ ఎత్తేవేసే చర్చలు జరుపుతున్నట్టు ఆ దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. ఈ ఎత్తివేత కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పరిమితం చేస్తామని ఆయన ప్రకటించారు. దేశ ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోక తప్పదని.. కొత్త కరోనా కేసులు భారీగా నమోదవుతున్నా.. కోలుకుంటున్న వారి సంఖ్య కూడా పెరుగుతూనే ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయని ట్రంప్ అన్నారు. దేశాన్ని పూర్వ స్థితికి తీసుకొని రావల్సిన సమయం ఆసన్నమైందని ఆయన వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 33 లక్షల మందికి కరోనా నిర్థారణ పరీక్షలు జరిపామని.. త్వరలోనే యాంటీ బాడీ టెస్టులు కూడా చేస్తామని ట్రంప్ వెల్లడించారు. ఈ పరీక్షలన్నీ లాక్‌డౌన్ ఎత్తివేసే అంశంలో కీలకంగా మారతాయని ట్రంప్ అన్నారు. కోవిడ్ – 19 కేసులు తక్కువగా నమోదయ్యే రాష్ట్రాలలో లాక్‌డౌన్ ఎత్తివేసి.. ముఖ్యమైన కార్యకలాపాలు ప్రారంభించే అవకాశాలు ఉన్నట్లు ట్రంప్ చెప్పారు. లాక్‌‌డౌన్ ఎత్తివేస్తేనే దేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి గాడిన పడుతుందని ఆయన చెబుతున్నారు. గురువారం ఆయన అన్ని రాష్ట్రాల గవర్నర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి లాక్‌డౌన్ ఎత్తివేత సంకేతాలు ఇచ్చారు.

ట్రంప్ వ్యాఖ్యల నేపథ్యంలో వైట్ హౌస్ టాస్క్‌ఫోర్స్ ప్రతినిధి డెబోరా బిర్క్స్ మరిన్ని వివరాలు వెల్లడించారు. లాక్‌డౌన్ ఎత్తివేతకు సంబంధించి ప్రస్తుతం మార్గదర్శకాలు రూపొందుతున్నాయని ఆమె చెప్పారు. ప్రజలందరూ భౌతిక దూరం పాటించాల్సిందేనని.. సభలు, సమావేశాలపై నిషేధం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేశారు. ఇప్పటి వరకు వెయ్యి కంటే తక్కువ కేసులు నమోదైన రాష్ట్రాలు లేదా సగటున రోజులు 30 కేసుల కంటే తక్కువ నమోదవుతున్న రాష్ట్రాల్లో మాత్రం లాక్‌డౌన్ నిబంధనలు సడిలించే అవకాశం ఉందని ఆమె చెప్పారు. ఇలాంటి పరిస్థితి ఉన్న ఆర్కన్సస్, హవాయ్, మైన్, మెంటానా, నెబ్రాస్కా, నార్త్ డకోటా, వెర్మోంట్, వెస్ట్ వర్జీనియా, యోమింగ్ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ నిబంధనలు ఈ నెల చివరి నాటికి సడలిస్తామని.. పరిస్థితి మరింత మెరుగ్గా ఉంటే లాక్‌డౌన్ పూర్తిగా ఎత్తివేస్తామని ఆమె స్పష్టం చేశారు. కాని లాక్‌డౌన్ తర్వాత కూడా తప్పని సరిగా భౌతిక దూరం పాటించాల్సి ఉంటుందని… ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని ఆమె చెప్పారు. అమెరికా ప్రభుత్వం లాక్‌డౌన్ నిబంధనలు ఎత్తేసినా.. అంతిమంగా అమలు చేయాల్సిందే ఆయా రాష్ట్రాల గవర్నర్లు, మేయర్లు మాత్రమే నని.. వారి నిర్ణయమే తుది నిర్ణయం అవుతుందని ఆమె స్పష్టం చేశారు.

Tags: america, us, donald trump, lockdown, revoke, dilute, states

Next Story

Most Viewed