ఫలించిన బీజేపీ నేతల స్కెచ్.. ఏపీ గవర్నర్ మార్పు..?

by  |
ap-governer harichandan
X

దిశ, ఏపీబ్యూరో : ఏపీలో బలోపేతం కావాలని భావిస్తున్న బీజేపీకి ఎక్కడా కాలం కలిసిరావడం లేదు. 2019 ఎన్నికల నుంచి ఇప్పటివ‌ర‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఎక్కడా బోణీ కొట్టలేదు. అయితే, 2024 ఎన్నికల్లోపు ఎలాగైనా బలోపేతం కావాలని వ్యూహరచన చేస్తోంది. ఈ నేప‌థ్యంలో ప్రభుత్వాన్ని ఇర‌కాటంలోకి నెట్టేలా కార్యాచరణ రూపొందిస్తోందని తెలుస్తోంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలంటే అందుకు రాజ్యాంగ బ‌ద్ధమైన ప‌ద‌విలో ఉన్న గ‌వ‌ర్నర్ త‌మ‌కు అనుకూలంగా వ్యవ‌హ‌రించాల‌ని ఏపీ బీజేపీ నేతలు కోరుతున్నారట.

ప్రస్తుత గ‌వ‌ర్నర్‌ బిశ్వభూష‌ణ్ హ‌రిచంద‌న్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరించలేదు. వైసీపీ బిల్లుల విషయంలో కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వం తీసుకున్న అన్ని నిర్ణయాలకు సై అంటూనే ఉన్నారు. ఇటీవ‌ల గ‌వ‌ర్నర్ కోటాలో న‌లుగురు ఎమ్మెల్సీల నామినేష‌న్ విష‌యంలో సంబంధిత ఫైల్ కొన్ని రోజులు నిలిపివేశారు. సీఎం జ‌గ‌న్ వెళ్లి గ‌వ‌ర్నర్‌తో చ‌ర్చించిన వెంటనే ఎమ్మెల్సీల ఆమోదానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. ఇకపోతే, ఏపీ రాజకీయాల్లో ఇప్పటికీ హాట్ టాపిక్‌గా ఉన్న అమ‌రావ‌తి మార్పు విష‌యంలోనూ గ‌వ‌ర్నర్ మౌనంగా ఉన్నారు. దీంతో గ‌వ‌ర్నర్‌ను మార్చాల‌ని బీజేపీ నేతలు జాతీయ నాయకత్వంపై ఒత్తిడి పెంచుతున్నారని తెలుస్తోంది.

గ‌తంలో పుదుచ్చేరి లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ కిరణ్ బేడీ వ్యవ‌హ‌రించినట్లుగా.. ఏపీలోనూ గ‌వ‌ర్నర్ యాక్టివ్‌గా ఉంటూ.. ప్రభుత్వాన్ని ఇరుకున పెడితే బీజేపీ బలోపేతం అవుతుందని కొందరు బీజేపీ నేతలు కేంద్రం వద్ద ప్రస్తావిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో గ‌వ‌ర్నర్ మార్పు ఖాయ‌మ‌ని తెగ ప్రచారం జరుగుతుంది. ఇటీవలే గవర్నర్‌కు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో ఇక గవర్నర్‌ మార్పు తథ్యమంటూ సోషల్ మీడియాలో వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఇదిలాఉంటే జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా బీజేపీ అధిష్టానం వ్యవహరించదని మరో వాదన వినిపిస్తోంది. జగన్ బీజేపీతో సఖ్యతగా ఉంటున్నారు. బీజేపీ ప్రవేశపెట్టే అన్ని బిల్లులకు మద్దతు తెలుపుతున్నారు. సీఎం జగన్‌కు కేంద్రంలోని పెద్దలకు ఎలాంటి వివాదాలు లేని నేపథ్యంలో గవర్నర్‌ని మార్చరని ప్రచారం కూడా ఉంది. ప్రస్తుత గవర్నర్ హరిచందన్ పదవీ కాలం జూలై 23తో ముగియనున్న సంగతి తెలిసిందే.



Next Story

Most Viewed